Bimbisara: యుద్ధం ఎలా ఉంటుందో.. చూపిస్తానంటోన్న దర్శకుడు

ABN , First Publish Date - 2022-07-14T02:19:32+05:30 IST

వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ.. కెరీర్ ప్రారంభ నుంచి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ (Kalyan Ram). ఇప్పుడాయన ‘బింబిసార’ (Bimbisara) అంటూ ప్రేక్షకులను

Bimbisara: యుద్ధం ఎలా ఉంటుందో.. చూపిస్తానంటోన్న దర్శకుడు

వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ.. కెరీర్ ప్రారంభ నుంచి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ (Kalyan Ram). ఇప్పుడాయన ‘బింబిసార’ (Bimbisara) అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ట్యాగ్ లైన్. వశిష్ట (Vassishta) ఈ చిత్రంతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను రీసెంట్‌గా విడుదల చేయగా అద్భుతమైన స్పందనను అందుకోవడమే కాకుండా.. ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. తాజాగా గురుపూర్ణిమ (జూలై 13) సందర్భంగా బుధవారం ఈ మూవీ నుంచి ‘ఈశ్వరుడే..’ (Eeswarude) అనే లిరిక్స్‌తో సాగే మొదటి పాటను విడుద‌ల చేశారు. ఈ పాటకు చిరంతన్ భట్ స్వరాలను సమకూర్చగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. కాలభైరవ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


పాట విడుదల సందర్భంగా దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ.. ‘‘‘మీడియాకు, నందమూరి అభిమానులకు, ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. మా ట్రైలర్‌ను విశేషంగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన చిరంతన్ గారికి, అద్బుతమైన సాహిత్యం ఇచ్చిన శ్రీమణి గారికి, ఆలపించిన కాలభైరవకు థ్యాంక్స్. ఈ పాట మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మా బింబిసారుడి త్రిగర్తల రాజ్యం నుంచి మొదటి పాట. ఇలాంటివి ఇంకా వస్తాయి. కర్మ సిద్దాంతాన్ని ఆధారంగా ఈ పాట నేపథ్యాన్ని తీసుకున్నాం. బింబిసారుడు చేసే యుద్దం ఎలా ఉంటుందో.. ఆగస్ట్ 5న చూపించబోతున్నాం..’’ అని అన్నారు.


సంగీత దర్శకుడు చిరంతన్ భట్ మాట్లాడుతూ.. ‘‘నాకు తెలుగు అంతగా రాదు. గురుపూర్ణిమ సందర్భంగా ఈ పాటను విడుదల చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. వశిష్టకు ఇది ఫస్ట్ సినిమా. ఆయనకున్న ప్యాషన్ నాకు ప్రతీ మీటింగ్‌లో అర్థమైంది. ఈశ్వరుడే అనే ఈ పాట కర్మ చుట్టూ తిరుగుతుంది. దీన్ని కంపోజ్ చేయడం నాకు చాలెంజింగ్‌గా అనిపించింది’’ అని అన్నారు.


లిరిసిస్ట్ శ్రీమణి మాట్లాడుతూ.. ‘‘ఇంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన టీంకు ధన్యవాదాలు. ఎంతో గొప్పగా కంపోజ్ చేశారు. కాలభైరవ గారు తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరి గారు, కళ్యాణ్ రామ్ గారికి థ్యాంక్స్’’ అని అన్నారు.



Updated Date - 2022-07-14T02:19:32+05:30 IST