హరీశ్‌ శంకర్ గురించి నాకు మాత్రమే ఓ విషయం తెలుసు.. అదేంటంటే: కోట (పార్ట్ 56)

ABN , First Publish Date - 2021-11-27T03:56:37+05:30 IST

బీ.హెచ్‌.ఈ.ఎల్‌ లో అతని నాటకాలు నేను చూశాను. విషయం ఉన్న కుర్రాడని, పైకి వస్తాడని అప్పుడే అనిపించింది. నాకు కొడుకులాంటివాడు. ‘గబ్బర్‌సింగ్‌’లో అతను నాతో ఒక పెద్ద ప్రయోగాన్నే చేయించాడు. నటుడిగా కోట శ్రీనివాసరావు డైలాగు చెబితే ఎలా ఉంటుందో..

హరీశ్‌ శంకర్ గురించి నాకు మాత్రమే ఓ విషయం తెలుసు.. అదేంటంటే: కోట (పార్ట్ 56)

‌అలా ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేవారిలో మరొకరి పేరు తప్పక చెప్పాలి. ఆ వ్యక్తి హరీశ్‌ శంకర్‌. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు. నాకు హరీశ్‌ చిన్నతనం నుంచే తెలుసు. అతను మంచి రచయిత, దర్శకుడు అని లోకానికి తెలుసు. కానీ నాకు మాత్రమే తెలిసిన విషయం అతనిలో చక్కటి నటుడున్నాడని. బీ.హెచ్‌.ఈ.ఎల్‌ లో అతని నాటకాలు నేను చూశాను. విషయం ఉన్న కుర్రాడని, పైకి వస్తాడని అప్పుడే అనిపించింది. నాకు కొడుకులాంటివాడు. ‘గబ్బర్‌సింగ్‌’లో అతను నాతో ఒక పెద్ద ప్రయోగాన్నే చేయించాడు. నటుడిగా కోట శ్రీనివాసరావు డైలాగు చెబితే ఎలా ఉంటుందో తెలుగువాళ్లందరికీ ఎరుకే. కానీ నాతో పాట పాడించి నా గొంతును ఫుల్‌ ప్లెడ్జ్‌గా తెలుగువాళ్ళకి పరిచయం చేశాడు.‘మందుబాబులం మేము మందుబాబులం, మందుకొడితే మాకు మేమే మహారాజులం...’ అనే ఆ పాటను ఎలా పాడానో తలచుకుంటే నాకిప్పటికీ నవ్వు ఆగదు.


నా చేత ఆ పాట పాడించిన ఘనత హరీశ్‌కి దేవిశ్రీప్రసాద్‌కి దక్కుతుంది. ఒకరోజు ఏదో షూటింగ్‌కి వెళ్తున్నా. ‘సార్‌... హరీశ్‌ శంకర్‌గారు లైన్‌లో ఉన్నారు’ అని మా అసిస్టెంట్‌ రాజు ఫోన్‌ ఇచ్చాడు. ‘హలో.. ఏంటబ్బాయ్‌’ అన్నా. ‘ఏం లేదు బాబాయ్‌... మీకు ఇవాళ ఏమైనా షూటింగ్‌ ఉందా?’ అని అడిగాడు. ‘ఏం పనీ..?’ అన్నా. ‘ఏం లేదు. ఒక గంట మీతో పని ఉంది. ఒకవేళ ఎవరిదైనా షూటింగ్‌ ఉన్నా ఒక గంట పర్మిషన్‌ పెట్టి రాగలవా ప్లీజ్‌’ అన్నాడు. ‘సర్లే వస్తాను’ అన్నా. అతను అలా పిలవగానే నేనేమనుకున్నానంటే... ‘డబ్బింగ్‌ డైలాగుల్లో ఏమైనా మార్పులు వచ్చాయేమో, కొత్తగా ఏమైనా రాసుకున్నారేమో, సెన్సార్‌ కట్‌లు ఏమైనా పడ్డాయేమో.. వెళ్ళి సింక్‌ అయ్యేలాగా చెప్పిరావాలేమో’ అని. అదే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఉన్న ప్రసాద్‌ల్యాబ్‌కి వెళ్ళా. నా కారు నేరుగా డబ్బింగ్‌ స్టూడియో దగ్గరకు వెళ్ళబోతోంటే ‘అక్కడికి కాదు, ఇక్కడిక్కడే’ అని హరీశ్‌ శంకర్‌ మధ్యలో రికార్డింగ్‌ స్టూడియో దగ్గర ఆపాడు. ‘ఇక్కడ ఆపుతున్నాడేంటి? అందరూ ఇక్కడున్నారేమోలే’ అనుకుంటూ దిగా. లోపలికి తీసుకెళ్ళాడు. రికార్డింగ్‌ రూమ్‌ తలుపు తీస్తే అక్కడ దేవిశ్రీప్రసాద్‌ ఉన్నారు.


‘రండి కోటగారూ.. ఎలా ఉన్నారు’ అని ఆత్మీయంగా పలకరించారు దేవి. కుశల ప్రశ్నలు అయ్యాక నన్ను కూర్చోపెట్టి మందుబాబులం పాట ప్లే చేసి ‘ఎలా ఉంది కోటగారు’ అని అడిగారు. ‘బావుందండీ. మీరే పాడినట్టున్నారు. నేను యాక్ట్‌ చేశాను. ఆ వేళ సెట్‌లో విన్నాను. చాలా మంచి ట్యూన్‌. క్యాచీగా ఉంది. జనాల్లోకి వెళ్తుంది’ అని చెప్పా. ఆ కుర్రాడు అంతా విని.. ‘నిజమేనండీ. అందుకే ఇప్పుడు మీరు పాడబోతున్నారు ఈ పాటని’ అన్నారు. ఏదో జోక్‌ చేస్తున్నారు...తమాషాకి అంటున్నారని అనుకున్నా. వాళ్ళు నాతో పాట పాడించాలని ఫిక్సయ్యారనే విషయం నాకు అర్థం కాలేదు. ‘నేను పాడటం ఏంటి?’ అన్నా. ‘కాదు కాదండీ... నేను పాడితే మంచి సింగర్‌ పాడినట్టు ఉంది. మీరేమో... కాస్త రఫ్‌ వాయిస్‌తో పాడగలరు. చాలా నేచురల్‌గా సెట్‌ అవుతుంది. తాగుబోతు పాడినట్టు అనిపిస్తుంది. నేను, హరీశ్‌ ఆ విషయాన్నే డిస్కస్‌ చేసుకుని మిమ్మల్ని పిలిపించాం’ అన్నారు దేవి.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-11-27T03:56:37+05:30 IST