హీరోలందరూ బిజీ అన్నారు.. ఇది నా సీజన్‌ కాదు: టాప్ దర్శకుడు

ABN , First Publish Date - 2022-03-15T23:09:28+05:30 IST

ఇందులోని కీలక పాత్రకు ఎంతో మందిని సంప్రదించాం. కానీ, చివరకు నేనే నటించాను. సినిమాలో రోబో పాత్ర అత్యంత కీలకం. బలమైన సెంటిమెంట్స్‌, ఎమోషన్స్‌తో పాటు హాస్యం కూడా పుష్కలంగా ఉంది. చిన్నారులతో కుటుంబ ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఆడియోను పెద్ద హీరోతో రిలీజ్‌ చేయించాలని భావించి అనేక మందిని..

హీరోలందరూ బిజీ అన్నారు.. ఇది నా సీజన్‌ కాదు: టాప్ దర్శకుడు

తమిళ చిత్రపరిశ్రమలో మంచి మనసు ఉన్న వ్యక్తి దర్శకుడు కేఎస్‌.రవికుమార్‌ అని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తనవద్ద పనిచేసే అసిస్టెంట్‌ డైరెక్టర్లను దర్శకులుగా ప్రోత్సహించడమే కాకుండా, స్వయంగా ఆయనే సినిమాలు నిర్మించడం చాలా గొప్ప విషయమని కోలీవుడ్‌ దర్శకులు విక్రమన్‌, ఆర్‌.కె. సెల్వమణి, ఆర్‌.వి. ఉదయ కుమార్‌, పేరరసు, తంగర్‌ బచ్చన్‌ తదితరులు కొనియాడారు. కేఎస్‌ రవి కుమార్‌ సమర్పణలో ఆర్‌.కె.సెల్యులాయిడ్స్‌, కల్లల్‌ గ్లోబెల్‌ ఎంటర్‌‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గూగుల్‌ కుట్టప్పా’. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుక తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఇందులో అనేక మంది దర్శకులు, సినీ ప్రముఖులు, చిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా కేఎస్‌. రవికుమార్‌ మాట్లాడుతూ... ‘‘ఇది మలయాళ చిత్రానికి రీమేక్‌. శబరి, శరవణన్‌లు తమిళ నెటివిటీకి అనుగుణంగా స్ర్కిప్టు సిద్ధం చేశారు. ఇందులోని కీలక పాత్రకు ఎంతో మందిని సంప్రదించాం. కానీ, చివరకు నేనే నటించాను. సినిమాలో రోబో పాత్ర అత్యంత కీలకం. బలమైన సెంటిమెంట్స్‌, ఎమోషన్స్‌తో పాటు హాస్యం కూడా పుష్కలంగా ఉంది. చిన్నారులతో కుటుంబ ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఆడియోను పెద్ద హీరోతో రిలీజ్‌ చేయించాలని భావించి అనేక మందిని సంప్రదించాను. కానీ, వారంతా బిజీగా ఉన్నామని చెప్పారు. ఇది వారి సీజన్‌. నా సీజన్‌ కాదు. అందుకే నా కుటుంబ (దర్శకుల సంఘం) సభ్యులతో ఈ ఆడియోను రిలీజ్‌ చేయాలని నిర్ణయించి వీరందరినీ ఆహ్వానించాను. మీడియా కూడా తనవంతు సహకారం అందించాలి’’ అని కేఎస్‌. రవికుమార్‌ కోరారు. 


అనంతరం విక్రమన్‌, ఆర్‌కె.సెల్వమణి, ఉదయకుమార్‌, పేరరసు మాట్లాడుతూ.. కేఎస్‌ రవికుమార్‌ ఒక దర్శకుడుగానే కాకుండా వ్యక్తిగతంగా ఎంతో మంచి వ్యక్తి. కేఎస్‌ రవికుమార్‌ గురువు (విక్రమన్‌) పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో ఉంటారు. అలాగే, కేఎస్‌ వద్ద పనిచేసే అసిస్టెంట్‌ డైరెక్టర్లను ప్రోత్సహించడమే కాకుండా ఒక నిర్మాతగా మారి.. వారి దర్శకత్వంలో సినిమాలు నిర్మించడం అంటే చాలా గొప్ప విషయం అని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో తమిళ ‘బిగ్‌బాస్‌’ ద్వారా ఫేమస్‌ అయిన దర్శన్‌, లోస్లియా మరియనేశన్‌ హీరో హీరోయిన్లుగా నటించగా, కేఎస్‌. రవికుమార్‌ కీలక పాత్రను పోషించారు. యోగిబాబు తదితరులు నటించారు. జిబ్రాన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి త్వరలోనే విడుదల తేదీని వెల్లడించనున్నారు. 

Updated Date - 2022-03-15T23:09:28+05:30 IST