దుల్కర్ సల్మాన్‌పై నిషేధం విధించిన కేరళ థియేటర్ ఓనర్స్

ABN , First Publish Date - 2022-03-16T21:18:06+05:30 IST

స్టార్ హీరో మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి

దుల్కర్ సల్మాన్‌పై నిషేధం విధించిన కేరళ థియేటర్ ఓనర్స్

స్టార్ హీరో మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దుల్కర్ సల్మాన్. ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. కొన్ని రోజుల క్రితమే ‘కురుప్’ మూవీతో థియేటర్లలో సందడి చేశాడు. బాక్సాఫీస్ హిట్లతో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్‌పై కేరళ థియేటర్ ఓనర్స్ నిషేధం విధించారు. అతడు నటించిన చిత్రాలన్నింటినీ బాయ్‌కాట్ చేయాలని ద ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ(ఎఫ్‌ఈయూకే) నిర్ణయించింది. అందుకు కారణమేంటంటే..


దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం ‘సెల్యూట్’. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫా‌మ్‌ అయిన సోనీలీవ్‌లో విడుదల చేయాలని దుల్కర్ నిర్ణయించుకున్నాడు. ‘సెల్యూట్’ను థియేటర్లలో రిలీజ్ చేయకుండా... నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌‌లో విడుదల చేస్తుండటంతో అతడి సినిమాల్నింటినీ బాయ్‌కాట్ చేయాలని ఎఫ్‌ఈయూకే నిర్ణయించుకుంది. అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంపై దుల్కర్ ఇప్పటి వరకు స్పందించలేదు. 


‘సెల్యూట్’ సినిమా ఈ ఏడాది జనవరి14నే విడుదల కావాలి. భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. దుల్కర్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వే ఫారర్ ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ మూవీలో అతడు పోలీస్ పాత్రలో అలరించనున్నాడు. డయానా పెంటీ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికి రోషన్ అండ్రూస్ దర్శకత్వం వహించాడు.



Updated Date - 2022-03-16T21:18:06+05:30 IST