Rabia Khan: నా కూతురి మరణానికి ఆ బాలీవుడ్ నటుడే కారణం

ABN , First Publish Date - 2022-08-19T02:13:14+05:30 IST

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్ద్’ (Nishabd) తో ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ జియా ఖాన్ (Jiah Khan). ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో నటించి ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ను సొంతం

Rabia Khan: నా కూతురి మరణానికి ఆ బాలీవుడ్ నటుడే కారణం

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్ద్’ (Nishabd) తో ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ జియా ఖాన్ (Jiah Khan). ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో నటించి ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. జియా ఖాన్ 2013లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె సూసైడ్‌కు బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలి (Sooraj Pancholi)నే కారణమని పోలీసులు కేసును నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు బెయిల్ మీద బయట ఉన్నాడు. కోర్టులో వాదనలు మాత్రం జరుగుతున్నాయి. 


ముంబై ప్రత్యేక కోర్టుకు తాజాగా జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ (Rabia Khan) హాజరైంది. తన వాంగూల్మాన్ని ఇచ్చింది. సూరజ్ పంచోలి తన కూతురు జియాను శారీరకంగా, మానసికంగా వేధించాడని రబియా పేర్కొంది. ‘‘జియా బాలీవుడ్‌లో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటుంది. ఆ సమయంలో సూరజ్ సోషల్ మీడియా ద్వారా జియాతో పరిచయం పెంచుకున్నాడు. ఓ సారి కలుద్దామని చెప్పాడు. అందుకు అయిష్టంగానే జియా అంగీకరించింది. 2012, సెప్టెంబర్‌లో మొదటిసారి వీరు కలుసుకున్నారు. కొన్ని ఫొటోలు తీసుకున్నారు. ఆ పిక్స్‌ను జియా నాకు పంపించింది. తామిద్దరం స్నేహితులమే అని చెప్పింది. కానీ, కొంత కాలానికే ఆమె జీవితంలో మార్పులు వచ్చాయి. 2012, అక్టోబర్ నుంచి వీరిద్దరు సహజీవనం చేయడం మొదలుపెట్టారు. నేను జియాను కలుసుకోవడానికీ నవంబర్‌లో లండన్‌కు వచ్చాను. అప్పుడు ఆమె సంతోషంగానే కనిపించింది. తర్వాత కొన్ని పనుల నిమిత్తం ముంబై వెళ్లింది. క్రిస్‌మస్ సంబరాలను జరుపుకొనేందుకు జియా తిరిగి లండన్‌కు రావాలి. కానీ, ఆమె మాత్రం తిరిగి రాలేదు. డిసెంబర్ 24న సూరజ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. జియా మీద కోప్పడ్డానని, తనను క్షమించి మరోక ఛాన్స్ ఇవ్వాలని నాకు సందేశం పంపించాడు. అప్పుడే వారిద్దరు గొడవపడ్డారని నాకు అర్థమైంది. జియా అతడిని క్షమించి రెండో ఛాన్స్ ఇచ్చింది. ఇద్దరు కలసి గోవాకు వెళ్లారు. అప్పుడు ఒక్కసారి నాతో మాట్లాడింది. ఓ కొత్త ప్రదేశానికి తీసుకెళ్లాడని తెలిపింది. అకస్మాత్తుగా ఫిబ్రవరిలో ఆమె లండన్‌కు వచ్చింది. గోవాలో ఇతర అమ్మాయిల ముందు తనను అవమానించడని, మానసికంగా, శారీరకంగా వేధించడాని చెప్పింది. అభ్యంతరకర పదాలతో పేరు పెట్టి పిలిచేవాడని పేర్కొంది’’ అని రబియా ఖాన్ వివరించింది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ముంబైలోని తన నివాసంలో జూన్ 3, 2013న జియా ఖాన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సల్మాన్ ఖాన్ నిర్మించిన హీరో సినిమాతో సూరజ్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. 

Updated Date - 2022-08-19T02:13:14+05:30 IST