Cannes 2022: ఆర్యభట్ట నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వరకు.. మేము గుర్తించని వారెందరో..

ABN , First Publish Date - 2022-05-20T19:12:01+05:30 IST

టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న తమిళ నటుడు ఆర్.మాధవన్. వరుస సినిమాలతో, వెబ్‌సిరీస్‌లతో..

Cannes 2022: ఆర్యభట్ట నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వరకు.. మేము గుర్తించని వారెందరో..

టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న తమిళ నటుడు మాధవన్ (Madhavan). వరుస సినిమాలతో, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉన్న ఈ నటుడు మొదటిసారి ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని తాజాగా ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించాడు. అనంతరం కేన్స్‌లోని ఇండియా ఫోరమ్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో మాధవన్‌తోపాటు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur), చిత్రనిర్మాత శేఖర్ కపూర్, గీత రచయిత, CBFC చైర్మన్ ప్రసూన్ జోషి, అమెరికన్ జర్నలిస్ట్ స్కాట్ రోక్స్‌బరో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ.. ‘ఆర్యభట్ట నుంచి సుందర్ పిచాయ్ వరకు.. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మా దేశానికి చెందిన వ్యక్తులకి ఎన్నో అసాధారణమైన కథలు ఉన్నాయి. అయితే.. ఇలాంటి వ్యక్తులపై మేం సినిమాలు తీయడం లేదు. కానీ నా వరకు.. ఈ వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు స్ఫూర్తి. వీరికి సినీతారలు, నటీనటుల కంటే ఎక్కువ మంది అభిమానులున్నారు. నేను ఇటీవలే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ నుంచి కొత్త మెటావర్స్‌ని ప్రారంభించి వెబ్ 3.0లోకి ప్రవేశించిన ఈ కుర్రాళ్లను కలిశాను. అలాంటి విజయగాథల గురించి సినిమాలు తీయడం లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన వ్యక్తులను చిత్రనిర్మాతలు గుర్తించడం లేదు.


‘ఇన్సెప్షన్’, ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘టెనెట్’ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలతో గుర్తింపు పొందిన హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నూలన్ (Christopher Nolan) గురించి మాధవన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘క్రిస్టఫర్ నూలన్ ఒక సినిమాకి రివ్యూ ఇవ్వడానికి సమీక్షకుల భయపడతారు. ఎందుకంటే.. ఆయన తీసిన సినిమాలు అర్థంకాక ఏదో రాసేసి ఇడియట్ అనిపించుకోవడానికి వారు ఇష్టపడరు. ఎందుకంటే.. ఒక సైంటిస్ట్ సినిమా తీయడం వల్ల ఆయన సినిమా ఖచ్చితంగా వారికి అర్థంకాదని వారికి తెలుసు. అది ఆయన అర్హత.


నిజం చెప్పాలంటే.. నాకు ఇప్పటి వరకు క్రిస్టఫర్ ‘ఇన్‌సెప్షన్’ అర్థం కాలేదు. కానీ ఆయనకి సైన్స్‌పై ఉన్న పరిజ్ఞానం కారణంగా ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి.. ఆయన తీసిన సినిమా ప్రేక్షకులకి అర్థం అవుతుందా కాదా అనే దాన్ని ఆయన అసలు పట్టించుకోడు’ అని మాధవన్ తెలిపాడు.

Updated Date - 2022-05-20T19:12:01+05:30 IST