సూపర్ హీరో ‘అధీర’గా డివీవీ దానయ్య తనయుడు.. ఫస్ట్ స్ట్రైక్!

ABN , First Publish Date - 2022-03-24T00:27:06+05:30 IST

‘అధీర’గా టాలీవుడ్ తెరకు మరో సూపర్ హీరో పరిచయం కాబోతున్నాడు. క్రియేటివ్ దర్శకుడిగా పేరుపొందిన ప్రశాంత్ వర్మ తను చేసే సినిమాలతో హీరోలను సూపర్ హీరోలను చేస్తున్నాడు. టాలీవుడ్‌కి జాంబీ కాన్సెప్ట్ పరిచయం చేసిన తర్వాత.. ప్రశాంత్ వర్మ

సూపర్ హీరో ‘అధీర’గా డివీవీ దానయ్య తనయుడు.. ఫస్ట్ స్ట్రైక్!

‘అధీర’గా టాలీవుడ్ తెరకు మరో సూపర్ హీరో పరిచయం కాబోతున్నాడు. క్రియేటివ్ దర్శకుడిగా పేరుపొందిన ప్రశాంత్ వర్మ తను చేసే సినిమాలతో హీరోలను సూపర్ హీరోలను చేస్తున్నాడు. టాలీవుడ్‌కి జాంబీ కాన్సెప్ట్ పరిచయం చేసిన తర్వాత.. ప్రశాంత్ వర్మ పాన్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో సినిమా ‘హను-మాన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో తేజ సజ్జ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు మరో హీరోని పరిచయం చేస్తూ.. మరో సూపర్ హీరో ఫిలిం చేయబోతున్నారు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాత డివీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ‘అధీర’ అనే టైటిల్ ఖరారు చేస్తూ.. ఫస్ట్ స్టైక్ అంటూ ఓ టీజర్‌ని కూడా వదిలారు. 


‘ఆర్ఆర్ఆర్’ త్రయం రాజమౌళి, రామ్ చరణ్, తారక్‌లు ఈ ‘అధీర’ ఫస్ట్ లుక్, ఫస్ట్ స్టైక్‌ని బుధవారం విడుదల చేశారు. ఈ ఫస్ట్ స్ట్రైక్ చూస్తుంటే..  చిన్నప్పటి నుంచీ అధీరకు పవర్స్ ఉన్నాయనే ఆసక్తిని కలిగించే సన్నివేశాలతో రూపొందించారు. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గ్రాండియర్‌గా ఉన్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో ఎనర్జీ లెవెల్ పెంచేలా వీడియోలో అధీరగా కళ్యాణ్ కనిపించాడు. తన చేతిలో ఉన్న ఆయుధం వెన్నెముక ఆకారంలో ఉండి, ఇంద్రుడి శక్తివంతమైన ఆయుధం వజ్రాయుధంను పోలివుంది. ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయనేది ఈ ఫస్ట్ స్ట్రైక్‌తో క్లారిటీ ఇచ్చేశారు. హీరో ఫేస్‌ని పూర్తిగా రివీల్ చేయలేదు కానీ.. లుక్, హైట్ పరంగా మాత్రం టాలీవుడ్‌కి మరో ఎనర్జిటిక్ హీరో రాబోతున్నాడనే విధంగా ఈ స్టైక్‌తో తెలియజెప్పారు.


కాగా, శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గౌరీహరి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేస్తున్న ‘హను-మాన్’ పనులు పూర్తయిన తర్వాత ఈ ‘అధీర’కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ ప్రకటించారు. 



Updated Date - 2022-03-24T00:27:06+05:30 IST