IT attacks: కోలీవుడ్‌ నిర్మాతలపై ఐటీ పంజా

ABN , First Publish Date - 2022-08-03T16:03:06+05:30 IST

కోలీవుడ్‌ నిర్మాతలపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ పంజా విసిరింది. నలుగురు బడా నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో మంగళవారం ఐటీ అధికారులు(IT

IT attacks: కోలీవుడ్‌ నిర్మాతలపై ఐటీ పంజా

- చెన్నై, మదురైలలో హఠాత్‌ సోదాలు

- ఏక కాలంలో 40 ప్రాంతాల్లో తనిఖీలు


అడయార్‌(చెన్నై), ఆగస్టు 2: కోలీవుడ్‌ నిర్మాతలపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ పంజా విసిరింది. నలుగురు బడా నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో మంగళవారం ఐటీ అధికారులు(IT officers) సోదాలు చేశారు. చెన్నై, మదురై సహా మొత్తం 40 చోట్ల ఏకకాలంలో అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ సోదాల్లో వందమందికి పైగా అధికారులు పాల్గొన్నారు. ఐటీ అధికారులు టార్గెట్‌ చేసిన వారిలో ప్రముఖ సినీ ఫైనాన్షియర్‌, నిర్మాత, గోపురం ఫిలిమ్స్‌ అధినేత అన్బుచెళియన్‌, నిర్మాత, వి క్రియేషన్స్‌ అధినేత కలైపులి ఎస్‌.థాను, నిర్మాత, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ భాగస్వామి ఎస్‌.ఆర్‌.ప్రభు, మరో నిర్మాత, స్టూడియో గ్రీన్‌ అధినేత ఙ్ఞానవేల్‌ రాజా ఉన్నారు. అన్బుచెళియన్‌ గత పదేళ్ళ అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో తిరుగులేని నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా ఎదిగారు. 2020లో హీరో విజయ్‌(Hero Vijay) నటించిన ‘బిగిల్‌’ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ వసూలు చేసింది. ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రానికి అయిన ఖర్చును ఏజీఎస్‌ సంస్థకు అన్బుచెళియన్‌ సమకూర్చినట్టు సమాచారం. అయితే, ‘బిగిల్‌’ కలెక్షన్లను సక్రమంగా చూపించకుండా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2020లోనే అన్బుచెళియన్‌ నివాసాలు, కార్యాలయాలు, గోపురం ఫిలిమ్స్‌ ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో  సేకరించిన పత్రాలు ఆధారాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అన్బుచెళియన్‌ చెల్లించాల్సిన పన్నులో దాదాపు రూ.300 కోట్ల మేరకు ఎగవేతకు పాల్పడినట్టు తేల్చినట్లు సమాచారం. అలాగే, లెక్కల్లో చూపని రూ.77 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. తాజాగా కమల్‌ హాసన్‌(Kamal Haasan) నటించిన ‘విక్రమ్‌’, శరవణా స్టోర్స్‌ అధినేత శరవణన్‌ నటించిన ‘ది లెజెండ్‌’ చిత్రాలకు కూడా అన్బుచెళియన్‌ ఫైనాన్స్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్బుచెళియన్‌కు చెందిన చెన్నై, మదురైలో ఉన్న నివాసాలు, కార్యాలయాలతోపాటు ఆయన సోదరుడు, స్నేహితుల ఇళ్ళలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. స్థానిక నుంగంబాక్కం, కామ్‌ధర్‌ నగర్‌లోని బంగళా, టి.నగర్‌లోని కార్యాలయం, మదురై కామరాజర్‌ రోడ్డులో ఉన్న నివాసం, సౌత్‌ మాసి వీధిలో ఉన్న కార్యాలయం, సెల్లూరులో ఉన్న గోపురం సినిమాస్‌ కార్యాలయం, మదురైలోని థియేటర్‌తో పాటు దాదాపు 35కు పైగా ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఇందులో 2022-21లో ఆయన నిర్మించిన లేదా ఫైనాన్స్‌ చేసిన సినిమాల ఆదాయ వ్యయ వివరాలను పరిశీలించారు. అలాగే, ఎంతమంది నిర్మాతలకు ఫైనాన్స్‌ చేశారు, ఆ లెక్కలన్నీ సక్రమంగా ఉన్నాయా? తదితర వివరాలపై ఆరా తీశారు. ఈ తనిఖీల్లో బంగారం, వెండి, డైమండ్‌ నగలతో పాటు కొంత నగదు, కీలక పత్రాల, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, ప్రముఖ నిర్మాతలైన కలైపులి ఎస్‌.థాను, ఎస్‌ఆర్‌. ప్రభులకు, ఙ్ఞానవేల్‌ రాజాల నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. కలైపులి(Kalaipuli) ఎస్‌.థానుకు చెందిన ఇల్లు, తేనాంపేటలోని ఆయన సినిమా కార్యాలయం, అదేవిధంగా హీరో సూర్య బంధువు, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మాతల్లో ఒకరైన ఎస్‌ఆర్‌.ప్రభుకు చెందిన కార్యాలయాలు, ఆఫీసులు, మరో సినిమా నిర్మాత, పాడిలోని గ్రీన్‌ స్టూడియో అధినేత, థియేటర్‌ యజమాని ఙ్ఞానవేల్‌ రాజా ఇల్లు కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. 

Updated Date - 2022-08-03T16:03:06+05:30 IST