రావత్ సాక్షిగా... అలీ అక్బర్ ఇకపై రామసింహన్...

ABN , First Publish Date - 2021-12-12T00:52:58+05:30 IST

అతనో మలయాళ దర్శకుడు. కొన్ని సినిమాలు రూపొందించాడు. అయితే, తాజాగా అలీ అక్బర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

రావత్ సాక్షిగా... అలీ అక్బర్ ఇకపై రామసింహన్...

అతనో మలయాళ దర్శకుడు. కొన్ని సినిమాలు రూపొందించాడు. అయితే, తాజాగా అలీ అక్బర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దివంగత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణం సందర్భంగా ‘కొందరి’ ప్రవర్తన, స్పందనలు ఆయనకు నచ్చకపోవటంతో ఇస్లామ్ మతంపై నమ్మకం పోయిందని ప్రకటించాడు. అంతే కాదు, తాను భార్యతో సహా మతం మారిపోనున్నట్టు ప్రకటించాడు. అలీ అక్బర్ త్వరలో హిందూ మతం స్వీకరించనున్నాడు... 


జనరల్ బిపిన్ రావత్ మరణం గురించిన సొషల్ మీడియా పోస్టులకి కొందరు నెటిజన్స్ నవ్వుతోన్న ఎమోజీలతో తమ స్పందన తెలియజేయటం ఎంతో తప్పని అలీ అక్బర్ అన్నాడు. ఇదే విషయాన్ని చెబుతూ ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశాడు. అయితే, తరువాత అలీ మరో అడుగు ముందుకు వేస్తూ తనకు తన మతంపైనే నమ్మకం సడలిపోయిందని వ్యాఖ్యానించాడు. తన భార్య లూసియమ్మతో కలసి త్వరలోనే హిందూ మతంలోకి వచ్చేస్తానని చెప్పాడు. 


ఇస్లామ్ నుంచీ బయటకు వచ్చి హిందువుగా మారాక తన పేరు ఏంటో కూడా అలీ అక్బర్ ప్రకటించాడు. తాను ఇక మీదట ‘రామసింహన్’ అని చెప్పాడు. ఆ పేరు ప్రత్యేకంగా ఎంచుకోవటానికి కూడా ఓ కారణం ఉందట. గతంలో రామసింహన్ అనే ఆయన తన సంస్కృతి కోసం దైర్యంగా ప్రాణాలు ఎదురొడ్డి నిలవటంతో చనిపోవాల్సి వచ్చింది. అలాంటి దైర్యశాలీ పేరే తాను పెట్టుకోబోతున్నానని రామసింహన్ వివరించాడు... 


దేశం కోసం జీవితాంతం పని చేసిన ఓ గొప్ప సైనిక అధికారి మృతిని కూడా అవమానించటం రామసింహన్ని బాధించటంతో ఆయన తన ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసేశాడు. అంతే కాదు, ఏ మత పెద్ద కూడా జరుగుతోన్నది తప్పని ప్రకటించకపోవటం ఆయనని మరింత ఆగ్రహానికి గురి చేసిందట. అందువల్లే హిందూ మతంలోకి మారాలని నిర్ణయించుకున్నాడట. 


మతం మారాలనే తన నిర్ణయాన్ని కొత్త సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపిన రామసింహన్ కూతుర్లని మాత్రం ఒత్తిడి చేయబోనని అన్నాడు. వాళ్ల ఇష్ట ప్రకారం వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు. అయితే, సినిమా దర్శకుడిగా కేరళలో పేరున్న రామసింహన్ అలియాస్ అలీ అక్బర్‌కు గతంలో బీజేపీతో రాజకీయ అనుబంధం ఉండటం గమనార్హం. కేరళ బీజేపీ స్టేట్ కమిటీ మెంబర్‌గా కొంత కాలం ఉన్న ఆయన రాష్ట్ర స్థాయి కమలదళం నేతలతో అభిప్రాయభేదాలు రావటంతో కాషాయ పార్టీ నుంచీ బయటకు వచ్చేశాడు... 

Updated Date - 2021-12-12T00:52:58+05:30 IST