Vikram: కమల్ హాసన్ ‘విక్రమ్’ అక్కడ తుస్సుమంది

ABN , First Publish Date - 2022-09-24T18:39:28+05:30 IST

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో

Vikram: కమల్ హాసన్ ‘విక్రమ్’ అక్కడ తుస్సుమంది

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో తెలిసిందే. జూన్ 3న భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. అంతే భారీగా విడుదలైన అన్ని చోట్లా సక్సెస్‌ఫుల్ టాక్‌ని సొంత చేసుకోవడమే కాకుండా.. అంతే స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా కమల్‌ హాసన్‌కు ఇది పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఫిల్మ్‌గా నిలిచింది. అయితే, వెండితెర ప్రేక్షకులని బీభత్సంగా అలరించిన ఈ చిత్రం.. బుల్లితెర ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. బుల్లితెరపై ఈ చిత్రం తుస్సుమంది.


లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.. బుల్లితెరపై సాధారణమైన టీఆర్పీతో సరిపెట్టుకుంది. ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. జూలై 8 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోకి అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రాన్ని.. సెప్టెంబర్ 11న టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మాలో టెలికాస్ట్ చేశారు. మొదటిసారి బుల్లితెరపై టెలికాస్ట్ అయిన ఈ మూవీ కేవలం 5.1 టీఆర్పీ రేటింగ్‌ను మాత్రమే నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా బుల్లితెరపై ఫ్లాప్ అంటూ కామెంట్స్ ప్రత్యక్షమవుతున్నాయి. కానీ, సినిమా విడుదల తర్వాత వచ్చిన సక్సెస్ టాక్‌తో ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లలో చూడటంతో పాటు.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కూడా అందుబాటులో ఉండటంతో.. బుల్లితెరపై ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. ‘విక్రమ్’ అనే కాదు.. ఇంతకు ముందు బుల్లితెరపైకి వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలైన ‘ఆర్ఆర్ఆర్’ (RRR), ‘కెజియఫ్’ (KGF) చిత్రాలదీ ఇదే పరిస్థితి. వెండితెరపై చూసిన చిత్రాలను మళ్లీ బుల్లితెరపై చూసేందుకు.. ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడం వల్లే.. బుల్లితెరపై ఈ చిత్రాలు ఫ్లాప్ అవుతున్నాయనేది.. ఆయా చిత్రాల హీరోల అభిమానుల వాదన. ఏది ఏమైనా.. సినిమా చూసే విధానంలో ప్రేక్షకుల తీరు మారిందనేది ఇక్కడ మరోసారి స్పష్టంగా అర్థమవుతోంది.


‘విక్రమ్’ విషయానికి వస్తే.. కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil)‪తో పాటు హీరో సూర్య (Suriya) అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులని అలరించారు. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని హీరో నితిన్ (Nithiin)కి చెందిన శ్రేష్ట్ మూవీస్ సంస్థ విడుదల చేసింది.

Updated Date - 2022-09-24T18:39:28+05:30 IST