Jaya sudha: ఎందుకీ వివక్ష.. అందరం మనుషలమే కదా!

ABN , First Publish Date - 2022-08-01T03:04:21+05:30 IST

‘‘హీరోయిన్ల పట్ల వివక్ష అనేది అప్పుడూ ఉంది... ఇప్పుడూ ఉంది. హీరోకు వంద కోట్లు ఇస్తుంటే... కనీసం పది కోట్లు తీసుకొనే హీరోయిన్‌లు తెలుగులో ఎక్కడున్నారు? మూడో నాలుగో కోట్లిస్తే గొప్ప. హీరోలకు ఫాలోయింగ్‌ ఉంటుంది. కాదనను. కానీ హీరోయిన్లు, మిగిలిన నటులు లేకపోతే సినిమా లేదు కదా. ఒక సినిమా సక్సెస్‌ అయింది అంటే అది టీమ్‌వర్క్‌తోనే సాధ్యమని నేను నమ్ముతాను’’ అని అన్నారు జయసుధ.

Jaya sudha: ఎందుకీ వివక్ష.. అందరం మనుషలమే కదా!

‘‘హీరోయిన్ల పట్ల వివక్ష అనేది అప్పుడూ ఉంది... ఇప్పుడూ ఉంది. హీరోకు వంద కోట్లు ఇస్తుంటే... కనీసం పది కోట్లు తీసుకొనే హీరోయిన్‌లు తెలుగులో ఎక్కడున్నారు? మూడో నాలుగో కోట్లిస్తే గొప్ప. హీరోలకు ఫాలోయింగ్‌ ఉంటుంది. కాదనను. కానీ హీరోయిన్లు, మిగిలిన నటులు లేకపోతే సినిమా లేదు కదా. ఒక సినిమా సక్సెస్‌ అయింది అంటే అది టీమ్‌వర్క్‌తోనే సాధ్యమని నేను నమ్ముతాను’’ అని అన్నారు జయసుధ (Jaya sudha). సినిమా పరిశ్రమలో వివక్ష గురించి, సీనియర్‌ ఆర్టిస్ట్‌లకు ఏమాత్రం గౌరవం ఉందనే విషయాలపై ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో.. ఆమె మాట్లాడారు. (Jaya sudha open heart with RK)


నేను అదృష్టవంతురాలిని. అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. విజయనిర్మల గారు నాకు మేనత్త అవుతారు. నన్ను చిన్నప్పుడు షూటింగ్‌లకు తీసుకువెళ్లేవారు. సెట్‌లో పాట పెట్టి సరదాగా డ్యాన్స్‌ చేయమంటే చేసేసేదాన్ని. తరువాత ‘పండంటి కాపురం’తో నన్ను నటిని చేశారు. మొదట్లో మా నాన్న అస్సలు ఒప్పుకోలేదు. మా అమ్మమ్మ నచ్చజెప్పి ఒప్పించారు. ఆనాటి నుంచి అవకాశాల కోసం తిరిగింది లేదు. అవే వెతుక్కొంటూ వచ్చాయి. దానికితోడు నేను ఆరంభంలో ఎక్కువ సినిమాలు బాలచందర్‌ గారివే చేశాను. అది పెద్ద యూనివర్సిటీ కదా! చాలా స్ర్టిక్ట్‌గా ఉండేవారు... మా నాన్న లాగా! ఆ జర్నీ సాఫీగానే సాగిపోయింది. ఆ తరువాత ప్రయాణంలో వివక్ష కనిపించింది. అంటే పెద్ద హీరోలను ఒకలాగా చూడడం... హీరో కంటే హీరోయిన్లను తక్కువగా ట్రీట్‌ చేయడం లాంటివి! ఇదంతా నాకు పదిహేడు పద్ధెనిమిదేళ్లప్పుడు. దాంతో ‘నేను సినిమాలు మానేస్తా’ అన్నాను. ‘మరి ఏంచేస్తావ్‌’ అన్నారు నాన్న. నేను పెద్దగా చదువుకోలేదు. క్రికెట్‌ అంటే పిచ్చి. ‘క్రికెటర్‌ అవుదామనుకుంటున్నా’ అన్నాను. అప్పుడే ఉమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ తయారవుతోంది. ‘ఈ ఉమెన్స్‌ క్రికెట్‌ సక్సెస్‌ అవుతుందో లేదో తెలియదు. నాకైతే అటు వెళ్లడం ఇష్టం లేదు. కానీ ఏది కావాలన్నది నువ్వే నిర్ణయించుకో’ అన్నారు నాన్న. దాంతో సినీ రంగంలోనే కొనసాగాను. అయితే నాకంటూ కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నా. దాంట్లో నుంచి ఎప్పుడూ బయటకు రాలేదు. అందుకు మా నాన్నకు ధన్యవాదాలు చెప్పాలి. సెట్‌లో ఎవరితో మాట్లాడకుండా ఉండడం కోసం ఆయన నాకో పుస్తకం ఇచ్చేవారు. లేదంటే ఎవరో ఒకళ్లు వచ్చి పక్కన చేరతారని! జయలలిత గారితో ఒక సినిమా చేశాను. ఆమె కూడా అంతే... ఎప్పుడూ సెట్‌లో పుస్తకం చదువుతుంటారు. 



వయసులో పెద్దవాళ్లని పట్టించుకోండి..

సీనియర్‌ నటిగా సెట్‌లో దక్కాల్సిన గౌరవం దక్కుతోందా అంటే లేదనే చెబుతాను. నేను కోరుకొనేదేమిటంటే అనుభవంతో పాటు వయసుకు కూడా గౌరవం ఇవ్వాలి. అప్పటి కంటే ఇప్పుడు మరింత బాగా చూసుకోవాలి. నా విషయంలో నేను కచ్చితంగా ఉంటాను. నాకు ప్రత్యేకంగా వ్యానిటీ వ్యాన్‌ అడుగుతాను. ఎందుకంటే హీరో సెట్‌లోకి వచ్చేవరకు అందరూ వేచివుండాలి. ఆ హీరోకు డెబ్భై ఏళ్లవనీ.. పదిహేడేళ్లవనీ! హీరోకు ఇచ్చే గౌరవం ఇవ్వండి. కానీ వయసులో పెద్దవాళ్లని పట్టించుకోండి. చాలాచోట్ల ఏమవుతుందంటే... హీరో కంటే కనీసం 45 నిమిషాలు ముందు మిగిలిన ఆర్టిస్టులను పిలుస్తారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌లకైతే కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండవు. అలా నిలబడే ఉండాలి. ఒకసారి సెట్‌లో నేరుగా హీరోని పిలిచి చెప్పాను... ‘ఆర్టిస్టులను ఇలా ఇంత ముందుగా పిలిచి కూర్చోబెట్టడం సరైంది కాదు. ఎందుకు ఇంత వివక్ష? అందరం మనుషలమే కదా’ అన్నాను. ‘లేదు ఆంటీ... నాకు అస్సలు తెలియదు’ అన్నాడు అతను. ఆ తరువాత రోజు ప్రొడక్షన్‌ వాళ్లకి గట్టిగా చెప్పాడు... ‘అనవసరంగా తీసుకువచ్చి ఇలా కూర్చోబెట్టకండి’ అని. నిజానికి ఇవన్నీ హీరోలకు తెలియవు. ఒక విధంగా చూస్తే మన తెలుగు ఇండస్ర్టీ చాలా మెరుగు. నేనైతే ఆరు తరువాత పని చేయను. నాకంటూ ఒక కుటుంబం ఉంటుంది కదా! నాకు కావల్సినవి నేనే వెళ్లి కొనుక్కోవాలి. పిల్లలు పుట్టాక అవుట్‌డోర్‌ షూటింగ్స్‌ మానేశాను. (Jayasudha about Heros)

వాళ్ల కుక్క పిల్లకి  కూడా రూమ్‌ ఇస్తారు...

నా దృష్టిలో అందరూ కలిస్తేనే ఒక సినిమా పూర్తవుతుంది. ఒక కమెడియన్‌ కేరెక్టర్‌ కూడా విజయానికి కారణం కావచ్చు. అలా కొన్ని సినిమాల సక్సెస్‌కు బ్రహ్మానందమే ప్రధాన కారకుడయ్యారు. అందుకే ఎవర్నీ ఎవరూ తక్కువ అంచనా వేయడానికి లేదు. నేను హీరోయిన్‌గా పీక్‌లో ఉన్నప్పుడు కూడా.. ముంబయి నుంచి వస్తే... వాళ్లకు ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ ఇచ్చేవారు. మాకు త్రీ స్టార్‌ హోటల్‌ ఏర్పాటు చేసేవారు. ఒకసారి నేను, రేఖగారు తాజ్‌ బంజారాలో ఉన్నాం. దాంట్లో నాకు ఒక రూమ్‌ ఇచ్చారు. అయితే మా లగేజీ అందులో సరిపోలేదు. నాకు సూట్‌ రూమ్‌ కావాలని అడిగితే... ‘అదైతే ఎక్కువైపోతుందమ్మా’ అన్నారు. మనవాళ్లే రేఖ గారితో హిందీ సినిమా తీస్తున్నారు. ఇంతలో నా పక్కన రూమ్‌లో నుంచి వాళ్ల మేకప్‌మ్యాన్‌ వస్తున్నాడు. ఆయనతోపాటు రేఖ గారి కుక్కపిల్ల ఉంది. ఆయన్ని అడిగితే... ‘నాతో పాటు కుక్కపిల్లను చూసుకోవడానికి ఇంకొకరికి కలిపి ఈ రూమ్‌ ఇచ్చారు’ అన్నారాయన. ఇదికాక ఆమె హెయిర్‌ డ్రెస్సర్‌కు ఒక రూమ్‌ కేటాయించారు. అదే ప్రొడక్షన్‌కు నేను తెలుగు సినిమా చేస్తున్నాను. వెళ్లి వాళ్లని అడిగాను... ‘మీరు ముంబయి నుంచి వస్తే ఒకలా చూస్తున్నారు. కుక్కపిల్లకు కూడా రూమ్‌ ఇస్తున్నారు. నేను కూడా మీ సినిమాలో హీరోయిన్‌ని. సూట్‌కేస్‌లు పెట్టుకోవడానికి నాకు చోటు సరిపోక సూట్‌రూమ్‌ ఇవ్వమని అడిగితే కుదరదన్నారు’ అన్నాను. దానికి వాళ్ల దగ్గర జవాబు లేదు. అడగాల్సిన చోట అలా కచ్చితంగా అడిగేస్తాను. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కానీ ఎప్పుడూ డిమాండ్‌ చేయలేదు. అలాగే... పక్కన హీరోకు డ్యాన్స్‌ రాకపోతే... ఆయన తప్పు చేసినా మమ్మల్ని వచ్చి అడుగుతారు... ‘ఏంటి కరెక్ట్‌గా చేయలేదు మూమెంట్‌’ అని! ‘మాస్టర్‌... నేను కరెక్ట్‌గా చేశా కదా’ అంటే... ‘ఏమనుకోవద్దమ్మా... ఆయన టేక్‌ వన్‌... టు... అని తినేస్తున్నారు’ అనేవారు. అంటే ఆయన్ని అనలేక నన్ను అనేవారు. దానికి నేను ఒప్పుకొనేదాన్ని కాదు. వెళ్లి హీరోకు ఎందుకు చెప్పరనేదాన్ని. చెబితే హీరోలు కూడా వింటారు. కానీ వీళ్లే... వాళ్లని ఒక డెమీగాడ్‌లా చిత్రీకరిస్తారు. నా ఇన్నేళ్ల కెరీర్‌లో నన్ను డామినేట్‌ చేసిన హీరో ఒకరు కూడా లేరు. రజనీ, కమల్‌, నేను అంతా ఒకటే స్కూల్‌ నుంచి వచ్చాము కనుక ఆ ఇబ్బంది లేదు. ఇక రామారావు గారు, నాగేశ్వరరావు గారుఎప్పుడూ హీరోయిన్లను తక్కువగా చూసింది లేదు. అయితే క్రమశిక్షణ విషయంలో కచ్చితంగా ఉండేవారు. 

Updated Date - 2022-08-01T03:04:21+05:30 IST