ఆ వేషం విషయంలో.. త్రివిక్రమ్‌కి చాలా రుణపడి ఉన్నా: కోట (పార్ట్ 51)

ABN , First Publish Date - 2021-11-18T03:20:36+05:30 IST

హీరోల సంగతి పక్కనపెడితే దర్శకుల్లో త్రివిక్రమ్‌ అంటే నాకు బాగా ఇష్టం. ఒకప్పుడు ఆత్రేయగారు, మొన్నటిదాకా జంధ్యాలగారు రాసేవారు కదా. ఆ కోవలో రాయగల రచయిత త్రివిక్రమ్‌. ఏమీ అన్నట్టే ఉండదు, భాషను పలికినట్టే అనిపించదుగానీ అతని మాటల్లో భావం అక్షరాల్లో..

ఆ వేషం విషయంలో.. త్రివిక్రమ్‌కి చాలా రుణపడి ఉన్నా: కోట (పార్ట్ 51)

త్రివిక్రమ్‌ సో స్పెషల్‌ !

హీరోల సంగతి పక్కనపెడితే దర్శకుల్లో త్రివిక్రమ్‌ అంటే నాకు బాగా ఇష్టం. ఒకప్పుడు ఆత్రేయగారు, మొన్నటిదాకా జంధ్యాలగారు రాసేవారు కదా. ఆ కోవలో రాయగల రచయిత త్రివిక్రమ్‌. ఏమీ అన్నట్టే ఉండదు, భాషను పలికినట్టే అనిపించదుగానీ అతని మాటల్లో భావం అక్షరాల్లో పెడితే పేజీలకొద్దీ రాసుకోవచ్చు. అలతి అలతి పదాలు అంత గొప్ప భావాన్ని మోస్తాయని మనం కూడా ఊహించం. తీరా త్రివిక్రమ్‌ సినిమాల్లో విన్న తర్వాత ‘భలే చెప్పాడురా’ అనుకుంటాం. త్రివిక్రమ్‌ గొప్ప సంస్కారవంతుడు. అంతే చదువరి. గాల్లో నుంచి ఏదో సృష్టించేయాలని అనుకునే వ్యక్తిత్వం కాదు. ఏం చెప్పినా, ఏం రాసినా దానికో పద్ధతి ఉండాలనుకుంటారు. అదే లేకుంటే ఇంతమంది చేత ‘శభాష్‌’ అనిపించుకోవడం ఎంత కష్టమో కదా? ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. నేను ఒకసారి అమెరికా వెళ్లా. తానాకో, ఆటాకో సరిగా గుర్తులేదు. కానీ వాళ్ల ఆహ్వానం మీదే వెళ్లా. రిటర్న్‌ ఫ్లైట్‌ తెల్లారుజామున 5.15కి అనుకుంటా హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయింది. బయటికి రాగానే ప్రొడక్షన్‌ మేనేజర్‌ ఎదురొచ్చి ‘సార్‌, కారు రెడీగా ఉంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌’ అన్నాడు. సరే, ఇక ఇంటికొచ్చి మరలా ప్రయాణం చేయడం ఎందుకని అటు నుంచి అటే రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్లా. ఆ రోజును నేను జీవితంలో మర్చిపోలేనండీ.


నేను వెళ్లేసరికి అప్పుడప్పుడే అంతా షూటింగ్‌ స్పాట్‌కి చేరుకుంటున్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌ వచ్చి, ‘‘త్రివిక్రమ్‌ సినిమా అండీ... ‘అత్తారింటికి దారేది’ అనే పేరు అనుకుంటున్నారు. పెద్ద వేషం కూడా ఏమీ కాదు. త్రూ అవుట్‌ ఉండదు. సెకండాఫ్‌లో ఉంటుంది. కానీ ప్రాధాన్యం ఉన్న పాత్ర’’ అని చెప్పాడు. అంతలో మేకప్‌ మేన్‌ వచ్చాడు. అతనిచ్చిన పంచెకట్టుకుని, టీ షర్టు వేసుకుని, పైన కోటు తొడుక్కుని, నెత్తికి తలపాగా పెట్టుకుని అద్దంలో చూసుకుంటే గమ్మత్తుగా అనిపించింది. త్రివిక్రమ్‌ కనిపించి విష్‌ చేసి, ‘చాలా బావుందండీ’ అని వెళ్లారు. పవన్ కల్యాణ్‌, అలీ, నదియా, రావు రమేశ్‌, డా.భరత్, ప్రణీత అందరూ స్పాట్‌కు చేరుకున్నారు.


అంతలో, ‘నీ బిడ్డ పేవంటే (ప్రేమంటే) అంత గౌరవిస్తున్నావు. నా బిడ్డ పెళ్లంటే గుడ్డెంటుకంత గౌరవం లేదు ఈడికి... దాని పెండ్లికొండిన పలావు వాసన పదూళ్ళకి తగలాలనుకున్యా. ఇప్పుడీ గొడవ నూరూళ్ళకి తెలిసింది. ఎంత బైశాట్‌లు. ఈడబ్బ కట్నం దొబ్బె, ఈడు నన్ను దొబ్బె. నా బతుకు దూదికంటె సులకన, నీటికంటె పలసన అయిపోయె.. నువ్వు పెద్ద లాయరువంటగదా! నువ్వే న్యాయంజెప్పు స్వావే.. చెప్పూ..!’ అనే డైలాగున్న కాగితాన్ని తెచ్చిచ్చాడు సుధాకర్‌. అతను త్రివిక్రమ్‌ దగ్గర కో డైరెక్టర్‌ పనిచేస్తున్నాడు. తనిచ్చిన కాగితాన్ని చూస్తూ ఉంటే, ‘చూడు కోటయ్యా... త్రివిక్రమ్‌ ఈ సీన్‌ నీకు ఊరికే తమాషాకి పెట్టలేదు. మాటలు కూడా చాలా ప్రత్యేకమైన యాసలో రాశారు. అవి ఎవరో మాట్లాడుతుంటే పట్టుకున్నవి కాదు, ఈ పాత్ర కోసం కొన్ని పుస్తకాలు తెప్పించి, చదివి అందులోని పదాలు పట్టుకుని వాటిని డైలాగుల్లో పెట్టి నీకోసం రాశారు. అటు నెల్లూరు కాదు, ఇటు చిత్తూరు కాదూ... అదో టైపులో ఉంటుంది యాస. నీకే తర్వాత్తర్వాత అర్థమవుతుంది’ అన్నాడు. తను అటు వెళ్లగానే ఇంకోసారి డైలాగ్‌ చదువుకున్నా.‍‘ఎంత బైశాట్‌లు.. పలావ్‌ వాసన పది జిల్లాలు కొట్టాలి..’ అనే పదాలు నాకు బాగా నచ్చాయి. బైశాట్‌లు అంటే అర్థం కాలేదు. కనుక్కుంటే ‘అవమానం’ అనే అర్థం వస్తుందని చెప్పారు. ‘షాట్‌ రెడీ’ అనగానే వెళ్ళి చేసొచ్చా. త్రివిక్రమ్‌ నా దగ్గరికొచ్చి ‘మీరున్నారనే ధైర్యంతోనే అలాంటి డైలాగులు రాశానండీ’ అని అన్నారు. అదేంటండీ అని అంటే ‘మీరనీ, మీరైతేనే చెప్పగలుగుతారనీ రాశాను’ అన్నారు. ఆ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చినా చాలామంది ఫోన్లు చేసి ‘సీమ యాస’ను ఎంత బాగా పట్టుకున్నారండీ అంటుంటారు. క్రెడిట్‌ మొత్తం త్రివిక్రమ్‌దేనండీ అని చెబుతుంటాను నేను. ఎన్ని పాత్రలు చేసినా కొన్ని మనసుకు దగ్గరగా ఉంటాయి. ‘అత్తారింటికి దారేది’లో పాత్ర అటువంటిదే. ఆ వేషం విషయంలో నిజంగా త్రివిక్రమ్‌కి చాలా రుణపడి ఉన్నా. ఇంత పెద్ద మాట ఎందుకంటున్నానంటే సోషల్‌ పిక్చర్‌లో అలా వెరైటీగా గెటప్‌ పెట్టి, అంతటి ఇంపాక్ట్‌తో పాత్ర రాయడమంటే మాటలు కాదు. అనుకున్నప్పుడల్లా అలాంటి పాత్రలు కూడా పడవు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-11-18T03:20:36+05:30 IST