వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తాజాగా మరో టాలెంటెడ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయనే ఇంద్రగంటి మోహనకృష్ణ (Indraganti MohanKrishna). లైగర్ (Liger) సినిమాతో మొదటి సారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సాలీడ్ హిట్ అందుకుకొని పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నాడు. పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాను పూర్తి చేసిన విజయ్, పూరి డైరెక్షన్‌లోనే మరో పాన్ ఇండియా సినిమా జనగణమన (Janaganamana)లో నటిస్తున్నాడు. ఈ సినిమా షుటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మరోవైపు శివ నిర్వాణ (Siva Nirvana) దర్శకత్వంలో ఖుషి (Khushi) అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్నాడు. సమంత (Samantha) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే కశ్మీర్‌లో పూర్తైంది. త్వరలో వైజాగ్ పరిసర ప్రాంతాలలో సెకండ్ షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు. లైగర్, ఖుషి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యేలా విజయ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు రౌడీ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వీరి కాంబోలో కూడా పాన్ ఇండియా సినిమానే ప్లాన్ చేస్తున్నారట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రం రూపొందుతోంది. దీని తర్వాత విజయ్ సినిమా ఉండే అవకాశాలున్నాయి.