ఏప్రిల్‌లో థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే.. KGF 2 నుంచి Beast వరకు ఏ తేదీన ఏ సినిమా రిలీజ్ అంటే..

ABN , First Publish Date - 2022-03-31T18:51:15+05:30 IST

కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యాయి. దీంతో ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని..

ఏప్రిల్‌లో థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే.. KGF 2 నుంచి Beast వరకు ఏ తేదీన ఏ సినిమా రిలీజ్ అంటే..

కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యాయి. దీంతో ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పటి దాకా పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న పాన్ ఇండియా చిత్రాలు మొత్తానికి విడుదలకు నోచుకుంటున్నాయి. ఇటీవలే ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా విడుదల అయింది. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ ప్రభాస్ అభిమానులను మాత్రం అలరించింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు కలెక్షన్లను సాధించింది. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న విడుదలయి ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తోంది. ఇక ఏప్రిల్‌లోనూ వరుసగా భారీ చిత్రాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. ఏప్రిల్‌ నెలలో విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్ ఏంటన్నది చూద్దాం..


1. కేజీఎఫ్ ఛాప్టర్ 2

‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’.. 2018లో వచ్చిన ఈ మూవీ సృష్టించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కన్నడ నటుడు యశ్‌కి ప్రాంతాలకు అతీతంగా అభిమానులను సంపాదించి పెట్టింది. దీనికి సీక్వెల్‌‌గా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ఉన్నట్లు చిత్రబృందం అప్పుడే ప్రకటించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ భారీ చిత్రం ఏప్రిల్ 14న కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.


2.బీస్ట్

తమిళంతోపాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు దళపతి విజయ్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘బీస్ట్’. అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన ‘అరబిక్ కుతు’, ‘జాలీ ఓ జింఖానా’ పాటలు మంచి హిట్ సాధించి మూవీపై అంచనాలను భారీగా పెంచాయి. డార్క్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌కి తెరకెక్కించడంలో దిట్ట అయిన నెల్సన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.


3. ఎటాక్

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం, రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కలిసి నటించిన చిత్రం ‘ఎటాక్’. జాన్ సూపర్ సైనికుడిగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 1న విడుదలకానుంది. లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి సీక్వెల్ కూడా ఉండనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.


4. జెర్సీ

టాలీవుడ్ యువ నటుడు నాని నటించిన సూపర్ హిట్ చిత్రం ‘జెర్సీ’. ఈ మూవీ అదే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా బాలీవుడ్‌లో రిమేక్ అవుతోంది. మాతృకకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరే దీనికి డైరెక్షన్ చేశాడు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదలకానుంది.


5. రన్‌వే 34

అజయ్ దేవ్‌గణ్ నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రన్‌వే 34’. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ , బోమన్ హీరానీ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న థియేటర్స్‌లో విడుదల కానుంది.


6. హీరోపంటి 2

యువ నటుడు టైగర్ ఫ్రాఫ్, యువ నటి కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘హీరోపంటి’. 2014లో విడుదలై మంచి హిటైన ఈ మూవీకి సీక్వెల్ వస్తున్నదే ‘హీరోపంటి 2’. అజయ్ దేవ్‌గణ్ ‘రన్‌వే 34’ పోటీగా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. అయితే ఇందులో కృతి స్థానంలో తారా సుతారియా హీరోయిన్‌గా నటించింది.


7. దస్వీ

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ నటించిన తాజా చిత్రం ‘దస్వీ’. రాజకీయ నేపథ్యంలో హాస్య ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. యామీ గౌతమ్, నిమ్రత్ కౌర్ ముఖ్యపాత్రల్లో నటించారు.

Updated Date - 2022-03-31T18:51:15+05:30 IST