Karthikeya 2: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న నిఖిల్ మూవీ.. ఆ సినిమా వరకు అడ్డులేనట్టేనా..?

ABN , First Publish Date - 2022-08-31T19:12:10+05:30 IST

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయంతో దూసుకెళ్తున్న మూవీ ‘కార్తీకేయ 2(Karthikeya 2)’. 2014లో విడుదల సూపర్ హిటైన తెలుగు చిత్రం ‘కార్తీకేయ’.

Karthikeya 2: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న నిఖిల్ మూవీ.. ఆ సినిమా వరకు అడ్డులేనట్టేనా..?

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయంతో దూసుకెళ్తున్న మూవీ ‘కార్తీకేయ 2(Karthikeya 2)’. 2014లో విడుదల సూపర్ హిటైన తెలుగు చిత్రం ‘కార్తీకేయ’ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha), అనుపమ పరమేశ్వరన్ ముఖ్యపాత్రల్లో నటించగా.. చందు మొండేటి దర్శకత్వం వహించాడు. అయితే ఈ సీక్వెల్ మూవీ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్టు 13న విడుదలైంది. రిలీజైన ప్రతిచోట మొదటి రోజే సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుని దూసుకెళుతోంది.


అయితే.. ఈ సినిమా టీం విడుదలకి ముందు చాలా థియేటర్లు దొరక్క చాలా ఇబ్బంది పడింది. ముఖ్యంగా.. హిందీ బెల్ట్‌లో అయితే ముందురోజే బాలీవుడ్ స్టార్ హీరోలైన ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ విడుదలవడంతో.. చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే థియేటర్లు దొరికాయి. కానీ.. ఆ రెండు సినిమాలకు ఫ్లాప్ టాక్ రాగా.. అదే సమయంలో ‘కార్తీకేయ 2’కి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. దాంతో.. రెండో రోజు నుంచే ఆ సినిమాలను తీసేసి మరి నిఖిల్ మూవీని థియేటర్స్‌లో వేసుకోవడం మొదలుపెట్టారు. అలా.. బాలీవుడ్‌లోను మంచి కలెక్షన్లను కొల్లగొడుతూ దూసుకెళుతోంది.


అలాగే.. దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేసిన మరో పాన్ ఇండియా మూవీ ‘లైగర్(Liger)’. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం విడుదలైన రోజే డిజాస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంది. అది ఈ సినిమాకి ఇంకా కలిసొచ్చింది. దాంతో ఆ సినిమా విడుదలై మూడు వారాలు దాటిన థియేటర్స్‌లో విజయవంతంగా రన్ అవుతోంది. కాగా.. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అప్పటి వరకూ మరే సినిమా లేకపోవడంతో ఈ సినిమా తన వేటను కొనసాగించే అవకాశం ఉంది.


కాగా.. ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ‘కార్తీకేయ 2’ హిందీ కలెక్షన్ల గురించి ఓ ట్వీట్ చేశాడు. అందులో.. ‘కార్తికేయ 2 కొన్ని మాస్ ఏరియాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.. ఈ కలెక్షన్ల వేటను కొనసాగించడానికి బ్రహ్మాస్త్ర వచ్చే వరకు సమయం ఉంది. హిందీ వెర్షన్‌కి సంబంధించిన 3వ వారంలో శుక్ర-రూ.82 లక్షలు, శని-రూ.1.65 కోట్లు, ఆది-రూ.1.77 కోట్లు, సోమ-రూ.68 లక్షలతో కలిపి మొత్తం: రూ.24.21 కోట్లు వసూళ్లు సాధించింది’ అని రాసుకొచ్చాడు.



Updated Date - 2022-08-31T19:12:10+05:30 IST