‘మహానటి’ కీర్తిసురేశ్ (Keerthi Suresh) తన మాతృభాష మలయాళంలో కథానాయికగా నటించిన రెండో సినిమా ‘వాశి’ (పట్టుదల) (Vaashi). యంగ్ హీరో టోవినో థామస్ (Tovino Thomas) కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి మలయాళ యువ నటుడు విష్ణు జి రాఘవ్ (Vhishnu G Raghav) దర్శకత్వం వహించాడు. కీర్తి సురేశ్ తండ్రి జి.సురేశ్ కుమార్ (G.Suresh Kumar) ఈ సినిమాను నిర్మించారు. జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసల్ని సైతం దక్కించుకుంది. ఇందులో కీర్తి సురేష్, టోవినో థామస్ ఇద్దరూ లాయర్స్ గా నటించడం విశేషం.
ఒక కేసు విషయంలో ఇద్దరు ప్రేమికులు కోర్ట్ రూమ్ లో ప్రత్యర్ధులుగా మారడం ఈ సినిమా కథాంశం. చక్కటి సామాజిక ఇతి వృత్తం కలిగిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ నెల 17నుంచి ‘వాశి‘ చిత్రం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్రీమింగ్ కాబోతోంది. మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. థియేటర్స్‌లో విడుదలైన నెల రోజులకు చిత్రం ఓటీటీలోకి రానుండడం విశేషం. ‘సర్కారువారి పాట’ చిత్రంతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న కీర్తి... ఈ సినిమాతో మలయాళంలోనూ హిట్ అందుకోవడం మరో విశేషం. మరి ఈ సినిమా ఓటీటీలో ఇంకెంతగా ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి.