సినిమా రివ్యూ: కొండపొలం

ABN , First Publish Date - 2021-10-08T20:42:14+05:30 IST

కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తెరచుకున్నాయి. మొదట కొన్ని వారాలు థియేటర్‌ విడుదలకు కొందరు నిర్మాతలు వెనకడుగు వేసినా విడుదలైన సినిమాలకు ప్రేక్షకాదరణ బావుండడంతో ఇప్పుడు ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. కొన్నివారాలుగా చూస్తే థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈ వారం పంజా వైష్టవ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘కొండపొలం’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సినిమా రివ్యూ: కొండపొలం

చిత్రం: ‘కొండపొలం’

విడుదల తేదీ: 08, అక్టోబర్‌ 2021

నటీనటులు: పంజా వైష్ణ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కోట శ్రీనివాసరావు, సాయుచంద్‌, హేమ, రవి ప్రకాశ్‌, రచ్చ రవి తదితరులు

కెమెరా: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌

కథ–మాటలు: సన్నపురెడ్డి వెంకట్‌రామిరెడ్డి

ఎడిటింగ్‌: శ్రవణ్‌ కటికనేని

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

నిర్మాతలు: వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా

రచన–దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి. 


కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తెరచుకున్నాయి. మొదట కొన్ని వారాలు థియేటర్‌ విడుదలకు కొందరు నిర్మాతలు వెనకడుగు వేసినా విడుదలైన సినిమాలకు ప్రేక్షకాదరణ బావుండడంతో ఇప్పుడు ధైర్యం చేసి ముందుకొస్తున్నారు.  కొన్నివారాలుగా చూస్తే థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈ వారం పంజా వైష్టవ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘కొండపొలం’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదీ వైవిధ్యమైన, కథా బలమున్న చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన క్రిష్‌ సినిమా కావడం ప్రేక్షకులకు సినిమా ఆసక్తి పెరిగింది. ‘ఉప్పెన’లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ నటించిన సినిమా కావడంతో భారీగానే అంచనాలు నెలకొన్నాయి.  సన్నపురెడ్డి వెంకట్‌రామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కడం, రాయలసీమ యాసకు ప్రాముఖ్యతనివ్వడం వంటి అంశాలతో నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. 


కథ:

రవి(వైష్ణవ్‌తేజ్‌) గొర్రెలు పెంచుకునే కుటుంబంలో పుట్టి.. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగాల వేట కోసం వెళ్తాడు. ఇంగ్లిష్‌ భాష మీద అంత పట్టులేకపోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం వల్ల చాలా ఇంటర్వ్యూల్లో రిజెక్ట్‌ అవుతాడు. అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఇంటికి తిరుగుముఖం పడతాడు. వర్షాలు లేక, కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్న తన గ్రామస్థులు తమ గొర్రెల మంద ఆకలి, దప్పిక తీర్చడానికి కొండపొలానికి వెళతారు. తాత (కోట శ్రీనివాసరావు) సలహాతో చదువుకున్న రవి కూడా పయనమవుతాడు. అక్కడికి వెళ్లాక ఆ ప్రాంతవాసులు అమ్మగా భావించే అడవి రవికి ఏం నేర్పింది? అతనిలో వచ్చిన మార్పేంటి? యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఐ.ఎఫ్‌.ఎస్‌కి ఎంపికయ్యేంత ఆత్మవిశ్వాసాన్ని ఎలా సంపాదించాడు. ఈ జర్నీలో ఓబులమ్మ (రకుల్‌ప్రీత్‌సింగ్‌) పోషించిన పాత్ర ఏమిటి అన్నది కథ. 


విశ్లేషణ:

‘వైష్ణవ్‌తేజ్‌కి ఇది రెండో సినిమానే అయినా ఎంతో పరిణితితో నటించాడు. తన నటన, కళ్లతో పలికించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. రవీంద్ర పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయాడు. సీమ యాస పలికిన తీరు కూడా మెప్పిస్తుంది. రకుల్‌ కలిసి చేసిన సన్నివేశాల్లోనూ వైష్ణవ్‌ పాత్ర క్యూట్‌గా అనిపించింది. ఎప్పుడూ గ్లామర్‌ పాత్రలు, పాటలతో అలరించే రకుల్‌ ఇందులో పోషించింది డీ గ్లామర్‌ పాత్రే అయినా చాలా సహజంగా నటించింది. సినిమాలో హీరోహీరోయిన్‌ల మధ్య ఉన్నది చిన్న రొమాంటిక్‌ సీనే అయినా తనదైన శైలిలో మెప్పించారు. కోట శ్రీనివాసరావు, రవి శంకర్‌, సాయిచంద్‌, అన్నపూర్ణమ్మ తమ పాత్రల మేరకు హత్తుకునేలా నటించారు. నవలా రచయితే సినిమాకు మాటలు అందించడం క్రిష్‌కు కాస్త భారం తగ్గినట్లే. అడవిని నాశనం చేస్తూ, చెట్లను నరికి అమ్ముకునే సన్నివేశాల్లో సంభాషణలు భావోద్వేగంగా ఉన్నాయి. నరికి పక్కన పడేసిన చెట్లను చూస్తే ‘తోలు వలచి పడుకోబెట్టిన పసిబిడ్డలా’ ఉందనే సంభాషణలు ఆకట్టుకున్నాయి. అయితే మాటల విషయంలో క్రిష్‌ ఇంకొంచెం కసరత్తులు చేసుంటే.. ఆయన మార్క్‌ కనిపించేది. ఆ మార్క్‌ భావోద్వేక సంభాషణలు మిస్‌ అయిన భావన కలిగింది. నైట్‌ సీన్స్‌లో కెమెరా వర్క్‌ బావుంది. కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్‌. అడవి నేపథ్యంలో సాగే పాటల్లో సాహిత్యం ఆలోజింపచేసేలా ఉంది. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ మీద కాస్త దృష్టి పెట్టాల్సింది.


నల్లమల అడవి నేపథ్యంలో సాగే కథ ఇది. ఉద్యోగం రాక భయంభయంగా జీవితం సాగించే ఓ కుర్రాడు ఆత్మ విశ్వాసంలో తను అనుకున్నది ఎలా సాధించాడు. అడవి, అడవిలాంటి ఓ యువతి అతనికి ఎలాంటి ధైర్యం నింపారు అన్నది ఆసక్తికర అంశాలు. ఈ చిత్రంలో అడవి గొప్పతనం గురించి, ఒక మూగ జీవం మీద ప్రేమ పెంచుకుంటే ఆ భావోద్వేగాలు ఎలా ఉంటాయి అన్నది దర్శకుడు హృద్యంగా చూపించారు. గొర్రెల కాపరుల జీవితాలను, అడవి జీవితాలను అద్భుతంగా చెప్పారు. కథ అడవిలోకి వెళుతున్న కొద్దీ ఆసక్తిరేకెత్తించింది. అడవి గొప్పతనంతోపాటు అడవితో మమేకం అయితే ఆ ఎటాచ్‌మెంట్‌ ఎలా ఉంటుందనే విషయాన్ని క్రిష్‌ భావోద్వేగంగా చూపించారు. అడవిని, చెట్లను పరిరక్షించుకోవాలనే బాధ్యత మనపై ఉందనే సందేశాన్ని ఇచ్చారు. నవల వేరు.. దానిని సినిమాగా మలచడం వేరు. సినిమా అనగానే కొన్ని హద్దులుంటాయి. పుస్తకంలో ఎంత్తైనా రాసుకోవచ్చు.. తెరపై అంత విపులంగా చెప్పే ఆస్కారం, నిడివి ఉండదు. అయినప్పటికీ దర్శకుడు తను చెప్పాలనుకున్నది తక్కువ నిడివిలో చెప్పగలిగాడు. పుస్తకంలో లేని ఓబులమ్మ పాత్రను క్రియేట్‌ చేసి హీరోలో ఆత్మ విశ్వాసం నింపే ప్రక్రియలో ఆ పాత్రను వాడుకున్న తీరు బావుంది. రవి– ఓబులమ్మ పాత్రల మధ్య ఉన్నది చిన్న లవ్‌ ట్రాక్‌ అయినా ఆసక్తికరంగా ఉంది. భయస్తుడిగా అడవిలో అడుగుపెట్టి ఆ వాతావరణానికి అలవాటుపడి, అడవిలో అక్రమాలకు పాల్పడే వారికి బుద్ధి చెప్పిన వైనం ఆకట్టుకుంది. పులి కళ్లలోకి చూసి చేేస పోరాటం సినిమాకి హైలైట్‌. పతాక సన్నివేశాలు అలరించాయి. 

ట్యాగ్ లైన్: భిన్నమైన అడవి కథ

Updated Date - 2021-10-08T20:42:14+05:30 IST