Krishnam Raju vs Mullapudi Venkata Ramana: రాజులా బతికిన కృష్ణంరాజు ముళ్ళపూడి వద్ద అప్పు ఎందుకు చేశారు..? కోర్టు కేసులో ఏం తేలిందంటే..!

ABN , First Publish Date - 2022-09-14T03:04:41+05:30 IST

మచ్చలేని మారాజుగా నిండైన జీవితం గడిపి, ఆదివారం (సెప్టెంబర్ 11) కన్నుమూశారు రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebel Star Krishnam Raju). తాను జీవితమంతా రాజుగానే బ్రతికానని..

Krishnam Raju vs Mullapudi Venkata Ramana: రాజులా బతికిన కృష్ణంరాజు ముళ్ళపూడి వద్ద అప్పు ఎందుకు చేశారు..? కోర్టు కేసులో ఏం తేలిందంటే..!

మచ్చలేని మారాజుగా నిండైన జీవితం గడిపి, ఆదివారం (సెప్టెంబర్ 11) కన్నుమూశారు రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebel Star Krishnam Raju). తాను జీవితమంతా రాజుగానే బ్రతికానని ఆయన చాలాసార్లు చెప్పుకున్నారు. రాజుగా అంటే ఆర్థికంగా కాదనీ, హార్దికంగా అని ఆయన మనసువిప్పి మాట్లాడిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (Open Heart With RK) కార్యక్రమంలో అన్నారు కూడా. అయితే అటువంటి కృష్ణంరాజు (Krishnam Raju) - రచయిత ముళ్ళపూడి వెంకటరమణని (Mullapudi Venkata Ramana) మోసం చేశారని, ఆయన సర్వం కోల్పోవడానికి కారణమయ్యారనీ ఆరోపణలకు గురయ్యారు. అవి కేవలం గాలివార్తలుగా ఆగిపోలేదు,  కోర్టు మెట్లెక్కాయి, పుస్తకాల లోగిళ్లలో కోళ్లై కూశాయి. కాబట్టి ఈ విషయంలో నిజానిజాలేమిటో నిర్ధారించుకోవాలంటే, అసలేం జరిగిందో తెలుసుకోవల్సిందే.



ఆత్మకథలో ఏమన్నారు ముళ్ళపూడి

ముళ్ళపూడి వెంకటరమణ (Mullapudi Venkata Ramana) తన ఆత్మకథని ‘కోతి కొమ్మచ్చి’, (ఇం)‘కోతి కొమ్మచ్చి’, ‘ముక్కోతి కొమ్మచ్చి’... అని మూడు భాగాల్లో రాశారు. మొదటిభాగం కోతి కొమ్మచ్చిలో కృష్ణంరాజు అప్పు వివాదం (Krishnam Raju Controversy) గురించి వివరంగా రాశారు. అయితే, కృష్ణంరాజు పేరు ఎక్కడా ప్రస్తావించకుండా ఎక్కువగా కన్నప్ప (Kannappa) అని, అక్కడక్కడా ఆరడుగులవాడని, తిన్నడు అని, కేంద్రమంత్రి అని రాసుకొచ్చారు.


"... అప్పులు చేసి బాగూపడ్డాను- అప్పులిచ్చి ఓగూపడ్డాను. రెండింటికీ రెండు డాక్టరేట్లు ఇచ్చారు. రెండో డాక్టరేట్ ఒక కన్నప్పకి అప్పిచ్చిన తప్పుకి. ఆరడుగుల పొడుగువాడి కంట గ్లిసరిన్ చూసి కన్నీరనుకొని జాలిపడి అప్పిచ్చాను. ఇంత గొప్పవాడు నన్ను అడిగాడే అన్న అహంకారపు మైకంలో- నా దగ్గర కొంతే ఉంటే మార్వాడీ దగ్గర మరికొంత అప్పు చేసి మరీ ఇచ్చాను. బాపుకి కూడా చెప్పకుండా ఇచ్చాను. ఉపకారం చేద్దాం అనుకున్నాను. అపకారికి అపకారం ఎవరేనా చేస్తారు. ఉపకారికి అపకారం చేయడం ఆయన ప్రత్యేకత. ఇందుకు హైద్రాబాదు కోర్టులే సాక్ష్యం." - అని కోతికొమ్మచ్చిలో రాశారు ముళ్ళపూడి. అదే పుస్తకంలో ఇదే అప్పుల వ్యవహారం గురించి బాపు చేసిన వ్యాఖ్యానం కూడా ఉంది. "... డబ్బు చేసిన స్థితిలోనే రమణ గారు కన్నప్ప గారికి అయిదు లక్షలు అప్పిచ్చారు. ఇదే ఛాన్సు అని - రమణగారికి డబ్బు నయం చేయడం గురించి నేను దేవుడితోనూ, దేవుడు కన్నప్ప గారితోనూ ఇంగ్లీషులో మాట్లాడటం జరిగింది. కన్నప్ప గారు అయిదు లక్షల అప్పును పదేళ్లపాటు వడ్డీతో అరవై డెబ్భై లక్షల దాకా డేకించి, పెంచి - రమణ గారి ఇల్లు అమ్మించి పెట్టారు. అప్పుడు డబ్బు కుదిరి పొగరు దిగిన రమణ గారు మా ఇంటి డాబా మీద వాలి మూడు గదుల వాటా కట్టుకున్నారు. ఆ విధంగా మేమిద్దరం మళ్ళీ ఒకే ఇంటివాళ్ళమయ్యాం."



అసలేమయ్యింది? 

కృష్ణంరాజు నిర్మాతగా మొదటి సినిమా ‘కృష్ణవేణి’ అంటారు గానీ, ‘భక్త కన్నప్ప’ అనే చెప్పాలి. ఎందుకంటే, కృష్ణవేణిని చేగొండి హరిరామజోగయ్యతో కలిసి భాగస్వామ్యంతో నిర్మించిన సినిమా. కానీ, భక్త కన్నప్పకి కృష్ణంరాజు ఒక్కరే నిర్మాత, ఆ విధంగా అది ఆయనకి ఫస్ట్ వెంచర్. భక్త కన్నప్పని మొదట వి మధుసూదనరావు దర్శకత్వంలో బొల్లిముంత శివరామకృష్ణ రచనా సారథ్యంలో నిర్మించాలని అనుకున్నారు కృష్ణంరాజు. ఆ మేరకు బొల్లిముంత స్క్రిప్ట్ వర్క్ కూడా కొంత చేశారు. మొదటి ప్రయత్నం కచ్చితంగా హిట్ కావాలి అన్న ఉద్దేశంతో బాపు - రమణలతో బుద్ధిమంతుడు సినిమా నుంచి పరిచయం ఉన్న కృష్ణంరాజు (బుద్ధిమంతుడులో నటించారు కూడా), తన భక్త కన్నప్ప ప్రాజెక్టు బాపు- రమణలకు అప్పగించాలని నిర్ణయించుకొని, అమలు చేశారు.


సినిమా నిర్మాణం పూర్తయ్యే దశలో బడ్జెట్ లెక్కలు అనుకున్నట్టు సరిపోకపోవడంతో కృష్ణంరాజు డీలాపడిపోయారు. ఆయనకి ధైర్యం చెప్పి, భరోసా ఇచ్చిన ముళ్లపూడి ఒక మార్వాడీ సేఠ్ దగ్గర 5 లక్షలు అప్పు ఇప్పించారు; షూరిటీ ఇచ్చి, హామీ సంతకం చేశారు. ఆ దశలోనే కృష్ణంరాజు ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారట. దానికితోడు అంత వడ్డీ రేటు ఉంటుందని తెలియకపోవడం వల్ల కూడా కృష్ణంరాజు ఇవ్వలేకపోయారు. మార్వాడీ సేఠ్ పదే పదే ఫోన్లు చేయడంతో ముళ్లపూడి వెంకటరమణ కంగారు పడిపోయారు. 'యముని మహిషపు లోహపు గంటలు ఖణేల్మన్నట్టు...' సేఠ్ ఫోన్ శబ్దానికి ఉలిక్కిపడేవారట ముళ్లపూడి. ముళ్లపూడి సతీమణి, రచయిత్రి శ్రీదేవి ముళ్లపూడి రచించిన 'నెమరేసిన మెమరీస్ 'లో కూడా ఈ సంగతి రాశారామె. కృష్ణంరాజు కిమ్మనడం లేదని గాబరాపడ్డ ముళ్లపూడి సినీపెద్దలకి మొరపెట్టుకున్నారు.  ఫైనాన్సర్ సేఠ్ ఒత్తిడి భరించలేకపోతున్నానని సీనియర్ నిర్మాత డివిఎస్ రాజుకు ముళ్లపూడి చెప్పుకున్నారు. అప్పు విషయాన్ని బజారులోకి లాగి ముళ్ళపూడి తన పరువు తీశారని కృష్ణంరాజు బిగుసుకుపోయారు. 


ముళ్లపూడి ఇల్లు కొన్న ముమ్ముట్టి 

వడ్డీ చక్రవడ్డీల చంక్రమణంలో అప్పు తడిసి మోపెడై, సేఠ్ పోరు తట్టుకోలేక ఇష్టంగా కట్టుకున్న ఇల్లు అమ్మకానికి పెట్టేశారు ముళ్లపూడి. దాన్ని మళయాళం సూపర్ స్టార్ ముమ్ముట్టి కొన్నారు. నిజానికి తనకి మద్రాసులో ఇల్లు అవసరం లేనప్పటికీ, బాపు మీద ఉన్న అభిమానం, గౌరవం కారణంగా ముళ్లపూడి చెప్పిన ధరకే దాన్ని కొన్నాడట ముమ్ముట్టి. దాంతో అప్పులు తీర్చేశారు ముళ్లపూడి. బాపు ఇంటి మీద మూడు గదుల ఇల్లు కట్టుకునే కొద్దిపాటి డబ్బు మిగుల్చుకున్నారు.


కోర్టు గుమ్మాలు తొక్కి..

మద్రాసు కేసరి హైస్కూల్‌లో ముళ్ళపూడి క్లాస్ మేట్ నండూరి వెంకట సూర్యనారాయణ మూర్తి తర్వాత హైదరాబాద్ లో న్యాయవాది. అమెరికాలో 1970వ దశకంలోనే స్థిరపడిన ఇంజనీర్, వాణిజ్యవేత్త, రచయిత అయిన వంగూరి చిట్టెన్ రాజుకి నండూరి బావ అవుతారు. చిట్టెన్ రాజుకి బాపు- రమణ జంట అంటే వల్లమాలిన ప్రేమ. ముళ్లపూడి అవస్థలు చూసి నండూరి గారు కోర్టులో వేయమని సలహా ఇచ్చారు. అలా ఈ అప్పు కేసు (కృష్ణంరాజు నివాసం హైదరాబాద్ కావడం వల్ల) హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో దాఖలయ్యింది. అన్ని కేసుల్లానే అది కూడా పదేళ్లు సాగింది. వాయిదాలకి మద్రాసు నుంచి హైదరాబాద్ రాక తప్పేది కాదు ముళ్లపూడికి.


వాయిదాల మీద ఏళ్లకు ఏళ్లే దొర్లిపోతుంటే, ముళ్లపూడి విసిగిపోయారు. ఇదంతా తెలిసిన తెలుగువారైన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి, బాపు-రమణల వీరాభిమాని అయిన - జస్టిస్ పత్తిపాటి అంకమ్మ చౌదరి (పిఏ చౌదరి) తన ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి త్వరగా కేసు ముగింపుకి వచ్చేలా చూశారట. కృష్ణంరాజు ఓడిపోయి, ముళ్లపూడి గెల్చినప్పటికీ, ఐదు లక్షల అసలుకి కేవలం నాలుగు లక్షలే అని కోర్టు నిర్ణయించి, అది కూడా నెలకి 25,000 చొప్పున ఇన్ స్టాలుమెంట్లలో  చెల్లించేలా వచ్చిన తీర్పు వల్ల ముళ్లపూడికి ఏమీ ఒరగలేదు. కానీ, చట్ట ప్రకారం కృష్ణంరాజు అప్పు తీర్చినట్టే గానీ, న్యాయం ప్రకారం ఋణగ్రస్తులు అయ్యారనే చెప్పాలి.

Updated Date - 2022-09-14T03:04:41+05:30 IST