నాగార్జునగారు కొట్టిన తర్వాత కూడా తల ఊపుతూనే ఉన్నా: కోట (పార్ట్ 36)

ABN , First Publish Date - 2021-10-13T03:28:50+05:30 IST

‘శత్రువు’ తర్వాత నాకు అంతపేరు తెచ్చిన చిత్రం ‘రక్షణ’. ఉప్పలపాటి నారాయణరావు దర్శకుడు. శోభన, రోజా కథానాయికలు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై రూపొందింది. ఆ చిత్రం మొదలయ్యేనాటికి నేను హైదరాబాద్‌కి షిఫ్ట్‌ కాలేదు. మా కుటుంబం మద్రాసులోనే ఉంది. ఓ రోజు..

నాగార్జునగారు కొట్టిన తర్వాత కూడా తల ఊపుతూనే ఉన్నా: కోట (పార్ట్ 36)

‘శత్రువు’ తర్వాత నాకు అంతపేరు తెచ్చిన చిత్రం ‘రక్షణ’. ఉప్పలపాటి నారాయణరావు దర్శకుడు. శోభన, రోజా కథానాయికలు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై రూపొందింది. ఆ చిత్రం మొదలయ్యేనాటికి నేను హైదరాబాద్‌కి షిఫ్ట్‌ కాలేదు. మా కుటుంబం మద్రాసులోనే ఉంది. ఓ రోజు ఉప్పలపాటి నారాయణరావు ఫోన్ చేశారు. ఆ వేళ సెకండ్‌ సండే అనుకుంటా. ‘కోటగారూ. ఇంట్లోనే ఉన్నారా? కాస్త తీరుబాటుగానే ఉన్నారా’ అని అడిగారు. నాకు అంతకు ముందే ఆయనతో పరిచయం. ‘ఆ.. ఇంట్లోనే ఉన్నానండీ. ఏమిటండీ విషయం’ అని అడిగాను. ‘మీరు ఖాళీగా ఉంటే ఒకగంట అన్నపూర్ణ ఆఫీసుకు రండి’ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఆఫీస్‌ మద్రాసులోనూ ఉండేది. ‘సరేనండీ. మధ్యాహ్నం వస్తాను’ అని చెప్పా.


రక్షణ చిత్రంలో సరికొత్త మేనరిజమ్‌

నేను వెళ్లేసరికి నాగేశ్వరరావుగారి పెద్దబ్బాయి వెంకట్‌గారు ఉన్నారు. నన్నుచూసి నవ్వుతూ పలకరించారు. ‘ఎండనపడి వచ్చారు’ అని ఫలహారం పెట్టారు. పక్కనే డైరెక్టర్‌గారు కూడా ఉన్నారు. తిని, టీ తాగుతుండగా, ‘ఓ సినిమా చేయబోతున్నాం కోటగారూ. ఇందులో ఓ పాత్ర ఉంది. కథకి చాలా ఇంపార్టెంట్‌ వేషం. మీరు ఇప్పటిదాకా చేయనిదేమీ కాదు. మంచి పొలిటికల్‌ వేషం. ఇప్పటికే పొలిటికల్‌గా చాలా పాత్రలు వేశారు, ఇందులో ఏదైనా కాస్త మార్పుంటే బావుంటుంది. దానికి ఏం చేస్తే బావుంటుందా? అని డిస్కస్‌ చేస్తున్నాం. మీరు కూడా ఉంటే బావుంటుంది కదా అని పిలిచాం. అలా కాకుండా మామూలుగా పెడితే రొటీన్‌గా ఉంటుందని అనిపిస్తుంది’ అన్నారు. కొత్తగా ఏం చేస్తే బావుంటుందా? అని ఒక పదినిమిషాలు ఆలోచించి.. ‘ఏవండీ యంగ్‌ క్యారక్టరా? ఓల్డా?’ అని అడిగా. ‘యంగ్‌ ఏమీ కాదండీ. 50 ఇయర్స్‌ ఈజీగా ఉంటాయి. అతనికి తమ్ముడు ఉంటాడు. వాడు చాలా క్రూరుడు. ఏం చేయాలన్నా చేతికి మట్టి అంటకుండా తమ్ముడుచేత చేయించే రాజకీయనాయకుడు. పార్టీలో మంచిపేరుతో కొనసాగుతుంటాడు’ అన్నారు వెంకట్‌.


అందరం ఆలోచనలో పడ్డాం. ఎవరికివాళ్ళం మాట్లాడకుండా కూర్చున్నాం. అంతలో నారాయణరావుగారు అందుకుని ‘మీరు చాలా పిక్చర్లు చేస్తున్నారు కదా. మీ మేకప్‌కి, మిగిలిన విషయాలకి వీలుపడేలా ఉండాలి. ఎందుకంటే నా సినిమాలో వేషం బావుండాలని ఇతర సినిమాల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్‌ కాదు’ అన్నారు. ‘ఆ విషయం ఏమీ ఫర్వాలేదులెండి విగ్గులే మెయింటెయిన్ చేస్తున్నాను’ అన్నా. అంతలో చటుక్కున ఓ ఐడియా తట్టింది. ‘బట్టతల ఉండి, తల ఆగకుండా అడ్డంగా అలా అలా ఊగుతూ ఉంటే ఎలా ఉంటుందండీ’ అన్నా. ‘బావుంటుందండీ. చాలా బావుంటుందండీ... అలాంటి మేనరిజమ్‌ మనం ఇంతకుముందు చూడలేదు. చాలా బావుంటుంది. మీరు చేస్తానంటే మహదానందం’ అన్నారు డైరక్టర్‌గారు. అప్పట్లో ప్రతిరోజూ క్లీన్ షేవ్‌ చేసేవాణ్ణి. నా మేకప్‌మన్ మోహన్ భలే తమాషాగా విగ్గు కుట్టించాడు. బట్టతల ఉన్నోళ్లకి ముందంతా పుర్రె కనిపించి వెనక జుట్టు ఉండేటట్టు ఉంటుందే, అలా చేయించాడన్నమాట. మేకప్‌ నాకు చాలా బాగా సూటయిందని తొలిరోజు లొకేషనలో అందరూ అన్నారు.


‘షాట్‌ రెడీ సార్‌’ అని కో డైరెక్టర్‌ వచ్చి చెబితే పొజిషన్‌లోకి వెళ్ళబోతూ ఆగా. అక్కడ టేబుల్‌మీద ఓ ఇంగ్లిష్‌ బుక్‌ ఉంది. దాని పేరు గుర్తులేదుగానీ మన ‘ఆంధ్రజ్యోతి-నవ్య’లాంటి మ్యాగజైన్ అనుకోండి. కరెక్ట్‌గా ఆ విగ్గులో నేను ఎలా ఉన్నానో, అలాగే ఉన్న ఓ వ్యక్తి ఫొటో బుక్‌మీద ఉంది. చూడగానే గమ్మత్తుగా అనిపించింది. ‘ఏంటి నారాయణరావుగారు...! గమ్మత్తుగావుంది మేగజైన్ కవర్‌ ఫొటో’ అన్నా. ఆయన నవ్వి ‘అవునండీ. వస్తుంటే కనిపించింది. మీ క్యారెక్టర్‌ గుర్తొచ్చి తెప్పించాను. అది బల్లమీద ఉంటే క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌కి బావుంటుంది’ అన్నారు. ఆ మేగజైన్‌ కవర్‌పేజీ మీద వ్యక్తి చెంపన చెయ్యి పెట్టుకుని కూర్చున్నాడు కదా, మీరు కూడా అలాగే కూర్చోండి అన్నారు. చెప్పినట్టే చేశా ఆ ఫోజు సినిమాలో చాలా బాగా కనిపించింది. ఆ చిత్రం షూటింగ్‌ దాదాపు హైదరాబాద్‌లోనే తీశారు. ఒకవేళ ఏమైనా ఒకటీ అరా ఉన్నా పక్కన పల్లెటూర్లలో తీశారు. అప్పట్లో పల్లెటూరి షాట్‌ అంటే ఎక్కువగా దేవరయామిజాలకు వెళ్ళేవాళ్ళం.


నాగార్జునగారి కితాబు

ఆ చిత్రంలో ఓ మంచిసీన్ ఉంది. నేనున్న పార్టీ ఆఫీసుకి వస్తాడు నాగార్జున. అప్పుడు నేనేదో డిస్కషన్ పెడతా. దానికి అతనేదో అంటాడు. వెంటనే ఘాటుగా మాట్లాడతా. సహనం చచ్చిపోయిన నాగార్జున చాచి ఒకటి పీకుతాడు. అప్పటిదాకా ఊపుతున్న తలను చెంపదెబ్బతిన్న తర్వాతకూడా ఊపటం కంటిన్యూ చేస్తా. అది చూసి నాగార్జునగారు ఆశ్చర్యపోయారు. దానికి తోడు ఆయనకి నవ్వు వచ్చేసింది. నవ్వు ఆపుకుని ‘ఎంత బాగా చేస్తున్నారు శ్రీనివాసరావుగారూ! దెబ్బతిని కూడా అలా తల ఊపడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, రెప్పపాటులోపే మీరు మళ్ళీ క్యారక్టర్‌లోకి రావడం ఆశ్చర్యంగా ఉంది’ అన్నారు. ఆ సినిమా విడుదలయ్యాక ‘కోట భలే చేశాడురా’ అనే టాక్‌ ఇండస్ట్రీలో మరోసారి స్ర్పెడ్‌ అయింది.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-10-13T03:28:50+05:30 IST