Jayapradha: నటనకే నటన నేర్పిన మహానటుడు NTR

ABN , First Publish Date - 2022-05-28T23:45:03+05:30 IST

‘‘నటనకే నటన నేర్పిన మహానాయకుడు, మహానటుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao)’’ అన్నారు సీనియర్ నటి జయప్రద (Jayaprada). ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో

Jayapradha: నటనకే నటన నేర్పిన మహానటుడు NTR

‘‘నటనకే నటన నేర్పిన మహానాయకుడు, మహానటుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao)’’ అన్నారు సీనియర్ నటి జయప్రద (Jayaprada). ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా ముచ్చటించారు. తెలుగు జాతి  కీర్తి కిరీటమైన ఎన్టీఆర్‌ (NTR)తో తనకున్న అనుబంధాన్ని, తనతో చేసిన సినిమా ముచ్చట్లనే కాకుండా.. ఆయనతో కలిసి వేసిన రాజకీయ అడుగుల గురించి కూడా జయప్రద ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ..


‘‘నేను చాలా అదృష్టవంతురాలినని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే, ఎన్టీఆర్‌గారిని మూడు తరాలుగా మూడు స్టేటస్‌లలో చూశాను. నా చిన్నప్పుడు నేను ఆయనకి వీరాభిమానిని. పెద్దయిన తర్వాత.. ఆయన పక్కన నటించడంతో నాకు స్టార్ స్టేటస్ వచ్చింది. మాది మంచి జంట అనే స్థాయికి మేమిద్దరం కలిసి నటించాం. అలాగే, ఆయన పార్టీ పెట్టిన తర్వాత.. తెలియకుండానే నేను ఆయన నాయకత్వంలో పనిచేశాను. ఈ మూడు స్టేజ్‌లలో ఆయనని నేను చాలా దగ్గరగా చూశాను. ఇది నిజంగా నా అదృష్టమని భావిస్తున్నాను. చాలా గొప్ప వ్యక్తి. ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా.. అందులో నేను కూడా భాగమై.. ఆ మహానుభావుడి గురించి కొన్ని అమృతమైన మాటలు చెప్పే అవకాశం రావడమనేది నిజంగా నా అదృష్టం.


ఎన్టీఆర్‌గారి గురించి చెప్పాలంటే.. నటనకే నటన నేర్పిన మహానాయకుడు, మహానటుడు. అలాగే రాజకీయాలలో కూడా రాజసంతో ఒక గొప్ప నాయకుడిగా ఆయన నిలబడ్డారు. ప్రజలే జీవితం.. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం కలిగిన కారణజన్ముడు ఎన్టీఆర్. ఆయన గురించి మాట్లాడడానికి గంటలు సరిపోవు. ఎంత మాట్లాడినా.. అది తక్కువే అవుతుంది. 


నా చిన్నప్పుడు ఎన్టీఆర్‌గారు మేకప్ వేసుకుంటుంటే అలా చూస్తూ ఉండిపోయేదాన్ని. మా అన్నయ్య ఫైనాన్షియర్‌గా ఉండేవారు. ఆయన వెంట షూటింగ్‌లకు వెళ్లేదానిని. అప్పట్లో ఎన్టీఆర్‌గారి సినిమాలలోని పాటలన్నీ పాడేవాళ్లం. అది ఎప్పటికీ మరిచిపోలేను. ఆ తర్వాత ‘దేవుడే దిగివస్తే’ (devude digivaste) చిత్రానికి నా మొట్టమొదటి 100రోజుల షీల్డ్ ఆయన చేతుల మీదుగా తీసుకున్నాను. అది దాసరి (Dasari)గారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. ఆ రోజు అవార్డు ఇస్తూ.. తప్పకుండా నువ్వు పెద్ద హీరోయిన్‌వి అవుతావు. కేవలం ఇక్కడే కాదు, బాలీవుడ్ కూడా నీ కోసం ఎదురుచూసేంత గొప్ప నటివి అవుతావని ఆశీర్వదించారు. అలాంటి ఎన్టీఆర్‌తో నాకు ‘అడవిరాముడు’ (Adavi Ramudu) చిత్రంలో చేసే అవకాశం వచ్చింది. అప్పుడు నా కల నిజమైందని.. ఎంతో సంబరపడిపోయాను..’’ అంటూ జయప్రద చెప్పుకొచ్చారు. ఇంకా ఆ తారకరాముని గురించి జయప్రద ఏం చెప్పారో పై వీడియోలో చూడవచ్చు.

Updated Date - 2022-05-28T23:45:03+05:30 IST