‘ఇలాంటి సినిమాలు తీసే బదులు వ్యభిచారం చేసి బతకొచ్చు కదా’ అన్నారట: కోట (పార్ట్ 28)

ABN , First Publish Date - 2021-09-21T02:30:39+05:30 IST

జంబలకిడిపంబ సినిమా గుర్తొస్తే ఈనాటికీ అందరూ నవ్వుకుంటారు. ఆ సినిమా తొలిరోజు అందరు ఆర్టిస్టులూ ఉన్నారు. అందరినీ కూర్చోపెట్టి ఈవీవీ కథ చెప్పాడు. ఆ సినిమాలో ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా ప్రవర్తిస్తారు. కథ వినగానే అందరం ఆసక్తిగా..

‘ఇలాంటి సినిమాలు తీసే బదులు వ్యభిచారం చేసి బతకొచ్చు కదా’ అన్నారట: కోట (పార్ట్ 28)

అందరూ ముక్కున వేలేసుకున్నారు

జంబలకిడిపంబ సినిమా గుర్తొస్తే ఈనాటికీ అందరూ నవ్వుకుంటారు. ఆ సినిమా తొలిరోజు అందరు ఆర్టిస్టులూ ఉన్నారు. అందరినీ కూర్చోపెట్టి ఈవీవీ కథ చెప్పాడు. ఆ సినిమాలో ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా ప్రవర్తిస్తారు. కథ వినగానే అందరం ఆసక్తిగా చర్చించుకున్నాం. మేల్‌ ఆర్టిస్టులందరం మంగళసూత్రం మెడలో వేసుకుని దాదాపు 15 రోజులు విశాఖపట్నం వీధుల్లో తిరిగాం. స్కూలు సీన్ ఒకటి చేశా. చిన్న నిక్కరు వేసుకుని చంటిపిల్లలు తొక్కుతారే అలాంటి సైకిల్‌ తొక్కడం మర్చిపోలేను. బ్రహ్మానందం, అలీ, కల్పనారాయ్‌, మల్లికార్జునరావు అందరం చాలా సరదాగా చేశాం, ఆ చిత్రాన్ని. కానీ విడుదలకు ముందు చాలా విమర్శలు ఎదుర్కొన్న సినిమా అది. ‘ఇలాంటి సినిమాలు తీయడానికి బదులు వ్యభిచారం చేసి బతకొచ్చు కదా’ అని ఓ ప్రముఖ దర్శకుడు ఎవరితోనో అంటే అది ఈవీవీ దాకా చేరింది. నాతో చెప్పి బాధపడ్డాడు. అంతెందుకు? ఆ సినిమా జంధ్యాల గారికి కూడా నచ్చలేదు. ‘ఏంటా బూతులేంటి?’ అని కాస్త వ్యంగ్యంగానే మాట్లాడారాయన. అయితే సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్లు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.


అదీ ఈవీవీ పద్ధతి!

ఈవీవీ దగ్గర ఇంకోగుణం ఉంది. అదేంటంటే ఎవరైనా ‘ఫలానా పాత్ర నేను చేయను’ అని అన్నారనుకోండి. ఆ పాత్రని వారిచేతే చేయిస్తాడు. మాటలతో చెప్పి ఒప్పిస్తాడు. వినకపోతే కేకలు వేస్తాడు. ఎంతపెద్ద ఆర్టిస్టైనా ఈవీవీ పద్ధతిలో మార్పురాదు. ఎలాగైతేనేం వాళ్ళతోనే ఆ పాత్ర చేయిస్తాడు. ‘నిజంగా అంత బాగోలేకపోతే ఎవరైనా అనేది నన్నే కదా. ఈ సినిమాకు డైరెక్టర్‌ని నేను కదా? చేయడానికి నీకేంటి నొప్పి?’ అని సర్దిచెప్పేవాడు. కుదరకపోతే కేకలు కూడా వేసేవాడు.


నీ దుంపతెగ, ఏం చేశావయ్యా..

హలో బ్రదర్‌ సినిమాలో మల్లికార్జునరావుగారి పాత్ర చనిపోతుంది. అప్పుడు ఓ క్యారేజ్‌ పట్టుకుని వచ్చి నేను ఏడ్చే సీన్ ఉంటుంది. ‘నాకు అన్నం ఎవరు పెడతారు? నన్ను ఒరేయ్‌ అని ఎవరు పిలుస్తారు?’ అని నేను బాధపడే సన్నివేశం. నేనేమో మల్లికార్జునరావుగారిని పట్టుకుని ఏడుస్తూనే ఉన్నా. ఎంతకీ కట్‌ చెప్పడు ఈవీవీ. తీరాచూస్తే ఆయన సీన్‌లో ఇన్వాల్వ్‌ అయి ఏడుస్తున్నాడు. లంచ్ టైమ్‌లో నా చేయి పట్టుకుని, ‘నీ దుంపతెగ, ఏం చేశావయ్యా. ఈ సీన్ ఈ సినిమాకి హైలైట్‌ అయ్యా’ అన్నాడు. అన్నట్టే అయింది. ఈవీవీ సిన్మాలో చేయని కమెడియన్‌ లేడు. ఈవీవీ వాళ్లమ్మగారు, నాన్నగారు నాకు బాగా పరిచయం. రాజమండ్రివైపు వెళ్ళినప్పుడల్లా వాళ్ళింటికి వెళ్ళేవాణ్ణి. భోజనం చేసేదాకా వదిలేవారు కాదు. ఈవీవీ బ్రదర్స్‌తోనూ నాకు మంచి అనుబంధం ఉంది. స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ గిరి ఉండేవాడు. వాడైతే ‘అన్నాయ్‌ అన్నాయ్‌’ అని నా వెంటే ఉండేవాడు. శ్రీనివాస్‌ అని ఇంకో బ్రదర్‌ ఉండేవాడు. తనూ మంచి పరిచయమే. గిరితో ఎప్పుడైనా ‘పిల్లల్ని ఏం చదివిస్తావురా’ అని అడిగాననుకోండి... ‘ఆ దిగులు నాకెందుకన్నాయ్‌. మా అన్నయ్య ఉన్నాడుగా. ఆయన చూసుకుంటాడంతా’ అనేవాడు. తన కుటుంబసభ్యులకు ఆయన ఇచ్చిన భరోసా అలాంటిది. వాళ్ళకే కాదు ఆయన దగ్గర పనిచేసేవారు కూడా జీవనాధారంకోసం ఎప్పుడూ ఇబ్బందిపడలేదు. కమెడియన్ అనేవాడు ఎవడైనా తెలుగు పరిశ్రమలో ఉంటే సత్యనారాయణ సినిమాలో చేయకుండా ఉండేవాడు కాదు. వాళ్ళని పిలిచి చిన్నదో, పెద్దదో ఏదో ఒక వేషం ఇచ్చేవాడు. పది రూపాయలు ఇచ్చేవాడు.


ఆ రిలేషన్స్‌ ఈ జనరేషన్‌కి లేవు

ఇప్పుడు నేను ఉంటున్న ఈ ఇల్లు కట్టినప్పటి విషయం చెప్పాలి. ఈ ఇంటి నిర్మాణాన్ని మా అబ్బాయి మొత్తం దగ్గరుండి చూసుకునేవాడు. ఉన్నట్టుండి ఒకరోజు ఐదు లక్షలు కావాల్సి వచ్చింది. మావాడు నాకు ఫోన్ చేశాడు. నా దగ్గర లేవు. నేనేం హీరోని కాదు, టాప్‌ కమెడియన్ కాదు. ఏదో వేషాలు వేసేవాణ్ణి, డబ్బులూ వచ్చేవి. బాగానే వెళ్ళేది బండి. నాలుగు రూపాయలు వస్తే సినిమావాళ్ళు మామూలుగా బంగారమో, ఇల్లో, స్థలమో ఏదో ఒకటి కొనేస్తారు. నేనూ అంతే. ఎప్పుడూ ఇంట్లో డబ్బు పెట్టుకునే అలవాటులేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఈవీవీ గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ చేసి ‘సత్యనారాయణ ఏమనుకోవద్దయ్యా... ఒక విషయం’ అన్నా. తను వెంటనే... ‘ఏం డబ్బులు కావాలా’ అన్నాడు. ‘అవునయ్యా’ అన్నా. ‘ఎన్ని లక్షలు కావాలి’ అన్నాడు.‘ఐదు దాకా అవసరం’ అన్నా. సరేనన్నాడు. సాయంత్రానికి గిరిచేతికి ఇచ్చి పంపించాడు. ‘తన దగ్గర మాత్రం అంత ఎక్కడుండి ఉంటుంది? ఎవరిదగ్గరైనా తెచ్చి ఇచ్చి ఉంటాడులే’ అని అనుకుని నాకు రావాల్సిన డబ్బు వచ్చాక వడ్డీతో కలిపి ఇచ్చా. వెంటనే ఫోన్ చేసి నన్ను తిట్టాడు. ‘ఏం బుద్ధిలేదా నీకు? ఏంటా పని. వడ్డీ ఇస్తావా’ అని గట్టిగానే అన్నాడు. ‘లేదులే సత్యం ఎవరిదగ్గరైనా తీసుకున్నావేమోనని ఇచ్చాను’ అన్నా. ‘అయితే మాత్రం, ఏం నేనామాత్రం చేయకూడదా? చేయలేనా?’ అని కోపం చేసుకున్నాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనుషులతత్వం చెప్పడానికి. ఆ రిలేషన్స్ ఈ జనరేషన్‌కి లేవు. ఎవరికి వాళ్ళు తమ పని చేసుకుని వెళ్తున్నారు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-09-21T02:30:39+05:30 IST