Jr Ntr: బ్రహ్మాస్త్రానికి తారక్‌ అస్త్రం!

ABN , First Publish Date - 2022-08-27T19:43:05+05:30 IST

ఎన్టీఆర్‌ ఆస్కార్‌ అవార్డ్‌కు నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని వార్త బయటకు రావడం, ఇటీవల కేంద్ర మంత్రి అమిత్‌షా ఎన్టీఆర్‌కు ఆహ్వానం పంపి కలవడంతో అందరి దృష్టి ఎన్టీఆర్‌పైనే ఉంది. దీనితో ఎక్కడ చూసిన ఎన్టీఆర్‌ గురించే టాపిక్‌. తాజాగా మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

Jr Ntr: బ్రహ్మాస్త్రానికి తారక్‌ అస్త్రం!

ఎన్టీఆర్‌ ఆస్కార్‌ అవార్డ్‌కు నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని వార్త బయటకు రావడం, ఇటీవల కేంద్ర మంత్రి అమిత్‌షా ఎన్టీఆర్‌కు ఆహ్వానం పంపి కలవడంతో అందరి దృష్టి ఎన్టీఆర్‌పైనే ఉంది. దీనితో ఎక్కడ చూసిన ఎన్టీఆర్‌ గురించే టాపిక్‌. తాజాగా మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్‌ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ అతిథిగా హాజరు కానున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్‌ కీలక పాత్రల్లో నటించారు. వచ్చే నెల 9న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే సెప్టెంబర్‌ 2న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. 


దక్షిణాదిలో దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్‌ జక్కన్నకు సన్నిహితుడు కావడం ఆయన ఆహ్వానం మేరకు ఎన్టీఆర్‌ ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకు హాజరు కానున్నారని తెలుస్తోంది. మైథలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ టైటిల్‌తో విడుదల కానుంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు. మూడు పార్టులుగా సినిమాను ప్లాన్‌ చేశారు. సెప్టెంబర్‌ 2న జరగనున్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రామోజీ ఫిల్మ్‌ సిటీ వేదిక కానుందని తెలిసింది. 




Updated Date - 2022-08-27T19:43:05+05:30 IST