Krishnamraju: 'గోపీకృష్ణా మూవీస్' ప్రారంభమయింది ఇలాగే..

ABN , First Publish Date - 2022-09-12T00:14:18+05:30 IST

రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన సంగతి తెలిసందే. అయితే, ఆయన తన బయోగ్రఫీ రాసుకున్నారు. దీనిలో ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వివరించారు.

Krishnamraju: 'గోపీకృష్ణా మూవీస్' ప్రారంభమయింది ఇలాగే..

రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. నటుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అంతేకాదు, నిర్మాతగా మారి గోపీకృష్ణా మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి పలు సక్సెస్‌లను చూశారు. అయితే, ఈ సంస్థ స్థాపించడానికి అసలు కారణం ఏంటీ.. ఇందులో ఉన్న భాగస్వాములు ఎవరెవరూ.. అనే విషయాలను గతంలో ఒకసారి తెలిపారు.  అలాగే ఆయన నటించి, నిర్మించిన 'కృష్ణవేణి' చిత్రం గురించి ఎన్.టి. రామారావు స్పందించిన తీరును వివరించారు.


ఆ విషయాలు కృష్ణంరాజు మాటల్లో.. 'ఇంటి దొంగలు' తరువాత నాకు హీరోగా వరుస ఆఫర్లు వచ్చాయి. ఒకవైపు విలన్‌గా, మరోవైపు హీరోగా చాలా బిజీ. అప్పుడే సొంతగా చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టాను. దీనికి శ్రీకారం ఎలా జరిగిందంటే.. నేటి పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర మాజీ మంత్రి హరిరామ జోగయ్య.. నేను నటించిన 'కృష్ణవేణి' చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. అప్పటి నుంచి ఆయన మంచి మిత్రుడయ్యాడు. అలాగే మరో మిత్రుడు నిర్మాత చలసాని గోపి. ముగ్గురం ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. వాళ్లిద్దరూఅంతకముందు నిర్మించిన చిత్రాలలో ఆర్ధికంగా దెబ్బతిన్నారు. వాళ్ళకు ఒక సినిమా చేయాలి అనే కోరికతో సినిమా మొదలుపెట్టాము. వి.మధుసూధన్ రావు దర్శకుడిగా నేను, వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా అనుకుని స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకున్నాం. ముందు బ్లాక్ అండ్ వైట్‌లో చేద్దాం అనుకున్నాం. కానీ, స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక ఇలాంటి కథను కలర్‌లో చేస్తేనే బాగుంటుందనిపించింది. దాంతో బడ్జెట్ బాగా పెరిగింది. అంత బడ్జెట్ అంటే మేము పెట్టలేమన్నారు నా మిత్రులిద్దరూ. అప్పుడు నేను మేజర్ షేర్ పెట్టి 'గోపీకృష్ణా మూవీస్' బ్యానర్ మీద ఈ సినిమా తీశాం. నిర్మాణంలో నాకు చేదోడు వాదోడుగా ఉండటానికి నా తమ్ముడు సూర్యనారాయణ రాజును పిలిపించుకున్నాను. 


చిత్ర పరిశ్రమలో మా సబ్జెక్ట్ ఆసక్తికరమైన చర్చగా మారింది. ఎందుకంటే అదొక నెగిటివ్ పాయింట్. హీరోయిన్ రేప్ అవుతుంది... రేప్‌కు గురైన ఆడది ఒక మంచి ఇల్లాలు, మంచి తల్లి, మంచి వ్యక్తిత్వం కలిగిందే అయినప్పటికీ కేవలం తనపై జరిగిన అత్యాచారం కారణంగా ఆమెకు జీవితమే లేకుండా పోవాలా? అన్న ప్రశ్నను సమాజం ముందుంచే సబ్జెక్ట్ అది. 'కృష్ణంరాజు పొగరెక్కి తరతరాల సెంటిమెంట్‌కు ఎదురెళ్తున్నాడు... ఈ దెబ్బతో వీడు అయిపోయాడు' అనే కామెంట్స్ బాగా వినిపించాయి. సరే! ఎన్ని విమర్శలు ఎన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో ఆ చిత్రాన్ని పూర్తిచేశాం. ఫస్ట్ కాపీ రెడీ అయింది. ప్రివ్యూ షోకు ఎన్.టి. రామారావు గారిని ఇన్వైట్ చేశాను. ఫస్ట్ హాఫ్ చూశారు. ఇంటర్వల్‌లో బయటకు వచ్చినప్పుడు కాఫీ తాగుతూ 'కంగ్రాట్స్ బ్రదర్! చాలా గొప్ప సబ్జెక్ట్ తీసుకున్నారు. అసలు ఇంటర్వెల్ ఎందుకు ఇచ్చారు? కంటిన్యూ చేయాల్సింది నెక్స్ట్ ఏమవుతుందో చూడాలని చాలా ఆత్రంగా ఉంది... త్వరగా స్టార్ట్ చేయండి' అన్నారు. సెకండాఫ్ పూర్తైంది. 'వెల్ డన్ బ్రదర్! చాలా గట్స్ కావాలి ఇలాంటి సబ్జెక్ట్ చెయ్యటానికి, ఇది నెగిటివ్ పాయింట్ అని, అదనీ, ఇదనీ మిమ్మల్ని చాలా మంది నిరుత్సాహపరుస్తారు... మీరేమీ ఆలోచించకండి. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవుతుంది'.. అని రామారావుగారు చెప్పారు.

Updated Date - 2022-09-12T00:14:18+05:30 IST