బన్నీ నా లక్కీ స్టార్!

ABN , First Publish Date - 2022-08-21T15:01:01+05:30 IST

కేథిరిన్‌ థెరిస్సా... గ్లామర్‌ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌. కాకపోతే... తమిళ, మలయాళ చిత్రాల్లో మాత్రం నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో మెరిసింది. తెలుగులోనూ అలాంటి ఛాన్సు కోసం ఎదురు చూస్తోందట. ‘‘దక్షిణాదిన ప్రతి భాషలోనూ ఓ సొగసు ఉంది. ఒక్కో చోట సినిమాని

బన్నీ నా లక్కీ స్టార్!

కేథిరిన్‌ థెరిస్సా... గ్లామర్‌ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌. కాకపోతే... తమిళ, మలయాళ చిత్రాల్లో మాత్రం నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో మెరిసింది. తెలుగులోనూ అలాంటి ఛాన్సు కోసం ఎదురు చూస్తోందట. ‘‘దక్షిణాదిన ప్రతి భాషలోనూ ఓ సొగసు ఉంది. ఒక్కో చోట సినిమాని ఒక్కోలా చూస్తుంటారు. తెలుగులో ఎక్కువగా కమర్షియల్‌ సినిమాలే వస్తుంటాయి. కాబట్టి.. ఆ తరహా పాత్రలే చేశా’’ అంటోంది కేథరిన్‌. ఇటీవల ‘బింబిసార’, ‘మాచర్ల నియోజకవర్గం’లో మెరిసిన ఈ అందాల తార మనసులోని ముచ్చట్లివి...


లాస్ట్‌ బెంచ్‌ స్టూడెంట్‌

‘‘నేను పుట్టి పెరిగింది దుబాయ్‌లో. అక్కడే 12 వరకూ చదువుకొన్నా. చదువులో ఫస్ట్‌. ఎప్పుడూ స్కూలు ఎగ్గొట్టిందే లేదు. కాకపోతే.. నాదెప్పుడూ లాస్ట్‌  బెంచే. ఇంట్లో కూడా అల్లరి చేసేదాన్ని కాదు. నాన్న చాలా స్రిక్ట్‌గా ఉండేవారు. ఇంట్లో ప్రతీ దానికీ ఓ టైమ్‌ టేబుల్‌ ఉండేది. చదువుకొనే టైమ్‌లో.. టీవీ చూస్తే ఇక అంతే సంగతులు. ఇప్పటికీ ఇంట్లో టైమ్‌ అంటే టైమే. ఈ క్రమ శిక్షణ సినిమాల్లోకి వచ్చాక బాగా పనికొచ్చింది. చిన్నప్పుడు నాకు రకరకాల దుస్తులు ధరించాలని ఉండేది. ప్యాంటూ, షర్టూ వేసుకొని టామ్‌బోయ్‌లా కనిపించాలని అనుకొనేదాన్ని. ఓసారి అమ్మానాన్నకు చెప్పకుండా జీన్స్‌ కొనుక్కొన్నా. దాంతో పెద్ద గొడవే జరిగింది. ఎక్కడ కొన్నానో, మళ్లీ అక్కడికే వెళ్లి ఇచ్చి వచ్చేశా.’’


మళ్లీ మళ్లీ వింటా

‘‘నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే పాటలు వింటుంటాను. ఒక్కోసారి నచ్చిన పాటని రోజంతా మళ్లీ మళ్లీ ప్లే చేస్తుంటాను. పుస్తకాలు చదువుతుంటా. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు నా చేతిలో పుస్తకం ఉంటే చాలు. ఇంకేం అవసరం లేదు. అన్ని రకాల ఆహార పదార్థాల్నీ ఇష్టపడతా. స్వీట్స్‌లో తాపేశ్వరం కాజా అంటే మరీ ఇష్టం.’’



అలాంటి పాత్ర దొరకదు

‘పైసా’లో నేను చేసిన పాత్రంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువ సన్నివేశాల్లో కళ్లతోనే హావభావాలు పలించాను. ‘ఇద్దరమ్మాయిలతో’ నాకు మంచి గుర్తింపు వచ్చింది. ‘సరైనోడు’తో పెద్ద కమర్షియల్‌ హిట్‌ దొరికింది. అల్లు అర్జున్‌తో చేసిన రెండు సినిమాలూ నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. అలా బన్నీ నా లక్కీ స్టార్‌ అయిపోయాడు.’’


తొలి అవకాశం అలా...

‘‘ఇంటర్‌ పూర్తయ్యాక మేం బెంగళూరు వచ్చేశాం. అక్కడే నేను డిగ్రీ చదివా. కాలేజీ రోజుల్లోనే ‘శంకర్‌ ఐపీఎస్‌’ అనే కన్నడ చిత్రంలో అవకాశం వచ్చింది. సరదాగా చేశా. అక్కడి నుంచి వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. తెలుగులో నా మొదటి సినిమా ‘ఛమ్మక్‌ ఛల్లో’. అది చేస్తున్నప్పుడే ‘పైసా’లో ఛాన్స్‌ వచ్చింది. దుబాయ్‌లో పుట్టి పెరగడం వల్ల ఇంగ్లీష్‌ తప్ప మరే భాష వచ్చేది కాదు. సినిమాలు చేస్తూనే తెలుగు, తమిళం, కన్నడ కొంచెం కొంచెం నేర్చుకొన్నా.’’


ఇబ్బంది ఏం లేదు...

‘‘నా కెరీర్‌ గమనించండి. సోలో హీరోయిన్‌గా అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. మరో కథానాయికతో కలిసి ఆ పాత్ర పంచుకోవాల్సి వచ్చింది. దీన్నేం తప్పుబట్టడం లేదు. సాధారణంగా తెలుగు సినిమాల్లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండడం సహజం. ఎప్పటి నుంచో ఈ సంప్రదాయం ఉంది. శ్రీదేవి, జయసుధ, జయప్రద.. వీళ్లు కూడా ఈ తరహా పాత్రలు, కథలూ చేసినవారే. కాబట్టి ‘సెకండ్‌ హీరోయిన్‌’ అనే పిలుపు నాకేం ఇబ్బందిగా ఉండదు. సినిమా మొత్తమ్మీద ఒకట్రెండు సన్నివేశాలు ఉన్నా చాలు.’’


Updated Date - 2022-08-21T15:01:01+05:30 IST