ఈ కథకు మొదటి ప్రేక్షకురాల్ని నేనే!

ABN , First Publish Date - 2022-05-22T08:02:42+05:30 IST

‘‘నా కెరీర్‌ మొదట్లో నాకు వచ్చిన పాత్రలే చేశాను. ఇప్పుడు వచ్చినవాటిలో నచ్చినవి మాత్రమే చేస్తున్నాను. ‘మేజర్‌’ కథ నాకు మనస్ఫూర్తిగా నచ్చింది...

ఈ కథకు మొదటి ప్రేక్షకురాల్ని నేనే!

‘‘నా కెరీర్‌ మొదట్లో నాకు వచ్చిన పాత్రలే చేశాను. ఇప్పుడు వచ్చినవాటిలో నచ్చినవి మాత్రమే చేస్తున్నాను. ‘మేజర్‌’ కథ నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. ఈ చిత్రంలో నా పాత్ర కొత్త తరహాలో ఉంటుంద’’న్నారు శోభితా ధూధిపాళ. అడవిశేష్‌ నటించిన ‘మేజర్‌’లో శోభిత కీలక పాత్ర పోషించారు. జూన్‌ 3న ‘మేజర్‌’ విడుదల అవుతున్న సందర్భంగా శోభిత పంచుకొన్న విశేషాలివీ..


మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన కథ ఇది. ఈ కథ గురించి అడవిశేష్‌ ఎప్పటి నుంచో పరిశోధన చేస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు. ‘గూఢచారి’ సెట్స్‌లో కూడా.. ఉన్నికృష్ణన్‌ గురించి నాకు కథలు కథలుగా చెప్పేవారు. అలా ఈ సినిమాకి మొదటి ప్రేక్షకురాలిని నేనే అయ్యా. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నేను కూడా ఉంటానని నాకు అస్సలు తెలీదు. ఆ అవకాశం రాగానే ఆశ్చర్యపోయా.


ఈ చిత్రంలో ప్రమోదగా కనిపిస్తా. భయం, బాధ, ధైర్యం, నమ్మకం, ఆశ, నిరాశ.. ఇలా చాలా రకాలైన భావోద్వేగాల్ని పలికించాలి. ఇప్పటి వరకూ నేను చేసిన బరువైన పాత్ర ఇదే. పూర్తిగా మనసు పెట్టి నటించా. సెట్లో భావోద్వేగభరిత సన్నివేశాల్లో గ్లిజరిన్‌ వాడుతుంటారు. కానీ.. ఈ సినిమాలో నాకు ఆ అవసరమే రాలేదు. ఎందుకంటే.. కథలో, పాత్రలో ఆ పెయిన్‌ ఉంది.


ఉన్నికృష్ణన్‌ జీవితంలో చాలా కమర్షియల్‌ కోణాలున్నాయి. వాటన్నింటినీ ఈ సినిమాలో చూపించడం కుదర్లేదు. ఎందుకంటే.. ఉన్నికృష్ణన్‌ కథ చెబుతూ, 26-11 అటాక్‌ గురించి కూడా  చెప్పాలి. రెండింటినీ దర్శకుడు బాలెన్స్‌ చేయాల్సివచ్చింది. మేజర్‌ సందీప్‌ ఎలా బతికారు? ఎంత ధైర్యంగా పోరాడారు? అనే విషయాల్ని తెరపై చూస్తారు. అతని జీవితం అందరికీ ఆదర్శ ప్రాయం.


కరోనా సమయంలో చాలా భయపడ్డాం. ఈ సినిమా ఓటీటీకి వెళ్లిపోతుందేమో అనే ఆందోళన ఉండేది. కానీ ఆ సమయంలో మహేష్‌ బాబు మాకు సపోర్ట్‌గా నిలబడ్డారు. ‘ఇది థియేటర్‌లోనే చూడాల్సిన సినిమా’ అని మాకు ధైర్యం ఇచ్చారు.  


Updated Date - 2022-05-22T08:02:42+05:30 IST