అదే జరిగితే ఆ రికార్డు బ్రేక్ చేసిన నాలుగో సినిమాగా KGF Chapter 2.. అందులో మనవే మూడు చిత్రాలు..!

ABN , First Publish Date - 2022-04-25T23:40:39+05:30 IST

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్: చాప్టర్-2’. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘కెజియఫ్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

అదే జరిగితే ఆ రికార్డు బ్రేక్ చేసిన నాలుగో సినిమాగా KGF Chapter 2.. అందులో మనవే మూడు చిత్రాలు..!

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కెజియఫ్: చాప్టర్-2’. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘కెజియఫ్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రశాంత్ నీల్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలైంది. రిలీజ్ అయిన నాటి నుంచే ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తుంది. బాలీవుడ్‌లో తొలిరోజే రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. త్వరలోనే ఈ చిత్రం రూ. 1000కోట్ల కలెక్షన్లను  కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. 


ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లను చూస్తే ఆ ఫీట్ అసాధ్యమేమీ కాదు. గతంలో ‘దంగల్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలు మాత్రమే రూ.1000 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేశాయి. ప్రస్తుతం ‘కెజియఫ్-2’ ఆ స్థాయి వసూళ్లను సాధిస్తే రూ.1000కోట్ల క్లబ్‌లో చేరిన నాలుగో భారతీయ చిత్రం అవుతుంది. అప్పుడు ఆ ఫీట్ సాధించిన చిత్రాల్లో మూడు సినిమాలు దక్షిణాది ఇండస్ట్రీవే అవుతాయి.


దంగల్: 

రెజ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆమిర్ ఖాన్ హీరోగా నటించాడు. ఈ సినిమా 2016లో విడుదలైంది. మహావీర్ సింగ్ ఫోగట్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను రూపొందించారు. నితీశ్ తివారీ దర్శకత్వం వహించాడు. ఫాతిమా సనా షేక్, సాన్యా మల్హోత్రా, జైరా వసీం కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 


బాహుబలి: ది కన్‌క్లూజన్: 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ప్రభాస్ హీరోగా నటించాడు. రానా, అనుష్క శెట్టి, సత్య రాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 2017లో విడుదలైంది. ఈ చిత్రంతోనే సౌత్ ఇండస్ట్రీ సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రూ.1750కోట్ల వసూళ్లను రాబట్టింది. 


ఆర్‌ఆర్‌ఆర్: 

‘బాహుబలి’ విజయ పరంపరను కొనసాగిస్తూ రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాలో తారక్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2022లో ఈ మూవీ విడుదలైంది. కరోనా అనంతరం విడుదలైన ఈ  సినిమా థియేటర్స్‌కు కళను తీసుకువచ్చింది. ఇప్పటికీ థియేటర్స్‌లో ఈ చిత్రం నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటికే రూ. 1110కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది.


కెజియఫ్: చాప్టర్ -2

‘కెజియఫ్-1’ విజయం సాధించడంతో రెండో భాగంపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఆ అంచనాలన్నింటిని అధిగమించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.900కోట్ల వసూళ్లను రాబట్టింది. త్వరలోనే రూ. 1000కోట్ల మార్కును అధిగమించే అవకాశం ఉంది. 


Updated Date - 2022-04-25T23:40:39+05:30 IST