లోకల్‌ టాలెంట్‌ చచ్చిపోతోందని గ్రహించరేం?: కోట (పార్ట్ 29)

ABN , First Publish Date - 2021-09-23T03:20:34+05:30 IST

పెద్దవంశీగారు తెరకెక్కించిన ‘కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్ ట్రూప్‌’ చిత్రంలో ఎవరూ నా పాత్ర మర్చిపోలేరు. ఆ సినిమాకోసం వంశీగారు నా చేత గోచీపెట్టించి యాక్ట్‌ చేయించారు. ‘యాయా’ అని అందులో చంటి పిల్లాడిలా కొట్టుకుంటూ ఉంటా. అలా అప్పట్లో దర్శకులు ఏం చేయమంటే అది..

లోకల్‌ టాలెంట్‌ చచ్చిపోతోందని గ్రహించరేం?: కోట (పార్ట్ 29)

పెద్దవంశీగారు తెరకెక్కించిన ‘కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్ ట్రూప్‌’ చిత్రంలో ఎవరూ నా పాత్ర మర్చిపోలేరు. ఆ సినిమాకోసం వంశీగారు నా చేత గోచీపెట్టించి యాక్ట్‌ చేయించారు. ‘యాయా’ అని అందులో చంటి పిల్లాడిలా కొట్టుకుంటూ ఉంటా. అలా అప్పట్లో దర్శకులు ఏం చేయమంటే అది చేసేసేవాళ్ళం. ఎదురుమాట్లాడేవాళ్ళం కాదు. మరీ పైనుంచి దూకమంటే ‘గురువుగారూ కాస్త చూడండి’ అనేవాళ్ళంగానీ, పాత్రకి ఏది సూటవుతుందనుకుంటే అది చేసేయడమే. ఇప్పట్లా ఆలోచించడాలు గట్రా ఉండేవి కావు. ప్రతిరోజూ క్లీన్‌గా షేవ్‌ చేసుకునేవాళ్ళం. ఇప్పటివాళ్ళందరూ గడ్డాలు పెంచుతున్నారు. గడ్డం లేకపోతే మేకప్‌మేన్ ఏమైనా చేయగలడు. ముఖమంతా వెంట్రుకలు ఉంటే ఇంక వారు చేసేదేముంది? పైగా మన మేకప్‌మేన్‌లు ఇప్పటి మేకప్‌కి పనికిరావడం లేదు. వాళ్ళని ఎక్కడో ముంబై నుంచి పిలిపిస్తున్నారు. అక్కడినుంచి మేకప్‌మేన్‌ ఒక్కడే వస్తాడా? రాడు. అతని స్టాఫ్‌ కూడా వస్తారు. వాళ్ళందరికీ ఫ్లైట్‌ చార్జీలు, హోటల్‌ వసతి కల్పించాలి. దానివల్ల ఇక్కడ లోకల్‌ టాలెంట్‌ చచ్చిపోతోందని ఎవ్వరూ గ్రహించరేం? ఎప్పుడైనా ఈ విషయాలు మాట్లాడితే అందరూ గుర్రుగా ఉంటారు.


చెప్పుకుంటూవెళ్తే నా జీవితంలో చాలామంది దర్శకులు నాతో గొప్ప వేషాలు వేయించారు. ఈవీవీ తర్వాత నేను చెప్పాల్సింది కోడి రామకృష్ణగారి గురించి. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న గొప్ప దర్శకుల్లో ఒకరు కోడి రామకృష్ణ. సమాజంలో మామూలుగా జరుగుతున్న విషయాన్ని సినిమాలో పెట్టి, సినిమా కథగా మెప్పించగల దర్శకుడు. అతి కొద్దిమందికి మాత్రమే తెలిసిన నిజం ఏమిటంటే కోడి రామకృష్ణగారు బేసిగ్గా మంచి నటుడు. నటుడిగా ఆయన సినిమాల్లో పెద్దగా రాణించలేదు కానీ, స్టేజీమీద బాగా చేసిన వ్యక్తి. అనుభవజ్ఞుడు. ఆయన మేనరిజమ్స్‌ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన రాసిన ప్రతి పాత్రకూ ఏదో ఒక మేనరిజం ఉండేలాగా చూసుకునేవాడు. నా అదృష్టం ఏమిటంటే సెట్లో ఆయన ప్రతిదీ చేసి చూపించేవారు. చేతుల్ని ఇలా పెట్టి, అలా పెట్టి, తిప్పి తిప్పి చేసి చూపిస్తుంటే,‘ఏం చేస్తున్నాడురా? అలా మనం ఎక్కడ చేస్తాం?’ అనిపించేది. ఎందుకనిపించేదంటే ఆ పర్సనాలిటీ అలాంటిది. పర్సనాలిటీ ఆయనకు అడ్వాంటేజ్‌. నాకు ఆ అడ్వాంటేజ్‌ లేదు. నా కాయం పెద్దది. డైరెక్టర్‌గారి లాగా టక్కున పడుకోవాలన్నా, లేవాలన్నా, చేయాలన్నా.. కుదిరేది కాదు. ఇబ్బందులు ఉండేవి. ఇబ్బందులంటే పర్సనాలిటీ పరంగానే. అందువల్ల చెప్పింది చెప్పినట్టే తు.చ తప్పకుండా నేను చేసేవాణ్ణి కాదు. కాకపోతే అం...త చెబితే ఇంతైనా చేస్తారేమోననే ఆలోచనతో ప్రతిదీ చేసి చూపించేవారు కోడి రామకృష్ణ. నా కెరీర్‌లో నేను నటించిన ఆయన సినిమాల్లో బెస్ట్‌ పాత్రలున్నాయి. అందుకు ఉదాహరణగా ‘శత్రువు’ సినిమా. ఆ చిత్రాన్ని ఎం.ఎస్.రాజుగారు తీశారు. ఎస్‌.గోపాలరెడ్డి కెమెరామన్. 


ఆయనలా చేయగలనా అనిపించేది

శత్రువు సినిమాలో కనిపించే నా మేనరిజమ్స్‌ అన్నీ డైరెక్టర్‌ కోడి రామకృష్ణగారివే. ఆయన చెప్పిన పద్ధతి ఫాలో అయ్యానంతే. ఏమాటకామాట చెప్పుకోవాలి శత్రువులో నా పాత్ర తీరును సెట్లో ఆయన చేసి చూపిస్తుంటే భలే నవ్వొచ్చేసేది. ‘ఆయన లాగా చేయగలనా?’ అని మథనపడే వాడిని. నేనే కాదు ఆయన సినిమాల్లో పనిచేసే ప్రతి ఆర్టిస్టూ మథనపడేవాడు. శత్రువును మద్రాసులో తీశారు. తమిళంలో ఇప్పుడు స్టార్‌హీరో విజయ్‌ ఉన్నాడే, వాళ్ళ నాన్నగారు ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌గారని పెద్ద డైరెక్టర్‌. ఆయన ఇంట్లో షూటింగ్‌ చేశారు. అక్కడ యాక్ట్‌ చేయడానికి ఫస్ట్‌ డే వెళ్ళా. గోపాలరెడ్డిగారు ఉన్నారు. అన్ని టేకులెప్పుడూ తినలేదు. శత్రువు చిత్రంలో నా పాత్రను కోడిరామకృష్ణగారు చాలా ముచ్చటపడి డిజైన్ చేసుకున్నారు. దాంతో నేనేం చేసినా ఆయనకి ఒక పట్టాన నచ్చలేదు. మచ్చుకు ఒక విషయం చెబుతా....ఆ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. ‘‘ఏవయ్యా మిమ్మల్ని సలహా సంఘంగా పెట్టుకుని పందెపు గొర్రెల్ని మేపుతున్నట్టు మేపితే మీరిచ్చే సలహా ఇదా. థాంక్స్‌. ఈ సమస్యకి మీరు గనక రెండు నిమిషాల్లో సమాధానం చెప్పకపోతే మీ పేరు రాసిపెట్టి ఆ మేడమీద నుంచి దూకి సచ్చిపోతా.. అయ్యో అగ్గిపెట్టి లేదురా బాబూ. అగ్గిపెట్టె లేదు’’ అని అంటా. అగ్గిపెట్టె లేదు అనేది అక్కడ అవసరం లేదు. అయినా అది ఆ క్యారెక్టర్‌ మేనరిజం. అందుకోసం చెప్పే తీరాలి. ఈ డైలాగు నా మీద మొదటిరోజు, మొదటి టేక్‌గా తీయాలనుకున్నారు. కెమెరా స్టార్ట్‌ అన్నారు రామకృష్ణగారు. ‘రోలింగ్‌ సార్‌’ అన్నాడు అసిస్టెంట్‌. నేను డైలాగ్‌ చెప్పాను.


‘వన్‌మోర్‌’ అన్నారు కోడిగారు. అలా 17 సార్లు వన్‌మోర్‌లు చెప్పారు. 18వ సారి కూడా అదే తంతు. ఏవైనా ఉంటే ఇంకొన్ని ఎక్కువే ఉంటాయి కానీ తక్కువేం కాదు. ఇదంతా కెమెరామన్ ఎస్‌.గోపాలరెడ్డి గమనించారు. అప్పటికే సమయం మధ్యాహ్నం 12 దాటింది. ‘కోటయ్యా... ఇలా రా ఒకసారి’ అని పిలిచారు ఎస్‌.గోపాలరెడ్డిగారు. ‘ఏంటండీ’ అంటూ వెళ్ళా. ‘నా మాటవిని నువ్వెళ్ళి బ్రేక్‌ తీసుకుని రా’ అని సలహా ఇచ్చారు. ‘డైరెక్టర్‌గారు ఏమంటారోనండీ. అయినా ఇప్పటి దాకా నా కెరీర్‌లో ఇన్ని టేకులు తినలేదండీ’ అన్నా. ‘నాకు తెలుసు. నువ్వు ముందెళ్ళి బ్రేక్‌ తీసుకో. డైరెక్టర్‌గారితో నేను మాట్లాడతా’ అన్నారు. వెంటనే అటు తిరిగి డైరెక్టర్‌గారితో, ‘కోటయ్యని బ్రేక్‌కి పంపించెయ్యండి. వెళ్ళొచ్చి చేస్తాడు’ అన్నారు. ఇటు తిరిగి నాతో... ‘నువ్వు చెయ్యాలి. నువ్వే చేయాలి. దేని గురించీ ఎక్కువగా ఆలోచించకు. నువ్వు చేయగలవు కాబట్టే డైరెక్టర్‌గారు ఈ డైలాగ్‌ పెట్టారు’ అన్నారు. మేం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇంతలోనే కోడి రామకృష్ణగారు ‘బ్రేక్‌’ చెప్పేశారు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-09-23T03:20:34+05:30 IST