విల్ స్మిత్‌పై చర్యలు తీసుకున్న అకాడమీ.. స్పందించిన స్టార్ హీరో..

ABN , First Publish Date - 2022-04-09T20:33:14+05:30 IST

హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ అవార్డు గ్రహీత విల్ స్మిత్‌పై అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ చర్యలు తీసుకుంది

విల్ స్మిత్‌పై చర్యలు తీసుకున్న అకాడమీ.. స్పందించిన స్టార్ హీరో..

హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ అవార్డు గ్రహీత విల్ స్మిత్‌పై అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ చర్యలు తీసుకుంది. పదేళ్ల పాటు ఆస్కార్ వేడుకల్లో పాల్గొనకుండా అతడిపై నిషేధం విధించింది. అకాడమీ నిర్వహించే ఇతర వేడుకల్లోను పాల్గొనరాదని చెప్పింది. ‘కింగ్ రిచర్డ్’ సినిమాకు గాను విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. అతడికిచ్చిన అవార్డును మాత్రం అకాడమీ వెనక్కి తీసుకోలేదు. 


విల్ స్మిత్ చెంపదెబ్బ వ్యవహారం:

94వ ఆస్కార్ పురస్కారాలకు ప్రముఖ కమెడియన్, క్రిస్ రాక్ హోస్ట్‌గా  వ్యవహారించాడు. ప్రజలను నవ్వుల్లో ముంచెత్తడానికి విల్‌స్మిత్‌ భార్య జాడా పింకెట్ ప్రస్తావనను తీసుకొచ్చాడు. ‘జీ.ఐ.జెన్’ చిత్రంలో ‘డెమి‌మూర్’ పోషించిన పాత్రతో జాడాను పోల్చాడు. దీంతో భరించలేకపోయిన విల్ స్మిత్ ఆగ్రహానికి గురయి క్రిస్ చెంప పగలకొట్టాడు. ఈ నేపథ్యంలో స్టార్ హీరో చర్యలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఖండించింది. అతడిపై చర్యలు చేపట్టేందుకు బోర్డు అకాడమీ గవర్నర్‌లు శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ‘‘విల్ స్మిత్‌పై పదేళ్ల నిషేధం విధించాలని బోర్డు నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 8నుంచి అమల్లోకి వస్తుంది. అకాడమీ నిర్వహించే ఏ ఇతర వేడుకల్లోను అతడికీ ప్రవేశం లేదు’’ అని అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రుబిన్, సీఈవో డాన్ హడ్సన్ వెల్లడించారు. అకాడమీ నిర్ణయంపై విల్ స్మిత్ స్పందించాడు. ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు స్పష్టం చేశాడు.

Updated Date - 2022-04-09T20:33:14+05:30 IST