కోలీవుడ్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), మాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) కాంబినేషన్‌లో ఎన్నో చిత్రాలొచ్చాయి. అవన్నీ మ్యూజికల్‌గా మ్యాజిక్ చేశాయి. ఇద్దరి కెరీర్స్ ఇంచుమించు ఒకేసారి ప్రారంభమయ్యాయి. అందుకే ఇద్దరి మధ్యా ఇప్పటికీ స్నేహ సంబంధం కొనసాగుతోంది. రజినీ అంటే ఇళయరాజాకి, ఇళయరాజా అంటే రజినీకి ఎంతో గౌరవం. ఇద్దరూ ఎప్పుడు కలుసుకున్నా వారిమధ్య స్నేహ పూర్వకమైన వాతావరణం నెలకొంటుంది. ఈ క్రమంలో ఈ ఇద్దరూ తాజాగా భేటీ అయ్యారు. అది ఏనిమా కోసమో అనుకుంటే పొరపాటు. ఒక సంగీత విభావరి విషయమైన ఇద్దరూ కలుసుకోవడం విశేషం.
చెన్నైలోని పోయెస్ గార్డెన్ (Poes Garden) లోని రజనీ (Rajini) నివాసానికి వెళ్లిన ఇళయరాజా (Ilayaraja).. కొద్దిసేపు ఆయనతో ముచ్చటించారు. అనంతరం జూన్ 2వ తేదీన జరుగనున్న తన జన్మదినాన్ని పురస్కరించుకుని కోయంబత్తూరులో అభిమానులు నిర్వహించనున్న సంగీత విభావరి రిహార్సల్స్ చూసేందుకు రావాలని రజనీని ఆహ్వానించారు. వెంటనే అంగీకరించిన రజనీ.. తన కారులోనే ఇళయరాజాతో కలిసి కోడంబాక్కంలోని ఇళయరాజా స్టూడియో (Ilayaraja Studio) కు వెళ్లారు. అక్కడ రెండు గంటలపాటు రిహార్సల్స్ తిలకించిన అనంతరం కళాకారులను అభినందించారు.