ప్రకాశ్ రాజ్ సంస్కారం గురించి అంతకంటే ఏం చెప్పను?: కోట (పార్ట్ 46)

ABN , First Publish Date - 2021-11-07T04:59:08+05:30 IST

ప్రకాశ్‌రాజ్‌ను తలచుకోగానే నాకు ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’ సినిమా గుర్తుకొస్తుంది. ఆ చిత్రం క్లైమాక్స్‌లో ఓ డైలాగ్‌ ఉంటుంది. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్‌, తమన్నా జంటగా నటించిన సినిమా అది. క్లైమాక్స్‌ సీన్‌ పూరిగారు రెండు, మూడు భాగాలుగా తీద్దామనుకున్నారట. అది నాకు తెలియదు. నాకు ఇచ్చిన పార్టును

ప్రకాశ్ రాజ్ సంస్కారం గురించి అంతకంటే ఏం చెప్పను?: కోట (పార్ట్ 46)

బృందావనం సినిమా క్లైమాక్స్‌లో నాకు కంటినొప్పి, కొడుకు పోయాడని మనసులో బాధ పట్టిపీడిస్తున్నాయి. ఇవన్నీ యూనిట్‌ వారికి తెలుసు. వారు నాకు గట్టిగా ఏమీ చెప్పలేకపోయారు.. దాంతో నేనే గమనించి ఆ సీన్లు పండించేందుకు నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాలనుకున్నాను. అలా క్లైమాక్స్‌ అద్భుతంగా వచ్చింది. సినిమా విడుదలై చాలా పెద్ద హిట్‌ అయింది. విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు దిల్‌రాజుగారు. ఆ సభలో తారక్‌ మాట్లాడుతూ ‘‘ఈ పాత్ర కోటగారుతప్ప ఇంకెవరూ చేయలేరు’ అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ స్టేజీమీదకు వచ్చి ‘కోట శ్రీనివాసరావుగారు నాకు ఇష్టమైన నటుడు. ఆయన నటన గురించి ఎంతని చెప్పాలి’ అన్నారు. అంతకు ముందు కూడా ఏదో ఇంటర్వ్యూలోనూ అదే మాట చెప్పాడని ఎవరో అన్నారు.


అతడి సంస్కారాన్నిఏమని వర్ణించాలి?

ప్రకాశ్‌రాజ్‌ను తలచుకోగానే నాకు ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’ సినిమా గుర్తుకొస్తుంది. ఆ చిత్రం క్లైమాక్స్‌లో ఓ డైలాగ్‌ ఉంటుంది. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్‌, తమన్నా జంటగా నటించిన సినిమా అది. క్లైమాక్స్‌ సీన్‌ పూరిగారు రెండు, మూడు భాగాలుగా తీద్దామనుకున్నారట. అది నాకు తెలియదు. నాకు ఇచ్చిన పార్టును నేను పెర్ఫార్మ్‌ చేసేశాను. అంతా ఆశ్చర్యపోయి షాట్‌ ఓకే చేసేశారు. ‘అదేంటి గురువుగారూ.. నేను మూడు టేకుల్లో తీద్దామనుకుంటే, ఒకే టేక్‌లో లాగించేశారు.. మీలాంటి గొప్ప నటులతో పనిచేస్తే స్ఫూర్తివంతంగా, ఉత్తేజకరంగా ఉంటుందండీ. చాలా సంతోషంగా ఉంది’ అన్నారు పూరిగారు. అప్పుడు అక్కడే ఉన్న ప్రకాశ్‌రాజ్‌ నాకు ఎదురుగా వచ్చి నిలబడి రెండు చేతులెత్తి నమస్కరించి ‘అన్నా.. నువ్వు నువ్వే.. నువ్వే.. ఇక అంతే’ అన్నారు. ఒక నటుడు... అందులోనూ ప్రకాశ్‌రాజ్‌లాంటి మంచి నటుడు నన్ను అలా అనడం నాకు కొంచెం గర్వంగా అనిపించింది. తోటి నటుడికి నమస్కారం పెట్టి వెళ్లాడంటే ప్రకాశ్ సంస్కారాన్ని గురించి నేను అంతకన్నా గొప్పగా ఏమని వర్ణించాలి? ఎలా చెప్పాలి? తోటి నటుడిగా అతనంటే నాకు చాలా గౌరవం.


రావు గోపాలరావుగారు, కైకాల సత్యనారాయణగారు, నూతనప్రసాద్‌గారు, గొల్లపూడి మారుతిరావుగారు... అబ్బబ్బో ఒకరా? ఇద్దరా? మరి వాళ్లు నన్ను ఆపాలనుకుని ఉంటే ఆపగలిగి ఉండొచ్చుగా? రావుగోపాలరావుగారు నన్ను ఆప్యాయంగా పలకరించిన సన్నివేశాలను ఇంతకు ముందు ఓ సారి చెప్పానుగా!. ఇక్కడ ఎవరూ ఎవరినీ ఆపలేరండీ. ఎవరి అదృష్టంవారిది. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం తప్పకుండా ఉండాలి. నాకన్నా గొప్ప ప్రతిభావంతులు బయట ఎంతో మంది ఉండొచ్చు. కానీ నాకు ఆ ఆవగింజంత అదృష్టం తోడై ఉండవచ్చు. ఇతరులకి నేను కాంపిటీషన్‌ అని, నేకు ఇంకొకరు పోటీ అని అనుకున్న క్షణాలే లేవండీ. అవతల వారు ఎవరైనా సరే బాగా చేశారంటే నేను మెచ్చుకుంటాను.


ప్రకాశ్‌రాజ్‌ గురించి నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. మరి నాక్కూడా తెలియకుండా ఎప్పుడైనా నోరు జారానేమో గుర్తులేదు. నేనెప్పుడూ పొరపాటున కూడా అవతలివారిని కించపరుస్తూ మాట్లాడను. అసలు నా స్వభావం అది కాదు. కాకపోతే నా భావాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేసే ప్రతిసారీ కాస్త కటువుగా మాట్లాడినట్టు అనిపిస్తుంటుంది. చాలా సందర్భాల్లో అది అవతలి వారికి ఇంకో రకంగా అర్థమయ్యే ప్రమాదం ఉంది. దీనికి ఓ ఉదాహరణ చెబుతాను.


‘ఆంధ్రజ్యోతి’లో ఒకసారి నన్ను ఇంటర్వ్యూ చేశారు. మాటల మధ్యలో ‘బ్రహ్మానందంగారి గురించి చెప్పండి?..’ అని అడిగారు. ‘ఏముందండీ చెప్పడానికి... ఆరేళ్ల నుంచి ఆయన ఒకటే వేషం వేసి లైఫ్‌ లాగుతున్నాడు. అందులో ఆయన తప్పేముంది? చాలా మంచి ఆర్టిస్ట్‌. అంత గొప్ప నటుడిని పరిశ్రమ ఉపయోగించుకోవడం లేదు. రిపీటెడ్‌గా ఒకే రకమైన వేషాలిచ్చి ఆయనలోని ప్రతిభను మరుగునపడేట్టు చేస్తోంది’ అన్నా. అంటే నా ఉద్దేశం బ్రహ్మానందంలాంటి గొప్ప ఆర్టిస్టుకు తగ్గ వేషాలు రావడం లేదని, రచయితలు రాయడం లేదని.. మూస పాత్రలనే ఇస్తున్నారనీ... అతని ప్రతిభను ఉపయోగించుకోలేకపోతున్నారని.. అంతే తప్ప చెడు ఉద్దేశం కాదు. కానీ అది చదివిన బ్రహ్మానందంగారు చాలా హర్ట్‌ అయ్యారని తర్వాత ఎవరో అన్నారు నాతో. ఇలాంటివి ఏవో అపార్థాలు వస్తుంటాయే తప్ప, ఉద్దేశపూర్వకంగా ఎవరినీ అనాలని నాకు ఉండదు. పొరపాటున కూడా అనను.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-11-07T04:59:08+05:30 IST