క్షమాపణలు కోరుతూ జై భీమ్ దర్శకుడి ప్రకటన విడుదల

ABN , First Publish Date - 2021-11-22T02:26:32+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం జై భీమ్. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 2న విడుదలయిన ఈ చిత్రం అభిమానుల

క్షమాపణలు కోరుతూ జై భీమ్ దర్శకుడి ప్రకటన విడుదల

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం జై భీమ్. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 2న విడుదలయిన ఈ చిత్రం అభిమానుల మన్ననలు పొందడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఈ సినిమాకు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. సూర్య, జ్యోతిక కలిసి ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ సినిమా పలు వివాదాల్లో ఇరుక్కుంది. చిత్రంలోని ఒక సీన్‌ మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉండటంతో ఆ సన్నివేశంపై ప్రేక్షకులల్లో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. 


వన్నియార్ కమ్యూనిటీని హీరో సూర్య కించపరిచాడని పీఎంకే నేతలు ఆరోపించారు.  వన్నియార్ సంఘం రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. సూర్య, జ్యోతిక, టీజే. జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోకు  ఆ సంఘం లీగల్ నోటీసులు పంపిచింది. దీంతో ఆ సినిమాకు దర్శకత్వం వహించిన టీజే.జ్ఞానవేల్  క్షమాపణలు చెప్పారు.

 

‘‘ మేం సినిమా విడుదలకు ముందు ఆ సీన్‌ను గుర్తిస్తే తప్పక తొలగించేవాళ్లం. నవంబర్ 2న చిత్రం విడుదలయిన అనంతరం అనేక మంది ఆ సీన్‌ను గుర్తించారు. ఆ సీన్‌పై వివాదం చెలరేగక ముందే దానిని తొలగించాలని ప్రయత్నించాం. దర్శకుడిగా ఆ సీన్‌కు నేను బాధ్యత వహిస్తున్నాను. సూర్యను ఈ వివాదంలోకి లాగడం దురదృష్టకరం. నటుడు, నిర్మాతగా సూర్య తన విధిని నిర్వర్తించారు. హీరో సూర్యను ఈ వివాదంలోకి లాగినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మాకు ఏ కమ్యూనిటీని కించపరచాలనే ఉద్దేశం లేదు. ఆ సీన్ వల్ల ఎవరైనా బాధపడినట్లయితే క్షమాపణలు కోరుతున్నాను. ఈ ఇబ్బందికర సమయంలో మాకు మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీలు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి కృతజ్ఞతలు ’’ అని టీజే. జ్ఞానవేల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. 



Updated Date - 2021-11-22T02:26:32+05:30 IST