‘అహనా-పెళ్లంట’లోని పిసినారి పాత్ర ఆయన చేయాల్సింది: కోట (పార్ట్ 18)

ABN , First Publish Date - 2021-09-08T03:05:14+05:30 IST

‘చాలా మంచి వేషం ఒకటుందయ్యా. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆ సినిమాలో ఆ వేషం పండితేనే సినిమా సక్సెస్‌ అవుతుంది. లేకుంటే ఓ మాదిరిగా ఆడుతుంది. గత 20 రోజుల నుంచి నేను, జంధ్యాల ఒక విషయంలో పోట్లాడుకుంటున్నాం’ అని అన్నారు. ‘పోట్లాట ఎందుకండీ?’ అని అప్రయత్నంగా పైకే అనేశా. ‘పోట్లాట అంటే..

‘అహనా-పెళ్లంట’లోని పిసినారి పాత్ర ఆయన చేయాల్సింది: కోట (పార్ట్ 18)

ఓ పెద్ద ప్రొడ్యూసర్‌ నుంచి ఆఫర్‌ రావడం అక్కడి నుంచే ప్రారంభం

‘మండలాధీశుడు’ నా కెరీర్‌లో ఎంత కీలకమైన చిత్రమో, అంతే ప్రధానమైన సినిమా ‘అహనా-పెళ్లంట!’. ఆ చిత్రం విడుదలై దాదాపు మూడు దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ అహనా-పెళ్లంట! అనగానే అందరి ముఖాల్లోనూ నవ్వు కనిపిస్తుంది. ఆ సినిమా అవకాశం నాకు వచ్చిన విధానం, అందులో నేను చేసిన లక్ష్మీపతి అనే పాత్రను తీర్చిదిద్దిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకరోజు సాయంత్రం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో కూర్చుని ఉన్నా. మద్రాసు ఫ్లయిట్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా. అప్పుడు హైదరాబాద్‌, మద్రాసు మధ్య ఇప్పుడున్నంత ఫ్రీక్వెంట్‌గా ఫ్లయిట్లు లేవు. పొద్దునొకటి, రాత్రి ఒకటి ఉండేవి. ఎయిర్‌పోర్టులో కూడా ఇప్పుడున్నన్ని రూల్స్‌ లేవు. వ్యవహారం చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండేది. ఇప్పుడు విమాన ప్రయాణాలు అందరికీ చేరువయ్యాయి కానీ, అప్పట్లో విమానాల్లో తిరగడం చాలా గొప్ప. ‘భగవంతుడు మనకు విమానాల్లో తిరిగే అదృష్టాన్ని కల్పించాడు’ అని అనుకుంటూ కూర్చుని, అటూ ఇటూ చూస్తున్నా. దూరంగా రామానాయుడుగారు కనిపించారు. ఆయన పక్కన సూట్‌కేసు ఉంది. చేతిలో పేపరేదో ఉంది. దాన్ని తిరగేస్తున్నారు. హీరోలకి ఏమాత్రం తీసిపోని విగ్రహం ఆయనది. ‘ఎర్రగా ఉంటాడు. ముక్కు బాగుంటుంది. మంచి క్రాఫ్‌.. అందగాడు’ అనుకున్నా.


‘అప్పటివరకు ఆయన గురించి వినడమే కానీ ఎప్పుడూ దగ్గరనుంచి చూడలేదు. అదే చూడటం! వెళ్ళి నమస్కారం చెబుదామనిపించింది. కానీ చెప్పాలా? వద్దా? అప్పటికే ఇండస్ట్రీలో సురేష్‌ ప్రొడక్షన్స్ అంటే పేరున్న సంస్థ. ఆ సంస్థ యజమాని, మూవీ మొఘల్‌ అనిపించుకుంటున్న రామానాయుడుగారు, నేనెళ్ళి విష్‌ చేస్తే పలుకుతారా? లేదా?’ ఇలా నాలో నేనే సవాలక్ష ప్రశ్నలతో సతమతమవుతున్నా. అంతలోనే చెయ్యెత్తి ‘హలో...’ అన్నట్టు ఊపారు రామానాయుడుగారు. కాస్త ధైర్యం వచ్చింది. అప్పటిదాకా నా మనసును పట్టి పీడించిన ప్రశ్నలన్నీ పటాపంచలైపోయాయి. ‘శ్రీనివాసరావు.. ఇట్రావయ్యా’ అని పిలిచారు నాయుడుగారు. మరుసటి క్షణం ఆయన ముందు నిలుచున్నా. చేతులు జోడించి వినయంగా, ‘నమస్కారం అండీ’ అని అన్నా. ‘ఇలా కూర్చో’ అని కుర్చీ చూపించారు. కూర్చున్నాక.. ‘నీకో విషయం చెప్పాలయ్యా. అనుకోకుండా నువ్వు ఇక్కడే కనిపించావు. జంధ్యాలతో ఓ సినిమా చేస్తున్నా. ఇవాళే ఫైనలైజ్‌ అయింది. జంధ్యాలంటే కామెడీనే కదా! చాలా మంచి కథ కుదిరింది’ అని చెప్పుకుంటూ పోతున్నారు. ‘అంతకు ముందు ఎప్పుడూ ఇద్దరం కలిసిందీ లేదు, ఏమీ లేదు. ఈ విషయాలన్నీ ఈయన నాకెందుకు చెప్తున్నారు? అనుకోకుండా ఇక్కడే కలిశావు అని అంటారేంటి?’ అని నా మనసులో అనుమానం మొదలైంది. అయినా పెద్దాయన చెబుతున్నారు కదా అని వినసాగాను.


‘చాలా మంచి వేషం ఒకటుందయ్యా. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆ సినిమాలో ఆ వేషం పండితేనే సినిమా సక్సెస్‌ అవుతుంది. లేకుంటే ఓ మాదిరిగా ఆడుతుంది. గత 20 రోజుల నుంచి నేను, జంధ్యాల ఒక విషయంలో పోట్లాడుకుంటున్నాం’ అని అన్నారు. ‘పోట్లాట ఎందుకండీ?’ అని అప్రయత్నంగా పైకే అనేశా. ‘పోట్లాట అంటే డిస్కషన్ లేవయ్యా. ఆ వేషాన్ని రావుగోపాలరావుతో వేయించాలని నేను సజెషన్ ఇచ్చా. జంధ్యాలేమో ‘వద్దు వద్దు’ అని అంటున్నాడు. ‘ఏమిటి? కారణం’ అని అడిగితే... ‘అది పిసినారి వేషం. పిసినారితనానికి పరాకాష్టగా ఉంటుంది. ఆ పాత్రే సినిమాకు ఆయువుపట్టు. ఎంత మేకప్‌ చేసినా, ఏం చేసినా గోపాలరావుగారి ఫేస్‌.. పాపం పూర్‌గా రాదండీ. ఆ రిచ్‌నె‌స్ ఫేస్‌లో పోదు అని సమాధానం చెప్పాడు’ అన్నారు నాయుడుగారు. ‘ఆయన అన్నదీ నిజమే కదండీ. గోపాలరావుగారు అందగాడు. ఎర్రటి స్కిన్, కర్లింగ్‌ హెయిర్‌.. చూట్టానికి గొప్పగా ఉంటారండీ’ అని అన్నా. 


‘ఓర్నీ.. జంధ్యాల కూడా అదే అన్నాడయ్యా.. రావుగోపాలరావుగారికి గుండు కొట్టించాలన్నా, ఇంకోటి చేయాలన్నా కష్టమవుతుంది. ఆయనేమో చాలా పిక్చర్లు చేస్తున్నారు. అయినా ఆ వేషం మీద ఆయనకు నేననుకున్న లుక్‌ రాదండీ’ అని నిన్న గట్టిగా చెప్పాడు జంధ్యాల. ‘సరే జంధ్యాల... ఇంతకీ మరి ఆ వేషాన్ని ఎవరితో వేయిస్తావు?’ అని అడిగితే, ‘కోట శ్రీనివాసరావుతో చేయిస్తాను అన్నాడయ్యా’ అని చెప్పి ముగించారు నాయుడు గారు. చివరి వాక్యం నాకు చాలా స్పష్టంగా వినిపించింది. అయినా, నేను విన్నది కలో, నిజమో అర్థం కాలేదు నాకు. అంతలోనే ఆయన అందుకుని, ‘నాకు ఆయన చెప్పినప్పుడు నిజంగా నీ మీద అంత నమ్మకం కలగలేదు. కానీ జంధ్యాల అంత గట్టిగా ఎందుకు చెబుతున్నాడా? అని మండలాధీశుడు చూశా. మంచి ఆర్టిస్టువయ్యా. సరే అందులో ఏదో చేశావనుకో... ఆ సంగతి వదిలెయ్‌. మా సినిమాలో పిసినారి వేషం నీకే ఇచ్చేయాలని డిసైడ్‌ అయ్యా. నువ్వు చెయ్‌ బావుంటుంది. ఓ 20 రోజులు డేట్లు కావాల్సి వస్తాయి. మా వాళ్ళు ఎవరైనా వచ్చి కలుస్తారు నిన్ను’ అని అన్నారు.


నమ్మండి.. ఒక్క అరగంట సేపు నా ఒళ్లు నాకు తెలియలేదు. అంత ఆనందపడ్డా. ఓ పెద్ద ప్రొడ్యూసర్‌ తన సంస్థలో ఆఫర్‌ ఇవ్వడం, అందులోనూ మహానుభావుడు గోపాలరావుగారు వేయాల్సిన వేషాన్ని నాకు ఇవ్వడం... ఆ విషయాన్ని తలచుకునేకొద్దీ గమ్మత్తుగా అనిపించసాగింది. ఎందుకంటే రామానాయుడుగారి సినిమాలో చేయడమంటే నా స్టాండర్డ్‌ పెరిగినట్టేనని నాకు తెలుసు. ఆయన ఆ క్షణం ఇచ్చిన ఆఫర్‌ నన్ను ఇంకో మెట్టు ఎక్కించినట్టు అనిపించింది. అందుకే గాల్లో తేలినంత ఆనందం నాలో. ఇప్పట్లాగా సెల్‌ఫోన్లు ఉంటే ఎవరో ఒకరికి ఫోన్ చేసి చెప్పుకునేవాడినేమో! అవేమీ లేవుగా... అందుకే ఒక్కడినే సంతోషపడుతూ కూర్చున్నా.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-09-08T03:05:14+05:30 IST