అక్కడ ఎలాంటి చేదు జ్ఞాపకాలు లేవు: Kiccha Sudeep

ABN , First Publish Date - 2022-06-26T22:33:38+05:30 IST

తనకు కోలీవుడ్‌తో పాటు ఇక్కడ హీరోలతో మంచి సంబంధాలే ఉన్నాయని, ముఖ్యంగా చెన్నై లేదా తమిళనాట ఎలాంటి చేదు జ్ఞాపకాలు లేవని కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ (Kiccha Sudeep) చెప్పారు.

అక్కడ ఎలాంటి చేదు జ్ఞాపకాలు లేవు:  Kiccha Sudeep

తనకు కోలీవుడ్‌తో పాటు ఇక్కడ హీరోలతో మంచి సంబంధాలే ఉన్నాయని, ముఖ్యంగా చెన్నై లేదా తమిళనాట ఎలాంటి చేదు జ్ఞాపకాలు లేవని కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ (Kiccha Sudeep) చెప్పారు. ఆయన నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘విక్రాంత్‌ రోణ’ (Vikrant Rona). తమిళ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సినిమా త్రీడి ఫార్మెట్‌లో రూపొందించారు. ‘ఒక ఊరిలో ప్రజలు ఏదో భయంకరమైన నిజం దాచాలనుకుంటారు. ఇంతకీ ఆ ఊరి కథ ఏంటి? ప్రజలు దాచాలనుకున్న నిజం ఏంటి? ఆ ఊరికి ఓ డెవిల్‌ వచ్చింది. ఆ డెవిల్‌ ఎవరు? భయం నిండిన ఆ ఊరికి భయమంటే ఎంటో తెలియని ఒకరు వచ్చారు. ఆయన ఎవరు? అన్నదే ఈ చిత్ర కథ. అనూప్‌ బండారీ (Anup Bhandari) దర్శకత్వం వహించారు. ఇందులో సందీప్‌ కిషన్‌ (Sandeep Kishan)తో పాటు నీతా అశోక్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ (Jacqueline Fernandez), నిరూప్‌ బండారి కీలక పాత్రలు పోషించారు. 


ఈ చిత్రం తమిళ ట్రైలర్‌ను నిర్మాతలు టీజీ త్యాగరాజన్‌, శివ, నటుడు శ్యామ్‌ సమక్షంలో రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ విక్రాంత్‌ రోణ మంచి సక్సెస్‌ సాధించాలని ఆకాంక్షించారు. అలాగే, విలేకరులు అడిగిన ప్రతి ప్రశ్నకు కిచ్చా సుదీప్‌ సమాధానాలు ఇచ్చారు. ‘హిందీ భాష ఆధిక్యతపై నేను చేసిన ట్వీట్‌లో ఎలాంటి వివాదాస్పదం లేదు. దాన్ని అర్థం చేసుకునే వారిలోనే ఏదో లోపం ఉంది. ‘కేజీఎఫ్‌’ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం చాలా సంతోషం. తమిళంలో ‘నాన్‌ ఈ’ చిత్రం తర్వాత నాకు నటించే అవకాశాలు రాలేదు. 


ఇపుడు ‘విక్రాంత్‌ రోణ’ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. కోలీవుడ్‌లో కూడా అనేక మంది మంచి హీరోలున్నారు. వారంతా ఉన్నతస్థాయికి చేరుకోవాలి. నేను కోలీవుడ్‌కు అతిథిలా వచ్చాను. ఇక్కడి ప్రేక్షకులు మంచి విందు భోజనం పెట్టారు. కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వంటి అనేకమంది నటీనటులతో మంచి సంబంధాలున్నాయి’ అని పేర్కొన్నారు. దర్శకుడు అనూప్‌ భండారీ మాట్లాడుతూ.. ‘సినిమా షూటింగ్‌ మామూలుగానే చిత్రీకరించి, త్రీడీ ఫార్మెట్‌లోకి మార్చాం’ అని చెప్పారు. జీ స్టూడియోస్‌, కిచ్చా క్రియేషన్స్‌ సమర్పణలో షాలిని ఆర్ట్స్‌ పతాకంపై నిర్మాతలు షాలిని, జాక్‌ మంజునాథ్‌, సహ నిర్మాత అలంకార్‌ పాండ్యన్‌ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం జూలై 28వ తేదీన విడుదల చేయనున్నారు.

Updated Date - 2022-06-26T22:33:38+05:30 IST