‘అల్లూరి సీతారామరాజు’: ప్రివ్యూకి వెళ్లిన దర్శకుడిని గేటు దగ్గరే ఆపేశారు

ABN , First Publish Date - 2021-07-25T02:25:44+05:30 IST

హీరో కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం విడుదలకు ముందు చెన్నైలోని ఫిల్మ్‌ చాంబర్‌ థియేటర్‌లో సినీ ప్రముఖుల కోసం ప్రివ్యూ వేశారు. ఆ సినిమా చూడాలనే కోరికతో థియేటర్‌ దగ్గరకు వెళ్లిన దర్శకుడిని గేటు దగ్గరున్న ప్రొడక్షన్‌ మేనేజర్‌ వెంకన్నబాబు లోపలికి పంపించలేదు. దీంతో ఆ

‘అల్లూరి సీతారామరాజు’: ప్రివ్యూకి వెళ్లిన దర్శకుడిని గేటు దగ్గరే ఆపేశారు

హీరో కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం విడుదలకు ముందు చెన్నైలోని ఫిల్మ్‌ చాంబర్‌ థియేటర్‌లో సినీ ప్రముఖుల కోసం ప్రివ్యూ వేశారు.  కోడి రామకృష్ణ ఆ రోజుల్లో దాసరి నారాయణరావు దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆ సినిమా చూడాలనే కోరికతో థియేటర్‌ దగ్గరకు వెళ్లారు. కానీ గేటు దగ్గరున్న ప్రొడక్షన్‌ మేనేజర్‌ వెంకన్నబాబు ఆయన్ని లోపలికి పంపించలేదు. 


‘ఇది ముఖ్యమైన వ్యక్తుల కోసం వేసుకుంటున్న షో. నువ్వెవరు?’ అని ప్రశ్నించారు. తను ఎవరో, ఎవరి దగ్గర పనిచేస్తున్నానో చెప్పడానికి కోడి రామకృష్ణ ఇబ్బందిగా ఫీలయ్యారు.. అందుకే ఆయన్ని బతిమాలుతూ అక్కడే ఉన్నారు. కాసేపటికి పెద్ద కారులో కృష్ణ, విజయనిర్మల అక్కడికి వచ్చారు. గేటు దగ్గరే నిలబడి వెంకన్నబాబును కోడి రామకృష్ణ బతిమాలడం గమనించి దగ్గరకు రమ్మని పిలిచారు కృష్ణ. కోడి రామకృష్ణ దగ్గరకు వెళ్లగానే ‘ఎవరు నువ్వు?’ అనడిగారు కృష్ణ. 


‘నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌నండీ. మీ సినిమా గురించి అందరూ గొప్పగా చెప్పుకోవడం విన్నానండీ.. అందుకే సినిమా చూద్దామని వచ్చాను. కానీ ఆయన లోపలకి వెళ్లనివ్వడం లేదు’ అని చెప్పారు కోడి రామకృష్ణ.

‘ఎవరి దగ్గర నువ్వు పనిచేస్తున్నావు?’ అని మళ్లీ అడిగారు కృష్ణ.

‘సార్‌.. అతను నన్ను తోసెయ్యకముందు అడిగితే చెప్పేవాడినండీ.. ఇంత జరిగిన తర్వాత మా గురువుగారి పేరు చెప్పడం మర్యాద కాదండీ’ అన్నారు కోడి రామకృష్ణ.

‘సరే అయితే.. నువ్వు లోపలికి వెళ్లు. సీటు ఖాళీగా ఉంటే కూర్చో. సీటు లేకపోతే... ’ అని ఆయన ఏదో చెప్పబోతుండగానే ‘కింద కూర్చుంటానండీ’ అన్నారు కోడి రామకృష్ణ.

‘కింద కాదు. వెంకన్నబాబుకి చెప్పు.. కుర్చీ వేస్తాడు. కూర్చుని సినిమా చూడు. చూశాక ఎలా ఉందో నాకు చెప్పు’ అని చెప్పి లోపలికి పంపించారు కృష్ణ.


అలా కోడి రామకృష్ణ  ప్రివ్యూ చూసిన తొలి సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. సినిమా చూశాక బయటకి వచ్చి ‘బ్రహ్మాండంగా ఉంది సార్‌’ అని కృష్ణకు  చెబుదామని అటూఇటూ చూశారు కానీ ఆయన అప్పటికే వెళ్లిపోయారు. కొన్నేళ్ల తర్వాత ‘పోరాటం’ చిత్ర షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఒక రోజు కృష్ణకు ఈ విషయం చెప్పారు కోడి రామకృష్ణ. ‘అవును.. నాకూ గుర్తుంది. వెంకన్నబాబు నిన్ను లోపలికి పంపించలేదు కదూ’ అని గుర్తు చేసుకున్నారు కృష్ణ.

-వినాయకరావు

Updated Date - 2021-07-25T02:25:44+05:30 IST