RRR effect: రాజమౌళిని చూసి లేచి నిలబడిన అమెరికన్స్.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-10-02T19:35:39+05:30 IST

టాలీవుడ్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సృష్టించిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే.

RRR effect: రాజమౌళిని చూసి లేచి నిలబడిన అమెరికన్స్.. వీడియో వైరల్

టాలీవుడ్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్(RRR)’ మూవీ సృష్టించిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలై దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్లని సాధించింది. అనంతరం ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి వ్యూస్ సాధించింది. అంతేకాకుండా.. ఈ సినిమాని చూసిన పలువు హాలీవుడ్ ప్రముఖులు ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. దాంతో.. ఈ మూవీ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి ఆస్కార్స్ 2023కి భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ జ్యూరీ ఈ సినిమాకి బదులు గుజరాతీ చిత్రం ‘ది చెల్లో షో’ని ఎంపిక చేశారు.


అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గకపోగా.. నానాటికీ పెరుగుతూ పోతోంది. రామ్ చరణ్ (Ram Charan),  జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన పీరియడ్ యాక్షన్ ఎక్స్‌ట్రావాగాంజా సెప్టెంబర్ 30న.. ప్రపంచంలోని అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్‌లలో ఒకటైన టీఎల్‌సీ చైనీస్ థియేటర్‌లో ప్రదర్శించింది.


ఈ సినిమా చూసిన ప్రేక్షకులు నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తూ, ప్రతి యాక్షన్ సీన్‌కి చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. సినిమా ముగిసిన తర్వాత రాజమౌళి సెంటర్ స్టేజ్‌కి వచ్చారు. దీంతో ప్రేక్షకులు అందరూ స్టాండింగ్ ఒవేషన్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసిన రాజమౌళి.. ‘నా హీరోలు, నా సినిమా, నా పట్ల మీరు చూపిన అభిమానం చాలా అద్భుతం. ధన్యవాదాలు యూఎస్‌ఏ’ అని రాసుకొచ్చాడు.


అలాగే.. రాజమౌళి తనయుడు కార్తీకేయ కూడా దీనికి సంబంధించిన మరో వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి.. ‘ఆర్ఆర్ఆర్ సినిమాని సుమారు 900 మంది విభిన్న ప్రేక్షకులతో కలిసి చూడటం చాలా మంచి అనుభవం. లాస్ ఏంజిల్స్ నడిబొడ్డున ఉన్న ప్రపంచంలోని అత్యుత్తమ ఐమాక్స్ స్క్రీన్‌లలో చూడడం అద్భుతంగా ఉంది. నా సోదరులు తారక్, రామ్ చరణ్ నటనతో అందరినీ ఊర్రూతలు ఊగించారు’ అని రాసుకొచ్చాడు.


సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 23 వరకు ‘టాలీవుడ్ టు హాలీవుడ్: ది స్పెక్టాకిల్ & మెజెస్టి ఆఫ్ ఎస్.ఎస్. రాజమౌళి’ అనే పేరుతో రాజమౌళి ఓ ఈవెంట్‌ని హోస్ట్ చేస్తున్నాడు. నెల రోజుల పాటు జరిగే బియాండ్ ఫెస్ట్‌లో భాగంగా ఈ ఈవెంట్‌ జరగనుంది. ‘ఆర్ఆర్ఆర్2 తర్వాత.. అక్టోబర్ 1న ప్రభాస్ ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ స్క్రీనింగ్ వేశారు. అలాగే.. కిచ్చా సుదీప్, సమంతా రూత్ ప్రభు నటించిన ఫాంటసీ యాక్షన్ చిత్రం ‘ఈగ’ని ప్రదర్శించారు. అక్టోబర్ 21 న ‘మగధీర’, అక్టోబర్ 23న ‘మర్యాద రామన్న’ స్క్రీనింగ్‌ వేస్తారు.





Updated Date - 2022-10-02T19:35:39+05:30 IST