Tax evasion: కోలీవుడ్‌లో రూ.200 కోట్ల పన్ను ఎగవేత

ABN , First Publish Date - 2022-08-07T14:14:33+05:30 IST

ఆదాయపన్నుశాఖ ఆకస్మిక సోదాలతో బెంగపడిన కోలీవుడ్‌.. కొందరు నిర్మాతలు రూ.200 కోట్ల పన్ను ఎగవేసినట్లు తేలడంతో ఉలిక్కిపడింది. ముగ్గురు,

Tax evasion: కోలీవుడ్‌లో రూ.200 కోట్ల పన్ను ఎగవేత

- రూ.26 కోట్ల నగదు, నగల స్వాధీనం 

- భారీగా ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్లు స్వాధీనం 

- నిర్మాతల ఇళ్లలో సోదాలపై ఐటీ శాఖ ప్రకటన 

- ఉలిక్కిపడిన కోలీవుడ్‌ 


అడయార్‌(చెన్నై), ఆగస్టు 6: ఆదాయపన్నుశాఖ ఆకస్మిక సోదాలతో బెంగపడిన కోలీవుడ్‌.. కొందరు నిర్మాతలు రూ.200 కోట్ల పన్ను ఎగవేసినట్లు తేలడంతో ఉలిక్కిపడింది. ముగ్గురు, నలుగురు నిర్మాతల వద్దే ఇంత భారీ స్థాయిలో పన్ను ఎగవేసినట్లు తేలడంతో, మిగిలిన వారిపైనా ఐటీ శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తమిళ చిత్రసీమ(Tamil cinema)లో బడా నిర్మాతలుగా ఉన్న అన్బుచెళియన్‌, కలైపులి ఎస్‌.థాను, ఎస్‌ఆర్‌. ప్రభు, కేఈ జ్ఞానవేల్‌ రాజా గృహాలు, ఆఫీసుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ నెల 2వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సోదాలు చెన్నై, మదురై, కోయంబత్తూరు, వేలూరు(Chennai, Madurai, Coimbatore, Vellore)లలోని మొత్తం 40 ప్రాంతాల్లో జరిగాయి. ప్రఽధానంగా సినీ నిర్మాత, ఫైనాన్షియర్‌గా, గోపురం ఫిలిమ్స్‌ అధినేతగా ఉన్న అన్బుచెళియన్‌, ఆయన సోదరుడు, స్నేహితుల ఇళ్ళను ఐటీ శాఖ అధికారులు టార్గెట్‌ చేశారు. అన్బుచెళియన్‌ గత అన్నాడీఎంకే పదేళ్ళ ప్రభుత్వ హయాంలో అనేక చిత్రాలకు ఫైనాన్స్‌ చేయడమేకాకుండా నిర్మాతలకు రుణాలు కూడా ఇచ్చారని తెలుస్తోంది. కాగా కోవిడ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కోలీవుడ్‌ను ఐటీ శాఖ విసిరిన పంజా వణుకు పుట్టిస్తోంది. ఈ తనిఖీల్లోనే భారీగా నగదు, కీలక దస్తావేజులను స్వాధీనం చేసుకున్నట్టు ఆదాయపన్ను శాఖ శనివారం ఢిల్లీలో విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ‘‘ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని నగదు లావాదేవీలు, అనేక పెట్టుబడులకు సంబంధించి పలు కీలక పత్రాలు, డిజిటల్‌ ఆధారాలు వంటివి స్వాధీనం చేసుకున్నాం. ఈ సోదాల్లో అనేక రహస్య ప్రాంతాలను గుర్తించాం. సినిమా ఫైనాన్షియర్‌ గృహాల్లో జరిగిన సోదాల్లో పలు సినీ నిర్మాణ సంస్థలు, ఇతర సినీ నిర్మాణాలకు ఇచ్చి, లెక్కల్లో చూపించని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రామిసరీ నోట్లు వంటి ఆధారాలను సేకరించాం. సినీ నిర్మాణ సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయి. లెక్కల పుస్తకాల్లో చూపించే వివరాల కంటే, ఒక సినిమా విడుదలైన తర్వాత వారు పొందే మొత్తాలు అధికంగా ఉన్నాయి. కానీ, ఈ మొత్తాలను లెక్కల్లో చూపించడం లేదు. అలాగే, సినిమా పంపిణీదారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆధారాల్లో థియేటర్‌ యాజమాన్యాల నుంచి లెక్కల్లో చూపని మొత్తాన్ని వసూలుచేస్తున్నారు. ఈ సోదాల్లో లభించిన ఆధారాలను పరిశీలిస్తే పంపిణీదారులు తమలోపే ఒక సిండికేట్‌గా ఏర్పడి, థియేటర్ల కలెక్షన్లను ఉద్దేశ్యపూర్వకంగా దాచిపెట్టి, నిజమైన ఆదాయాన్ని చూపించడం లేదు. 2 నుంచి 5వ తేదీ వరకు జరిపిన తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.200 కోట్ల ఆదాయాన్ని గుర్తించాం. రూ.26 కోట్ల నగదు, రూ.3 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. ఇంకా విచారణ కొనసాగుతోంది’ అని ఆదాయపన్ను కమిషనర్‌ ప్రజా సంబంధాల అధికారి (ఓఎస్‏డీ ) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-08-07T14:14:33+05:30 IST