‘కళ్ళు అలా పెట్టు చాలు. ప్రేక్షకులు నవ్వుకోలేక ఛస్తారు’ అన్నారు: కోట (పార్ట్ 19)

ABN , First Publish Date - 2021-09-09T03:10:17+05:30 IST

నన్ను అటూ ఇటూ తిప్పి చూసి, ‘ఆ.. లక్ష్మీపతి క్యారెక్టర్‌కి ఓకే. ఇతనికి శిష్యుడిగా వేసే వ్యక్తి ఇంకెలాంటి తలకట్టుతో ఉండాలి?’ అని కాసేపు ఆలోచించారు. అక్కడే, పక్కనే ఉన్న బ్రహ్మానందాన్ని కూర్చోపెట్టి అరగుండు చేశారు. అలా ఒక ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత కళ్ళజోడు గురించి..

‘కళ్ళు అలా పెట్టు చాలు. ప్రేక్షకులు నవ్వుకోలేక ఛస్తారు’ అన్నారు: కోట (పార్ట్ 19)

అలా మొదలైంది

‘అహనా-పెళ్లంట’కి ఎస్‌. గోపాల్‌రెడ్డిగారు కెమెరామేన్. దేవరయామిజాలలో ఓ బిల్డింగ్‌లో తీశారు. గుడి పక్కనే ఉంటుంది ఆ ఇల్లు. మొదటి రోజు షూటింగ్‌ స్పాట్‌కి వెళ్ళా. వైట్‌ అండ్‌ వైట్‌ డ్రస్సు, పైన తెల్ల తువాలు, నెత్తిన తెల్లటి టోపీ పెట్టుకుని ఉన్నారు జంధ్యాలగారు. అంతకు ముందే నాకు ఆయనతో పరిచయం ఉంది. బెజవాడలో ఉన్నప్పుడే ఒకరికి ఒకరం బాగా తెలుసు. కానీ ఎప్పడూ మాట్లాడుకోలేదు. హైదరాబాద్‌కి వచ్చాకే ఇద్దరి మధ్యా పలకరింపులు మొదలయ్యాయి. నన్ను చూడగానే, ‘శ్రీనివాసరావుగారు మీరెన్ని సినిమాలు చేస్తున్నారు?’ అని అడిగారాయన. నేను లెక్కచెప్పడం మొదలుపెట్టా. ‘చాలా సినిమాలు చేస్తున్నారు, మంచిది... కానివ్వండి. ఇంతకీ అన్నీ విగ్గులేనా?’ అని అన్నారు. ‘మరి విగ్గులే పెడతారనుకుంటానండీ. ఇప్పుడైతే రెండు సినిమాలు విగ్గు పెట్టుకుని చేస్తున్నాను’ అని అన్నా. ‘అయితే పర్లేదులెండి.. రండి’ అని అన్నారు. మా మధ్య ఈ సంభాషణ జరుగుతున్నంతసేపూ ఆయన చూపు, నా క్రాఫ్‌ వంకే ఉంది. ఎందుకో అర్థం కాలేదు. సరేనని ఆయన వెంటే వెళ్ళా. పక్కనే గొడ్ల సావిడిలోకి తీసుకెళ్లారు. కూర్చోండి అన్నారు. కూర్చున్నాక నా తల చుట్టూ ఒక తాడు కట్టారు. అక్కడున్నతనికి జంధ్యాలగారు ఏవో సూచనలిచ్చారు. అతను సరేనని.. ఆయన చెప్పిన షేప్‌లో నా తల జుట్టు కత్తిరించాడు. నన్ను అటూ ఇటూ తిప్పి చూసి, ‘ఆ.. లక్ష్మీపతి క్యారెక్టర్‌కి ఓకే. ఇతనికి శిష్యుడిగా వేసే వ్యక్తి ఇంకెలాంటి తలకట్టుతో ఉండాలి?’ అని కాసేపు ఆలోచించారు. అక్కడే, పక్కనే ఉన్న బ్రహ్మానందాన్ని కూర్చోపెట్టి అరగుండు చేశారు. అలా ఒక ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత కళ్ళజోడు గురించి చర్చ మొదలైంది. ‘కళ్ళజోడు మంచిది పెట్టుకుంటే ఆ పాత్రకు అన్యాయం చేసినట్టు అవుతుంది. మరి కళ్ళజోడుని ఎలా పగలగొట్టాలి?’ అని అన్నారు డైరెక్టర్‌గారు.


గోపాలరెడ్డిగారేమో.. ‘ఆ పని నాకు వదిలేయండి. నేను చేస్తాను’ అని చెప్పి ఒక రాయి మీద కళ్ళజోడును పెట్టి వేలితో కేరంబోర్డు కాయినని కొడతామే... అలా రెండుసార్లు ఆ గ్లాస్‌ మీద కొట్టారు. అంతే గ్లాసు చిట్లింది. చిట్లిన అద్దం రాలకుండా విజనబుల్‌ టేప్‌ ఉంటుంది కదా... అంటిచ్చినట్టు కూడా తెలియదు. అందుకని దాంతో అతికించారు. కళ్ళజోడుకి ఒకవేపు తాడు కట్టారు. దాంతో కళ్ళజోడు పని పూర్తయింది. అంతలో నాకు కాస్ట్యూమ్స్‌ తెచ్చిస్తే వేసుకుని, ఆ కళ్ళజోడు పెట్టుకున్నా. నన్ను చూసి పక్కనున్న వాళ్ళతో, ‘లక్ష్మీపతి దుస్తులు మురిగ్గా ఉంటే బావుంటుందయ్యా. ఇలా నీటుగా ఉంటే అతనికి సూటవదు’ అని అన్నారు జంధ్యాలగారు. ‘కాసింత తప్పుకోండి’ అని అన్నా. నా చుట్టూ ఉన్న వారందరూ దూరం జరిగారు. వెంటనే కిందపడుకుని అటూ ఇటూ కాసేపు దొర్లాను. బట్టలు మురిగ్గా మారాయి.‘ఇలా సరిపోతుందాండీ’ అని అడిగా. అది చూసి ‘అదేంటండీ .. అలా దొర్లేశారూ!’ అని అన్నారు జంధ్యాలగారు. ‘మీరే కదండీ... గుడ్డలు మురిగ్గా కావాలన్నారు’ అని అన్నా. ఆయనేమీ మాట్లాడలేదు. నా భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి షూటింగ్‌ మంచి ఊపులో పడింది. ఒకరోజు జంధ్యాలగారు నన్ను పిలిచి, ‘మీ ప్రవర్తన చూడగానే మీ బామ్మర్దికి పిచ్చిపట్టాలండీ. పిచ్చి కూడా మామూలు పిచ్చి కాదు. ఒంటిమీద ఉన్న బట్టలు చింపుకోవాలి. ఆ రేంజ్‌లో ఉండాలి. మీ ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్‌తోనే అది జరగాలి. ఎలా చేస్తారో ఆలోచించండి’ అని అన్నారు. 


మేం మాట్లాడుకుంటున్నప్పుడు అటుగా పక్కనే ఉన్నాడు ఈవీవీ సత్యనారాయణ. ‘అహనా-పెళ్ళంట!’కు అతనే కో డైరెక్టర్‌. తాను చేస్తున్న పని వదిలేసి నా దగ్గరికి వచ్చాడు. ‘ఇదిగో పోయిన వారం మనం మాట్లాడుకుంటున్నప్పుడు కళ్ళు రెండూ అదోలా పైకి తిప్పి చూపించావు కదా. ఇప్పుడలా చేయగలవా?’ అని అడిగాడు ఈవీవీ. పరిశ్రమకి వెళ్ళిన కొత్తకదా... నాకు తెలిసిన విద్యలన్నిటినీ ఖాళీ సమయాల్లో ఎవరో ఒకరికి చేసి చూపిస్తూ ఉండేవాడిని. అలా ఒకసారి అంధుడిగా ఉంటే ఎలా ఉంటానో చేసి చూపించా ఈవీవీకి.. అది తనకి చటుక్కున గుర్తుకొచ్చినట్టుంది. జంధ్యాలగారి వైపు చూసి,‘అంధుడిలాగా శ్రీనివాసరావు కళ్ళు భలే పెడతాడండీ’ అని అన్నాడు. అందుకు జంధ్యాలగారు నన్ను చూసి, ‘నిజమా? పెడతారా?’ అని అన్నారు. అవునన్నట్టు తలూపా. ‘ఏదీ ఒకసారి చెయ్యండి’ అన్నారు. అంధుడిలా నటించి చూపించాను. నా ఎక్స్‌ప్రెషన్‌ చూసి జంధ్యాలగారు గట్టిగా నవ్వేశారు. ‘కళ్ళు అలా పెట్టు చాలు. ప్రేక్షకులు నవ్వుకోలేక ఛస్తారు’ అన్నారు. ‘అహనా పెళ్ళంట!’ సినిమా చేస్తున్నప్పుడే జంధ్యాలగారితో నాకు చనువు ఏర్పడింది. బెజవాడలో పరిచయం ఉన్నప్పటికీ మా మధ్య సరదాగా మాట్లాడుకునే చనువు వచ్చింది మాత్రం ఈ చిత్రంతోనే. నా జీవితంలో నేను జాగ్రత్తపరుణ్ణేగానీ పిసినారిని మాత్రం కాదు. లక్ష్మీపతిపాత్ర లాంటి పిసినారిని నేనెప్పుడూ చూడలేదు. అది జంధ్యాల గారి క్రియేషనే.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-09-09T03:10:17+05:30 IST