Jaya Prakash Reddy: ‘ఆల్‌ హ్యాపీస్‌, నో వర్రీస్‌’ ఇదే నినాదం!

ABN , First Publish Date - 2022-09-08T20:27:54+05:30 IST

‘‘ఆకాశం వైపు చూసి నాకు అది లేదు, ఇది లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. నేల మీదకు చూడరా. ఒక్క పూట తినడానికి లేనివారు దేశంలో కొన్ని వేలమంది ఉన్నారు. వాళ్లతో పోల్చితే.. నువ్వు బావున్నావ్‌! మూడు పూటలు తింటున్నావు. మనిషికి ఆత్మ సంతృప్తి చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడు ఎవడూ ఏమీ పీకలేడు. సంతృప్తిగా ఉండటం నేర్చుకో’’

Jaya Prakash Reddy: ‘ఆల్‌ హ్యాపీస్‌, నో వర్రీస్‌’ ఇదే నినాదం!

‘‘ఆకాశం వైపు చూసి నాకు అది లేదు, ఇది లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు. 

నేల మీదకు చూడరా. ఒక్క పూట తినడానికి లేనివారు దేశంలో కొన్ని వేలమంది ఉన్నారు. 

వాళ్లతో పోల్చితే.. నువ్వు బావున్నావ్‌! మూడు పూటలు తింటున్నావు. 

మనిషికి ఆత్మ సంతృప్తి చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడు ఎవడూ ఏమీ పీకలేడు. సంతృప్తిగా ఉండటం నేర్చుకో’’

ఇవన్నీ దివంగత నటుడు జయప్రకాశ్‌రెడ్డికి  తన తండ్రి చెప్పిన మాటలు. ఆ మాటల స్ఫూర్తితోనే జీవితాన్ని ఆత్మ సంతృపితో సాగించారు. వైవిధ్యమైన పాత్రలతో నవ్వించి.. ప్రతినాయకుడిగా భయపెట్టిన ఆయన వెండితెరపై తనదైన ముద్రవేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన ఆయనకు సెంటిమెంట్‌, సింపథీ క్యారెక్టర్లు అంటే చాలా ఇష్టం. ఆ తరహా పాత్రలు చేయలేదన్న లోటు ఆయనకు తీరలేదు. సెప్టెంబర్‌ 8 2020న జేపీ గుండెపోటుతో మరణించారు. 


‘శివుడు.. మీ నాయన నాకు ఎదురొచ్చినాడు.. చంపేసినా.. రైటా.. రాంగా’ ప్రేమించుకుందాం రా’లో వీరభద్రయ్య రౌద్రంగా చెప్పిన సంభాషణ...


‘సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా సూసుకుందాము నీ పెతాపమూ నా పెతాపమూ పోరాతాయ్‌’ ‘సమరసింహారెడ్డి’లో వీరరాఘవరెడ్డి ఘింకరిస్తూ..


‘యాందిరయ్యా యాం చేత్తన్నావ్‌..  పట్టపగలు, మిట్ట మధ్యాహ్నాం..  దున్నపోతు పాలు పితుకుతున్నావా? హెడ్‌ కానిస్టేబుల్‌గా...


‘ఏమిరా పులి.. పంతుల్ని పిండిలేపిస్తున్నావ్‌.. చిన్నబ్బి యాడెడా చెబితే.. ఆడాడ ఇరిసిపారేయండి’ ‘రెడీ’లో చిట్టినాయుడిగా...


‘నిన్ను మాకు, మా పిల్లకి తగిలించిన మీ జిలేబీ మావకి మంచి ఫడ్‌ పార్టీ ఇచ్చి పంపుతా... ‘నాయక్‌’లో బాబ్జీ పెదనాన్నగా... 


‘పొడుగ్గా మాంచి కూజా లెక్కున్నావ్‌.. కొడితే చెంబైపోతావ్‌’ సరిలేరు నీకెవ్వరూ’లో డైలాగ్‌...

ఇవన్నీ వేర్వేరు పాత్రలు, సంభాషణలు కావచ్చు. పోషించిన వ్యక్తి, పలికిన గొంతు ఒకరిదే! ఆ గొంతు ముగబోయి రెండేళ్లు పూర్తయింది. గురువారం జేపీ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం. 



చిన్ననాటి నుంచే జయప్రకాశ్‌కు సినిమాలంటే విపరీతమైన అభిమానం. ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఓ సినిమా చూసొచ్చి పలక మీద ఆయన పేరు పక్కన ‘అంజలీదేవి, సావిత్రి’ పేర్లు రాసుకునేవారట. ఓసారి ఆయన తండ్రి ఆ విషయం పసిగట్టి నానా చివాట్లు పెట్టారు. ఒరేయ్‌ నీ వయసేంటి? వాళ్ల వయసేంటి? పిచ్చిపిచ్చి వేషాలేయకు’ అని గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి జె.పి అలాంటి పనులు మానేశారు. ఇలాంటిదే మరో సంఘటన కూడా ఉంది. ఆర్‌.నాగేశ్వరరావు చనిపోయినప్పుడు సొంత మనిషిని పోగొట్టుకున్నట్లు మూడు రోజులు అన్నం తినకుండా ఏడ్చుస్తూ కూర్చున్నారు. ఆయన నటన, నడక అంటే జేపీకి అంతిష్టం. 



గుర్తింపు తెచ్చిన పాత్రలు..

ప్రేమించుకుందాం రా– వీరభద్రయ్య

సమరసింహారెడి ్డ– వీరరాఘవరెడ్డి

చెన్నకేశవరెడ్డి – వెంకటరెడ్డి

అవును వాళిద్దరూ ఇష్టపడ్డారు – కానిస్టేబుల్‌

కబడ్డీ కబడ్డీ – హెడ్‌ కానిస్టేబుల్‌

నువ్వొస్తానంటే నేనొద్దంటానా – జేపీ

విక్రమార్కుడు – హోం మినిస్టర్‌

ఢీ – పెదనాయన

కృష్ణ – జక్కా అంకుల్‌

రెఢీ – చిట్టినాయుడు

కిక్‌ – పోలీస్‌ ఆఫీసర్‌

నాయక్‌ – బాబ్జీ పెదనాన్న

టెంపర్‌ – హోం మినిస్టర్‌ 

సరైనోడు–భూపతి

ఖైదీ నం 150 –కమిషనర్‌ కృష్ణమూర్తి. 






ఆడ పిల్ల వేషంతో... అవార్డు..

గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్‌ కాలేజీలో చదవడం తన అదృష్టమని జెపీ తరచూ చెబుతుండేవారు. అక్కడ చదువు బాగా అబ్బడం ఒక కారణమైతే.. ఆ కాలేజీ వల్లే ఆయనకు నాటకాలు వేసే అవకాశం రావడం రెండో కారణం. ఆ నాటకంలో జయప్రకాశ్‌రెడ్డి ఆడపిల్ల వేషం వేశారు. ఉత్తమనటి అవార్డు కూడా అందుకున్నారు.  డిగ్రీలో చేరాక నాటకాల మీద మరింత ఆసక్తి పెరిగింది. తన లెక్చరర్స్‌ చక్కని ప్రోత్సాహం అందించడంతో అటు చదువు, ఇటు నాటకాలకు న్యాయం చేస్తూ బీఈడీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తి వైపు వెళ్లారు.  ఆరోజుల్లో జెపీకి ‘బాటసారి’ అనే నిక్‌నేమ్‌ ఉండేది. 


భలే ఫిట్టింగ్‌ పెట్టావయ్యా...

జెపీ దగ్గర చదువుకున్న ఓ విద్యార్థి ప్రారంభించిన ‘ప్రజాపోరు’ పత్రిక ఏడాది పూర్తి చేసుకోవడంతో ఏర్పాటు చేసిన ఫంక్షన్‌కు పలు మంత్రులతోపాటు దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ జయప్రకాశ్‌ రెడ్డి ఓ నాటకం వేశారు. ‘ఇక్కడి వాళ్లంతా మా నాటకాలు చూసినవారే. దాసరిగారి కోసమే ఈ నాటకం ఆడుతున్నాం’ అని ముందరకాళ్ల బంధం వేశారు జెపీ. దాంతో దాసరి జెపీని పక్కకు పిలిచి ‘ఇక్కడి నుంచి కదలకుండా భలే ఫిట్టింగ్‌ పెట్టావయ్యా. పదిహేను నిమిషాలు చూసి జారుకుంటాను’’ అని దాసరి చెప్పిన దాసరి నాటకం పూర్తయ్యే వరకూ ఉండి వేదికపై జేపీని సత్కరించారు. ‘ఈ రత్నం ఉండాల్సింది ఇక్కడ కాదు సినీ పరిశ్రమలో! జేపీకి నటుడిగా అవకాశం ఇస్తా’’ అని దాసరి ఆ వేదిక సాక్షిగా హామీ ఇచ్చారు. సినిమా వాళ్ల మాటలు ఇలాగే ఉంటాయిలే అనుకుని తన పనిలో తాను నిమగ్నమయ్యారు. కరెక్ట్‌గా వారం రోజుల్లో దాసరిగారి నుంచి ఫోన్‌ వచ్చింది. దాసరి సిఫారసు చేయగా ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాలో రామానాయుడు జేపీకి తొలి అవకాశం ఇచ్చారు. 


స్కూల్‌ మాస్టర్‌గా..

ఆ తర్వాత చిన్నచితకా సినిమా అవకాశాలు వచ్చినా రామానాయుడు మినహా మిగిలిన సంస్థలు డబ్బు సరిగా ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యారు జేపీ. ఐదేళ్లు ఎదురుచూసినా సరైన అవకాశం దక్కలేదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి 1991లో స్కూల్‌ మాస్టర్‌గా చేరారు. ఆ తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చిన అటువైపు వెళ్లలేదు. 




నానాపాటేకర్‌కు బదులుగా..

జయప్రకాశ్‌ స్నేహితుడు ఒకాయన చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్తూ తనని తోడుగా తీసుకెళ్లిన సమయంలో వెనక నుంచి ‘ఏయ్‌ జయప్రకాశ్‌..’ అని పెద్ద అరుపు. వెనక్కి తిరిగి చూస్తే రామానాయుడు. ‘‘ఏవయ్యా.. ఏమైపోయావ్‌.. మంచి ఆర్టి్‌స్టవి ఎందుకెళ్లిపోయావ్‌’’ అని ప్రశ్నించగా తనకష్టాలు చెప్పుకొచ్చారు జేపీ. సరేనని వెళ్లి సురేశ్‌బాబును కలువు. మంచి పాత్ర ఉంది... నువ్వు చేస్తే బావుంటుందని చెప్పడంతో పెద్దాయన మాట కాదనలేక సురేశ్‌బాబుని కలిశారు. అలా ‘ప్రేమించుకుందాం..రా’లో విలన్‌ పాత్ర దక్కింది. అప్పట్లో ఆ పాత్రకు నానాపాటేకర్‌ కోటిన్నర డిమాండ్‌ చేశారట. ఆ చిత్రంలో విలన్‌ పాత్రకు రాయలసీమ మాండలికం పెడితే బావుంటుందన్న ఐడియా జేపీదే. పరుచూరి సోదరులు అందుకు అంగీకరించారు. అనంతపురం వెళ్లి ఆ యాస నేర్చుకొచ్చారు జయప్రకాశ్‌. ‘ప్రేమించుకుందాం..రా’లో ఆయన పోషించిన వీరభద్రయ్య పాత్రకు ఎంతగా గుర్తింపు వచ్చిందో తెలిసిందే! ఆ తర్వాత ‘శ్రీరాములయ్య’, ‘సమరసింహారెడ్డి’ సినిమాలతో ఆయన కెరీర్‌ ఊహించని మలుపు తిరిగింది. అక్కడి నుంచి ఆయన క్షణం తీరిక లేకుండా గడిపారు. దర్శకుడికి కావలసిన అవుట్‌పుట్‌ ఇవ్వడం ఆయనకు మొదటి నుంచీ అలవాటు. 150 చిత్రాల దర్శకుడు దాసరి అయినా, తొలి సినిమా దర్శకుడైనా  జేపీ పని ఒకేలా ఉంటుంది. కొన్ని పాత్రలకు ఆయన డేట్స్‌ కోసం ఎదురు చూసిన దర్శకులూ ఉన్నారు. ‘మహాత్మ’లో దాదా పాత్రకోసం కృష్ణవంశీ మూడు నెలలు ఎదురు చూశారు. ‘వి.వి.వినాయక్‌, శ్రీనువైట్ల, కందిరీగ శ్రీను, సురేందర్‌ రెడ్డి వంటి దర్శకులు మంచి పాత్రలు రాశారు కాబట్టే ఇంకా నటుడిగా కొనసాగుతున్నాను. లేదంటే ఎపుడో రిటైర్‌ అయ్యుండేవాడిని’ అని జయప్రకాశ్‌రెడ్డి చాలా వేదికలపై చెప్పారు. 


నిర్లక్ష్యం చేయలేదు...

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా... ఆయన ఫ్యామిలీని మాత్రం నిర్లక్ష్యం చేసేవారు కాదు. నటుడిగా తన పని తాను చేసుకుంటూనే ఇంటి పెద్దగా కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహించేవారు. సినిమా పరిశ్రమకు అలవాటు పడ్డాక అక్కడి నుంచి వెనకడుగు వేయడం అంత సులభంగా జరిగే పని కాదు. కెరీర్‌ బిగినింగ్‌లో పిల్లల చదువుకోసం జయప్రకాశ్‌ ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన పిల్లలకు సినిమాలపై అంతగా ఆసక్తి లేదు. ఆయన తమ్ముళ్లు, పిల్లలు అంతా బాగా సెటిల్‌ అయ్యారు. అమెరికాలో తొమ్మిదేళ్లు ఉన్న ఆయన కుమారుడు జేపీ కోరిక మేరకు అమెరికా నుంచి తిరిగొచ్చి గుంటూరులో వ్యాపారం పెట్టుకున్నారు. ప్రతి శనివారం గుంటూరు వెళ్లి పిల్లలతో కాసేపు గడిపి వచ్చేవారు జేపీ. 




నాన్న ఇచ్చిన స్ఫూర్తి...

పచ్చడి మెతుకులైనా, కోడి కూర అయినా ఒకేలా ఆలోచించడం జయప్రకాశ్‌కి అలవాటు. అది తన తండ్రి నేర్పించిన గుణం. ఆయన నేర్పించిన నీతి, నిజాయితీలే ఈ స్థాయిలో ఉండటానికి కారణమని ఆయన అంటారు. ‘ఆల్‌ హ్యాపీస్‌, నో వర్రీస్‌’ అని తన తండ్రి చెప్పిన నినాదంతోనే జేపీ తన జీవితాన్ని సాగించారు. పరిస్థితి బాగోకపోయినా, సినిమాల నుంచి రిటైర్‌ అయినా ఎలాంటి దిగులు లేదని చెబుతుండేవారు. చివరి రోజుల్లో గడపడానికి శ్రీశైలంలో తన తండ్రి పేర కట్టించిన సత్రాలు, 25 వేల పెన్షన్‌తో స్వామి సన్నిధిలో నేను, నా భార్య ఆనందంగా బతకగలనని ఆయన అంటుండేవారు. జేపీని ఒరేయ్‌ అని పిలిచే ఏకైక సినీ స్నేహితుడు ఎమ్మెస్‌ నారాయణ. కష్టాల్లో ఒకరికొకరు సహకరించుకునేవారు. 


రాజకీయాలకు ‘నో’...

ఉన్న మాట చెప్పడం తప్పితే.. ఎదురుగా ఓ మాట, వెనక ఓ మాట చెప్పడం ఆయనకు చెప్పడం చేతకాదు. అలా ఉన్నవాడే రాజకీయాల్లో రాణిస్తాడని జేపీ నమ్మకం. అందుకే రాజకీయాలకు తను సూట్‌ అవ్వనని అనేవారు. ఆయనకు జీవితాన్నిచ్చిన రామానాయుడు కోసం ఓట్లు వేయమని జనాల్లో తిరిగారు. 




ఆ కోణం బయటకు రాలేదు..

హాస్యనటుడిగా నవ్వించగలరు! విలన్‌గా సీరియస్‌ క్యారెక్టర్లు చేయగలరు! కానీ ఆయనలో మరో కోణం కూడా ఉంది. దానిని దర్శకుడు వాడుకోలేదని, అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా అని జేపీ చెబుతుండేవారు. సెంటిమెంట్‌, సింపథీ క్యారెక్టర్లు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ తరహా పాత్రలు చేయలేదన్న లోటు ఆయనకు తీరలేదు. అవకాశం వచ్చిందనే గర్వం, ఏదైనా చేసేయగలమనే అహంభావం, అంకితభావం లేకపోవడం నేటితరం ఆర్టిస్ట్‌ల్లో ఎక్కువని ఆ పద్దతి మార్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని జేపీ నేటితరానికి సూచించేవారు. 


రూ.25 పెట్టే నాధులే లేరు..

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. నాటకాలపై అశ్రద్ధ చూపలేదు. ఖాళీ దొరికిన ప్రతిసారి రిహార్సెల్‌ చేసి నాటకాలు ఆడేవారు జయప్రకాశ్‌. రూ.25 వెచ్చించి నాటకాలు చూసే నాఽథుడు లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేసేవారు. నాటకాలకు టికెట్‌ పెట్టాలని దానిమీద ఎంతోకొంత కళాకారులకు అందాలని ఆయన తపన పడేవారు. నాటకాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌ అని అంటుండేవారు. అయితే మన దగ్గర నాటకాలను ఉచితంగా చూడటానికి అలవాటు పడ్డారని ఆయన విమర్శించారు. జేపీ మరణించడానికి కొద్ది రోజుల ముందూ కూడా రవీంద్ర భారతిలో ఓ నాటకంలో నటించారు. 

Updated Date - 2022-09-08T20:27:54+05:30 IST