‘బాహుబలి 2’కి పారిపోదామనుకున్నా: ప్రభాస్

ABN , First Publish Date - 2022-03-10T23:30:56+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రాధే శ్యామ్’. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా ప్రభాస్ కొన్ని రోజులుగా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ చిత్ర విశేషాలను తెలియజేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ అంతకు ముందు నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎప్పుడూ..

‘బాహుబలి 2’కి పారిపోదామనుకున్నా: ప్రభాస్

గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రాధే శ్యామ్’. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా ప్రభాస్ కొన్ని రోజులుగా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ చిత్ర విశేషాలను తెలియజేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ అంతకు ముందు నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎప్పుడూ.. మైక్ పట్టుకుని ఎక్కువ సేపు మాట్లాడలేదు. మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా క్లుప్తంగా సమాధానాలు ఇచ్చి కామ్‌గా కూర్చునేవారు. అలాంటిది ఇప్పుడు ‘రాధే శ్యామ్’ కోసం ఆయనే మైకు వెతుక్కుంటున్నారు. గంటల కొద్ది మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తుంటే, సడెన్‌గా ప్రభాస్‌లో ఈ మార్పుకు కారణం ఏమిటి? అని అందరికీ అనిపించకమానదు. సరిగ్గా ఇదే ప్రశ్నని ప్రభాస్‌కు దర్శకధీరుడు రాజమౌళి సంధించారు. ‘రాధే శ్యామ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్‌-రాజమౌళి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. తాజాగా ఈ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. అందులో పై ప్రశ్నని ప్రభాస్‌కు సంధించారు రాజమౌళి. 


రాజమౌళి: సినిమా కెమెరా తప్ప.. వేరే ఏ కెమెరా కనబడినా పారిపోవడం, ప్రమోషన్ అంటే భయపడిపోవడం.. మైకు, పబ్లిసిటీ అంటే భయపడిపోవడం, సిగ్గుపడటం వంటివి చేసే నీవు.. (బాహుబలి విషయంలో చాలా దగ్గరగా చూశాను కాబట్టి చెబుతున్నా.. అప్పుడు రానా, తమన్నాలని ముందు మాట్లాడమని చెప్పిన నీవు).. ఇప్పుడు మైకు దొరికితే వదలకుండా.. ఏ భాషలో పడితే ఆ భాషలో మాట్లాడేస్తుండటం.. పక్కనోళ్ల ప్రశ్నకి కూడా నువ్వే సమాధానం చెప్పేయడం వంటివి చూస్తున్నా. ఈ మార్పుకు కారణం ఏమిటి?


ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘దీనికి కారణం మీరే గురువుగారు.. మీరే. బాహుబలి 1 సమయంలో ‘ఐ యామ్ ప్రభాస్’ అని బోర్డులు పట్టించారు. తమిళనాడులో ఒక్కరోజులో 40 ఇంటర్వ్యూలు ఇచ్చాం. బొంబై నేను రాలేనని మొత్తుకున్నా వినకుండా.. నన్ను లాక్కెళ్లి, 40 మంది ప్రెస్ వాళ్ల ముందు కూర్చోబెట్టారు. మీకు గుర్తుందో లేదో.. ఆ రోజు నేను వణికిపోయాను. మీరు పక్కన ‘డార్లింగ్ మనం మంచి సినిమా తీశాం’ అంటూ నాకు ధైర్యం చెబుతున్నారు. బాహుబలి 2 ప్రమోషన్ విషయంలో దొరకకుండా పారిపోదాం అనుకున్నాను. కానీ వదలలేదు. అప్పుడంటే రానా, తమన్నా అంతా చూసుకుని.. నన్నసలు మాట్లాడనీయలేదు. ఆ తర్వాత ‘సాహో’ విషయంలో శ్రద్ధా కపూర్ కొన్నిసార్లు హెల్ప్ చేసింది. ‘సాహో’ మా ఫ్రెండ్స్ చేశారు. వాళ్లు నన్ను రోడ్డు మీద వదిలేశారు. దాంతో ఇక తప్పలేదు. ఇదంతా మీ వల్లే. ఇప్పుడు నేనెవ్వరినీ మాట్లాడనివ్వడం లేదనే విషయం నాకు తెలియదు. అయితే ఇప్పుడు తమన్నాని, రానాని డామినేట్ చేశానంటారు’’ అంటూ ప్రభాస్ నవ్వేశారు.


రాజమౌళి: డామినేట్ కాదు.. తొక్కేయడమే. 

Updated Date - 2022-03-10T23:30:56+05:30 IST