కొంచెం కంగారుగానే ఉంది కానీ..

ABN , First Publish Date - 2022-10-05T07:15:08+05:30 IST

‘ఒక మంచి సినిమాతో నటుడిగా పరిచయం అవ్వాలని ఎదురు చూస్తున్న నాకు దర్శకుడు లక్ష్మణ్‌ ఈ కథ చెప్పారు. విభిన్నంగా ఉన్న ఈ కథను తెలుగు...

కొంచెం కంగారుగానే ఉంది కానీ..

‘ఒక మంచి సినిమాతో నటుడిగా పరిచయం అవ్వాలని ఎదురు చూస్తున్న నాకు దర్శకుడు లక్ష్మణ్‌ ఈ కథ చెప్పారు. విభిన్నంగా ఉన్న ఈ కథను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్మి, ఆ కథను నిర్మాత నాగ వంశీగారికి చెప్పాం. ఆయనకు నచ్చి, ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు’ అని చెప్పారు బెల్లంకొండ గణేశ్‌. ‘స్వాతిముత్యం’సినిమాతో హీరోగా పరిచయమవుతున్న గణేశ్‌ మంగళవారం మీడియాతో ముచ్చటించారు. మాస్‌ సినిమాతో కాకుండా ఓ క్లాస్‌ చిత్రంతో పరిచయం కావాలనుకోవడానికి కారణం ఏమిటని అడిగితే ‘సినిమా బాగుంటే ఎలాంటి జానర్‌ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. కథ బాగుంది కనుకే ఈ చిత్రం చేశాను. సినిమా అంటే కచ్చితంగా పోరాట సన్నివేశాలు ఉండాలని లేదుగా’ అన్నారు గణేశ్‌. ‘విక్కీ డోనార్‌’, ‘స్వాతిముత్యం’ చిత్రాల కథాంశం ఒక్కటే. అయితే ఈ రెండు చిత్రాలకు ఎలాంటి సంబంధం లేదు’ అని వివరించారాయన. ‘స్వాతిముత్యం’ కంటే మొదట ప్రారంభించిన చిత్రం ఆగిపోవడానికి కారణం వివరిస్తూ ‘పవన్‌ సాధినేని గారి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించాం. కథ చాలా బాగుంటుంది. అమెరికాలో కొన్ని రోజులు వర్క్‌ చేయాలి. ఆ సమయంలోనే కరోనా రావడంతో షూటింగ్‌ ఆపేశాం. ఇప్పుడు ఆ చిత్రాన్ని తిరిగి ప్రారంభించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు’ అని చెప్పారు గణేశ్‌. చిరంజీవి, నాగార్జున చిత్రాలతో పాటు తన సినిమా విడుదలవుతుండడం గురించి ఆయన వివరిస్తూ ‘కొంచెం కంగారుగానే ఉంది. అదే సమయంలో చిరంజీవి, నాగార్జున గార్ల పోస్టర్స్‌ పక్కనే నా పోస్టర్‌ కూడా చూసుకోవచ్చు అనే ఆనందం కూడా ఉంది. దసరా పెద్ద పండగ. ప్రేక్షకులకు నచ్చేలా ఉంటే ఈ పండగకి ఎన్ని సినిమాలు వచ్చినా చూస్తారు. మా ‘స్వాతిముత్యం’ కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ప్రస్తుతం ‘నేను స్టూడెంట్‌ సార్‌’ అనే ఓ థ్రిల్లర్‌ చేస్తున్నట్లు, షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో  రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని గణేశ్‌ చెప్పారు.


Updated Date - 2022-10-05T07:15:08+05:30 IST