Karthi: మరో సీక్వెల్‌కి రెడీ అవుతున్న కార్తీ

ABN , First Publish Date - 2022-10-27T14:30:06+05:30 IST

కోలీవుడ్‌ (Kollywood)తో పాటు టాలీవుడ్‌(Tollywood)లోనూ మంచి పాపులారిటీ ఉన్న తమిళ నటుల్లో కార్తీ (Karthi) ఒకరు..

Karthi: మరో సీక్వెల్‌కి రెడీ అవుతున్న కార్తీ

కోలీవుడ్‌ (Kollywood)తో పాటు టాలీవుడ్‌(Tollywood)లోనూ మంచి పాపులారిటీ ఉన్న తమిళ నటుల్లో కార్తీ (Karthi) ఒకరు. ‘యుగానికి ఒక్కడు’ తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఆయన వరుసగా సక్సెస్ ‌ఫుల్ సినిమాలతో దూసుకెళుతున్నాడు. అయితే.. కొన్నేళ్ల క్రితం కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దాంతో.. ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ తెరకెక్కనుంది. లోకేశ్ కనగరాజ్ క్రియేట్ చేసిన ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. అలాగే కార్తీ నటించిన మరో చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. ఇటీవలే విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీకి కూడా సీక్వెల్ రానుంది. ఈ తరుణంలో ఆయన మరో సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అదే కార్తీ తాజా హిట్ సినిమా ‘సర్దార్’.


దీపావళి సందర్భంగా విడుదలైన ‘సర్దార్‌’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మంచి కంటెంట్‌తో సినిమా నిర్మించారంటూ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ను తాజాగా నిర్వహించారు. ఇందులో హీరో కార్తి మాట్లాడుతూ.. ‘‘సర్దార్‌’ ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. కొత్త కంటెంట్‌తో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎల్లవేళలా ఆదరిస్తారని మరోమారు నిరూపించారు. ఈ చిత్రానికి రెండో భాగం (సీక్వెల్‌) నిర్మిస్తాం’ అని ప్రకటించాడు. ఈ సక్సెస్‌ మీట్‌లో దర్శకుడు పీఎస్.మిత్రన్‌, నిర్మాత ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. హీరో కార్తికి ఈ యేడాది బాగా కలిసివచ్చింది. ఇప్పటివరకు విడుదలైన మూడు చిత్రాలు సక్సెస్‌ సాధించాయి. ‘విరుమన్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాలు మంచి ప్రజాదరణ పొందగా.. ఇప్పుడు ‘సర్దార్‌’ కూడా విజయం సాధించింది.

Updated Date - 2022-10-27T14:30:06+05:30 IST