మీ అమ్మ కడుపు సల్లగుండ.. అంటూ దిష్టి తీశారు: కోట (పార్ట్ 38)

ABN , First Publish Date - 2021-10-15T04:33:43+05:30 IST

అంతలోనే ‘షాట్‌ రెడీ’ అన్నారు. నాకు డాబామీద నుంచి మెట్లు దిగే సన్నివేశం ప్లాన్ చేశారు. నేను కూడా గుండెలనిండా గాలి పీల్చుకుని వెళ్ళి ‘మెట్లు దిగుతూ ఓ డైలాగు చెప్పా’. ‘కట్‌.. షాట్‌ ఓకే’ అన్నారు డైరెక్టర్‌గారు. ‘ఇదిగో... రేయ్‌ కోటయ్యా.. ఒకసారి ఇట్రా’ అని పిలిచారు..

మీ అమ్మ కడుపు సల్లగుండ.. అంటూ దిష్టి తీశారు: కోట (పార్ట్ 38)

నిర్ణయించే జడ్జ్‌ ఎవరు?

తీరా షూటింగ్‌ రోజు రానే వచ్చింది. సెట్‌లో సుమన్, హీరోయిన్లు ఉన్నారు. సుమన్ అందగాడు. ఆజానుబాహుడు. చూడగానే ఎవరికైనా ఇట్టే నచ్చేరూపం. సీన్ కోసం రెడీ అవుతున్నారు సుమన్‌. అంతలో మా మేక్‌ప్‌మన్ మోహన్ నా దగ్గరకు వచ్చాడు. ‘సార్‌ మేకప్‌ సార్‌’ అన్నాడు. సరే అని అందర్నీ ఒకసారి విష్‌ చేసి మేక్‌ప్‌ రూమ్‌లోకి వెళ్ళాను. తలనిండా కాస్తంత పొడవు జుట్టు ఉండేలా విగ్గు ప్రిపేర్‌ చేయించాడు మోహన్. పువ్వుల డ్రెస్‌ కూడా చక్కగా కుట్టించాడు. మేకప్‌ చేసుకోవడం పూర్తయ్యాక చూసిన వారందరూ ‘చాలా బావుందండీ’ అనసాగారు. ‘గెటప్‌ నప్పింది.. అందరూ బావుందని అంటున్నారు. కానీ, ఆ పాత్ర ఎలా చేసి మెప్పించాలి?’ అని నాలో మథనం మొదలైంది. ‘అతిగా చేయకుండా, పాత్రకు సరిపోయినంత చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఒకసారి ఒక షాట్‌లో చేయడం వేరు. సినిమా మొత్తం ఆ వేషం చేయడం వేరు. ఎక్కువ తక్కువ చేస్తే సినిమా చూసే ప్రేక్షకుడు ఇట్టే కనిపెట్టేస్తాడు. ఒకే లెవె‌ల్‌లో, గ్రాఫ్‌లో హెచ్చుతగ్గులు లేకుండా చేయాలి. అలా చేస్తానో లేదో జడ్జి చేసి చెప్పేదెవరు?’ అని మనసులో ఎడతెరిపి లేకుండా నాలో ఆలోచనలు చుట్టుముట్టసాగాయి.


అంతలోనే ‘షాట్‌ రెడీ’ అన్నారు. నాకు డాబామీద నుంచి మెట్లు దిగే సన్నివేశం ప్లాన్ చేశారు. నేను కూడా గుండెలనిండా గాలి పీల్చుకుని వెళ్ళి ‘మెట్లు దిగుతూ ఓ డైలాగు చెప్పా’. ‘కట్‌.. షాట్‌ ఓకే’ అన్నారు డైరెక్టర్‌గారు. ‘ఇదిగో... రేయ్‌ కోటయ్యా.. ఒకసారి ఇట్రా’ అని పిలిచారు నిర్మలమ్మగారు. ఆవేళ ఆవిడ కూడా సెట్‌లోనే ఉన్నారు. ‘ఏంటమ్మా’ అని దగ్గరకు వెళ్ళా. చేతితో ఆడవాళ్ళు దిష్టితీస్తూ మెటికలు విరుస్తారే.. అలా విరిచి, ‘నువ్వు నాకు తెలిసిన కోట శ్రీనివాసరావు అంటే నేను కూడా నమ్మను. మీ అమ్మ కడుపు సల్లగుండ... ఎంత నేచురల్‌గా చేశావూ, నువ్వలా నడిచి వస్తుంటే నాకు ఓ పోశ్చర్‌ కనిపించింది. నీలాంటి నటులు ఉండాలి. ఎక్కువా తక్కువా కాకుండా ఆ వేషానికి తగ్గట్టే చేశావు’ అన్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చేసరికే నిర్మలమ్మగారు చాలా పెద్దావిడ. తల్లి క్యారెక్టర్లు, హీరోలకు బామ్మ పాత్రలు చేసేవారు. ఆ సినిమాల్లో నేను విలన్‌గా నటించే వాణ్ణి. కలిసి చాలా సినిమాలు చేసినా, ఆవిడతో నాకు కాంబినేషన్ సీన్లు తక్కువగానే ఉండేవి.


కానీ నేను రోజుకు ఎన్నిసార్లు కనిపిస్తే అన్నిసార్లూ ‘‘మంచి ఆర్టిస్టుని చూస్తున్నాన్రా కోటయ్యా’’ అని మనసారా దీవించేవారు ఆవిడ. అలాంటి పెద్దల నోటిమాటలు నన్ను ఇవాళ ఇంత గొప్పస్థాయికి తెచ్చాయేమో అనిపిస్తూ ఉంటుంది. నిర్మలమ్మగారిలో మరో గొప్పతనం ఏమిటంటే లంచ్ టైమ్‌కు ఆవిడకు ఇంటి నుంచి స్పెషల్‌ క్యారేజ్‌ వచ్చేది. పులిహోర, గారెలు, బూరెలు, రకరకాల పచ్చళ్ళు లాంటివి ఉండేవి అందులో. పండుగల సమయంలో బోలెడన్ని వెరైటీలుండేవి. నాన్‌ వెజిటేరియన్ వాళ్ళకి కూడా నాన్‌వెజ్‌ వంటకాలు తెచ్చిపెట్టేవారు. పెద్దా చిన్నా తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. అందుకే అందరూ నిర్మలమ్మగారిని ఇంట్లో మనిషిలాగానే భావించేవారు. ఎవరిమీదైనా కోపమో, ప్రేమో ఉంటే మొహమ్మీదే అనేసేవారావిడ. అంతేతప్ప ముందు ఒకటి, వెనుక ఒకటి మాట్లాడటం వంటి పిచ్చిపిచ్చి ప్రవర్తనలు తెలియని మనిషి నిర్మలమ్మ. అంత సీనియర్‌ ఆర్టిస్టు నన్ను పిలిచి బాగా చేశావు అని చెప్పేసరికి నాకు ‘హమ్మయ్య..’ అనిపించింది. ధైర్యం పెరిగింది. ఇక వేషాన్ని చెడుగుడు ఆడుకుంటూ చేసేశానంతే.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-10-15T04:33:43+05:30 IST