అందమైన మూర్ఖురాలు అంటూ అలియాను విమర్శించిన కంగన

ABN , First Publish Date - 2022-02-20T21:24:19+05:30 IST

ఎటువంటి సంకోచం లేకుండా మాటలను తూటల్లా పేల్చే నటి కంగనా రనౌత్

అందమైన మూర్ఖురాలు అంటూ అలియాను విమర్శించిన కంగన

ఎటువంటి సంకోచం లేకుండా మాటలను తూటల్లా పేల్చే నటి కంగనా రనౌత్. అందుకే ఆమెను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు. రాజకీయాలు, సినిమాలపై తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంది. మరోసారి ఆమె ‘గంగూబాయి కతియవాడి’ సినిమాపై విరుచుకుపడింది. అలియా భట్‌ను అందమైన మూర్ఖురాలు అంటూ విమర్శించింది. కరణ్ జోహార్‌ను మూవీ మాఫియా డాడీ అని పేర్కొంది.   


సోషల్ మీడియాలో కంగన ఓ పోస్ట్‌ను పెట్టింది. ఈ శుక్రవారం రూ.200కోట్లు బూడిదలో పోసిన పన్నీరవుతుందని చెప్పింది. ‘‘అలియా భట్ అంటే మూవీ మాఫియా డాడీకి ఇష్టం. అందమైన మూర్ఖురాలు, బ్రిటిష్ పౌరురాలైన ఆమె.. రొమాంటిక్ కామెడీలో నటించగలదని డాడీ నిరూపించాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కాస్టింగే పెద్ద మైనస్. మూవీ మాఫియా బాలీవుడ్‌ను నాశనం చేస్తోంది. అందుకే సౌత్, హాలీవుడ్ సినిమాలు ఇక్కడి థియేటర్లల్లో ఆడుతున్నాయి. ఈ మాఫియా పవర్‌లో ఉన్నంత కాలం బాలీవుడ్ పరిస్థితి మారదు’’ అని కంగనా రనౌత్ పేర్కొంది. అలియా భట్ పేరును మాత్రం పోస్ట్‌లో ఎక్కడ ప్రస్తావించలేదు. అయితే, అలియా బ్రిటిష్ పౌరురాలు అన్న విషయం అందరికీ తెలిసిందే.


కొన్ని రోజుల క్రితం కూడా కంగన ఈ చిత్రాన్ని విమర్శిస్తూ పోస్ట్ పెట్టింది. ‘గంగూబాయి’ చిత్రంలోని అలియా భట్ లాగా నోట్లో బీడీ పెట్టుకుని కొంత మంది చిన్నపిల్లలు కొన్ని డైలాగులు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. చిన్న పిల్లలు చేసిన ఆ వీడియోని చూసిన అలియా ఇంప్రస్ అయ్యి సోషల్ మీడియా వేదికగా వారిని పొగడ్తలతో ముంచెత్తింది. అయితే, అది నచ్చని కంగన, అలియాపై విమర్శలు గుప్పించింది. ‘నోటిలో బీడీ పెట్టుకుని ఉన్న ఓ చిన్నారి అసభ్యకరమైన డైలాగులతో సెక్స్ వర్కర్‌ని అనుకరించాలా?.. ఆమె బాడీ లాంగ్వేజ్ చూడండి. ఈ వయస్సులో ఆమెను అలా చూపడం సరైనదేనా? వందలాది మంది పిల్లలు ఇలాగే చేస్తున్నారు’ అంటూ రాసుకొచ్చింది. ‘గంగూబాయి కతియవాడి’ చిత్రానికి సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది.



Updated Date - 2022-02-20T21:24:19+05:30 IST