ఎంతో ఇష్టపడి మరీ ఆర్‌ఆర్‌ఆర్‌లో డైలాగ్‌లు చెప్పాం

ABN , First Publish Date - 2021-12-11T17:55:49+05:30 IST

ఇష్టపడి మరీ ఆర్‌ఆర్‌ఆర్‌లో కన్నడ భాషలోనే డైలాగులు చెప్పడం ద్వారా కన్నడిగులకు మరింత దగ్గరయ్యామని ప్రముఖ టాలీవుడ్‌ నటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ తేజ్‌లు పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా

ఎంతో ఇష్టపడి మరీ ఆర్‌ఆర్‌ఆర్‌లో డైలాగ్‌లు చెప్పాం

                -  మీడియాతో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ 


బెంగళూరు: ఇష్టపడి మరీ ఆర్‌ఆర్‌ఆర్‌లో కన్నడ భాషలోనే డైలాగులు చెప్పడం ద్వారా కన్నడిగులకు మరింత దగ్గరయ్యామని ప్రముఖ టాలీవుడ్‌ నటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ తేజ్‌లు పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఓరియన్‌ మాల్‌లో శుక్రవారం చిత్రం యూనిట్‌ మొత్తం మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ తమకు కర్ణాటకతో, కన్నడిగులతో విడదీయరాని అను బంధం ఉందన్నారు. పవర్‌స్టార్‌ పునీత్‌ రూపంలో ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని ఆయన ఆవేదన చెందారు. పాత్రికేయుల వినతి మేరకు పునీత్‌ సినిమాలోని ఒక పాట చరణాన్ని ఆయన పాడి వినిపించారు. తన తల్లి ఉడుపి జిల్లాలోని కుందాపూర్‌కు చెందిన వారన్నారు. సినిమాలో మొత్తం డైలాగులు కన్నడ భాషలో చెప్పాల్సి రావడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నానన్నారు. తనకు నచ్చిన విధంగా సీన్‌ను పండించే విషయంలో రాజమౌళి రాజీపడరన్నారు. ఈ విషయంలో ఆయన పెట్టే టార్చర్‌ను భరించడం పెను సవాల్‌ అని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు. హీరో రామ్‌చరణ్‌ తేజ్‌ మాట్లాడుతూ కన్నడ భాషలో అనర్గళంగా డైలాగులు చెప్పేందుకు తమకు చందనసీమంలో పలువురు సహకారం అందించారన్నారు. డబ్బింగ్‌కు అవకాశం ఇవ్వకుండా ఈ చిత్రంలోని మొత్తం డైలాగులన్నీ కన్నడ భాషలో స్వయంగా తామే చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ఇద్దరు హీరోలు మీడియాకు చెప్పారు. కథ తమకు బాగా నచ్చి రాజ్‌మౌళి దర్శకత్వం వహిస్తే కన్నడ భాషలో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమని వారు వెల్లడించారు. చందనసీమలోనూ తమకు అపార సంఖ్యలో అభిమానులున్నారన్నారు. చిత్రం హీరోయిన్‌ ఆలియా భట్‌ మాట్లాడుతూ దక్షిణాది భాషలో తనకు ఇది తొలి చిత్రమని ఈ చిత్రం ద్వారా గొప్ప అనుభూతి సంపాదించుకున్నానని చెప్పారు. 

దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ... ఎమోషన్‌ పాత్రలను ప్రేక్షకులకు నచ్చేలా చూడటమే తన విజయ రహస్యమన్నారు. చిత్రకథను, పాత్రలకు అవసరమై నటుల ఎంపికలో తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో హీరో ఎవరు? అని పాత్రికేయులు ప్రశ్నించగా నేనే అని ఆయన నవ్వుతూ బదులిచ్చారు. చారిత్రాత్మక ఘట్టాలను సినిమాగా తీస్తే ప్రజలు బాగా రిసీవ్‌ చేసుకుంటున్నారని బాహుబలి తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చేయడానికి ఇదే తనను ఉత్తేజ పర్చిందని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన చారిత్రాత్రక ఘట్టాలను వెండితెరకెక్కించే ఆలోచన ఉందన్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలకు భిన్నమైన ఫ్యాన్స్‌ ఉన్నా ఇద్దరూ మంచిమిత్రులు కావడం తనకు బాగా ఉపకరించిందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ఒక యజ్ఞంలా పూర్తిచేశామని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు చిత్రం విడుదల కోసం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారన్నారు. అంతకుముందు ఈ చిత్రం ట్రైలర్‌ను మీడియాకు ప్రదర్శించారు. ఉభయ హీరోలకు చెందిన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వీరిని నియంత్రించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-12-11T17:55:49+05:30 IST