ప్రతిసారీ తొలి సినిమాలానే ఉంటుంది!

ABN , First Publish Date - 2022-05-25T05:53:15+05:30 IST

వినోదం పంచడంలో వెంకటేష్‌ శైలి వేరు. ఆయన ఎప్పుడు కామెడీ చేసినా బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిసింది...

ప్రతిసారీ తొలి సినిమాలానే ఉంటుంది!

వినోదం పంచడంలో వెంకటేష్‌ శైలి వేరు. ఆయన ఎప్పుడు కామెడీ చేసినా బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిసింది. ‘ఇంట్లో ఇల్లాలు - వంటింట్లో ప్రియురాలు’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’..  ఇవన్నీ సంపూర్ణ వినోదాత్మక చిత్రాలే. ఈ తరానికి అలాంటి నవ్వుల బాంబుని ‘ఎఫ్‌ 2’తో అందించారు. ఇప్పుడు కొనసాగింపుగా ‘ఎఫ్‌ 3’ కూడా వచ్చేస్తోంది. ఈనెల 27న ‘ఎఫ్‌ 3’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో వెంకటేష్‌ ఏమన్నారంటే...?!  


‘ఎఫ్‌ 3’ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే..?

మోర్‌ ఫన్‌. ‘ఎఫ్‌ 2’ కంటే ఎక్కువ వినోదం ఉంటుంది. కొత్త కొత్త పాత్రలు వస్తాయి. కొత్త మేనరిజాలు కనిపిస్తాయి. ఏం చేసినా అందరినీ నవ్వించడానికే అన్నట్లు ఉంటుంది. 


స్టార్‌డమ్‌, ఇమేజ్‌.. లాంటివి పక్కన పెట్టి కొన్ని సన్నివేశాల్ని మీరు ఒప్పుకొనే విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. అదెలా సాధ్యమైంది?

ఎంటర్‌టైన్‌మెంట్‌ జోనర్‌లో ఉండే కిక్‌ అదే. ఆ తరహా సినిమాలు చేసేటప్పుడు ఇంకాస్త జోవియల్‌గా మారిపోతాను. అప్పుడు ఇంకేం గుర్తుండవు. ఓ సన్నివేశాన్ని సెట్లో ఇంకెంత బాగా చేస్తానా? అని ఎదురు చూస్తుంటాను. ‘ఎఫ్‌ 3’లో అది కుదిరింది. కోస్టార్స్‌ అంతా చక్కగా కలిసిపోవడంతో సన్నివేశాలు బాగా పండాయి. నేను ముందు నుంచీ ఇంతే. ప్రతిసారీ నాకది తొలి చిత్రమే అనిపిస్తుంది. ‘ఈసారి ఇంకెంత బాగా మెప్పించాలి’ అనే దిశగానే ఆలోచిస్తుంటాను.


‘నారప్ప’, ‘దృశ్యం 2’ ఇవి రెండూ సీరియస్‌ కథలు. ‘ఎఫ్‌ 3’తో మళ్లీ మీ జోనర్‌లోకి వచ్చేశానని అనిపించిందా?

కామెడీ అనగానే నాకే ఓ ప్రత్యేకమైన ఎనర్జీ వచ్చేస్తుంది. కాలేజీ రోజుల్లో కూడా చాలా జోవియల్‌గా ఉండేవాడ్ని. పైగా థియేటర్లో ఇలాంటి సినిమాలు చూసేటప్పుడు వచ్చే కిక్‌ వేరు. ‘నారప్ప’, ‘దృశ్యం 2’ ఇవి రెండూ ఓటీటీల్లో చూశారు. ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో తెలుసుకునే అవకాశం దక్కలేదు. ‘ఎఫ్‌ 3’తో మళ్లీ థియేటర్లకు వస్తున్నాం. అందుకు ఆనందంగా ఉంది.


‘ఎఫ్‌ 2’లో వెంకీ ఆసనం.. బాగా పాపులర్‌ అయ్యింది. ఈ సినిమాలోనూ అలాంటి మేనరిజాలు ఆశించొచ్చా?

వెంకీ ఆసన.. ఈ సినిమాలోనూ ఉంటుంది. నేనెక్కడికి వెళ్లినా, చిన్నపిల్లలు నా చుట్టూ చేరి, వెంకీ ఆసన.. ఇమిటేట్‌ చేసి చూపిస్తున్నారు. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్లెవరూ నా ‘బొబ్బిలి రాజా’, ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలు చూసి ఉండరు. నాకు తెలిసి... ‘ఎఫ్‌ 2’లోనే నన్ను చూసి ఉంటారు. అయినా వాళ్లకు నచ్చాను. వాళ్లని ఎంటర్‌టైన్‌ చేయగలిగాను. ఈతరం వాళ్లను కూడా సంతృప్తి పరచగలనన్న నమ్మకం నాకు ఆ క్షణం కలిగింది. 


వినోదం పంచడంలో మీది ప్రత్యేకమైన శైలి. ఆ హావభావాలు కొత్తగా ఉంటాయి. వాటిని ఎలా పట్టారు?

నేను పెద్దగా హోం వర్క్‌ చేయను. ఫ్రెష్‌ మైండ్‌తో సెట్స్‌కి వెళ్తా. మాటలు కూడా సరదాగా, సహజంగా ఉంటేనే ఇష్టం. నటుడిగా వాటిని బాగా పలికించొచ్చు. ఎక్కడికైనా వెళ్తే.. అక్కడ జనం ఎలా ఉన్నారు? ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ల హావభావాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలని ఎక్కువ గమనిస్తా. వాటిని త్వరగా నేర్చుకుంటా. తెరపై కావల్సినప్పుడు ఆటోమెటిగ్గా.. వాటిని అనుకరించేస్తుంటాను. కొన్నిసార్లు.. గొంతుని కాస్త మార్చి డైలాగ్‌ చెబితే గమ్మత్తుగా ఉంటుంది. కొన్నిసార్లు అల్లు రామలింగయ్యగారి మేనరిజాన్ని ఇమిటేట్‌ చేశా. అది బాగా వర్కవుట్‌ అయ్యింది. మనకు చాలామంది హాస్య నటులు ఉన్నారు. ప్రతి ఒక్కరి నుంచీ ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉన్నా.


అనిల్‌ రావిపూడిని ఈవీవీ సత్యనారాయణలాంటి దర్శకులతో పోలుస్తున్నారు. మీకూ అదే అనిపించిందా?

నేను ఈవీవీగారితో పనిచేశా. ఆయన వినోదం పండించడంలో దిట్ట. అనిల్‌ రావిపూడిది కూడా అదే స్కూలు. తను మంచి రైటర్‌. ‘మసాలా’ సినిమాకి పని చేస్తున్నప్పటి నుంచీ తను నాకు తెలుసు. నటీనటుల నుంచి ఎంత రాబట్టుకోవాలో, ఏ సన్నివేశాన్ని ఎలా పండించాలో తనకు బాగా అర్థమైంది.


కోవిడ్‌ టైమ్‌లో పనిచేయడం కష్టమనిపించలేదా?

చాలా ఇబ్బంది ఉండేది. సెట్లో చాలామంది ఉన్నారు. వాళ్లలో ఎవరికి కోవిడ్‌ ఉందో తెలీదు. అయినా సరే, మాస్కులు  తీసేసి నటించాల్సివచ్చేది. సీన్‌ అయిపోగానే.. కార్‌ వాన్‌లోకి వచ్చి, సురక్షితమైన జాగ్రత్తలన్నీ  తీసుకొనేవాడిని. ఇప్పటికీ అంతే. మాస్క్‌ తీయను. శానిటైజేషన్‌ విషయంలో పక్కాగా ఉంటా. అందుకనే ఇప్పటి వరకూ నాకు కరోనా సోకలేదు. 


సల్మాన్‌తో ఓ సినిమా చేస్తున్నారట. ఆ సంగతులేంటి?

అవును.. సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో నాది కీలకమైన పాత్ర. కథానాయికకు సోదరుడిగా నటిస్తున్నా. నెట్‌ఫ్లిక్స్‌ కోసం రానాతో కలిసి ఓ సిరీస్‌ చేశాను. షూటింగ్‌ దాదాపుగా పూర్తయింది. త్వరలోనే ఆ విషయాలు బయటకు వస్తాయి. 

Updated Date - 2022-05-25T05:53:15+05:30 IST