కారును వదిలేసి ఉక్రెయిన్ నుంచి కాలినడకన పారిపోయిన హాలీవుడ్ స్టార్ హీరో

ABN , First Publish Date - 2022-03-02T22:13:37+05:30 IST

రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య వారం రోజులుగా యుద్ధం కొనసాగుతున్న

కారును వదిలేసి ఉక్రెయిన్ నుంచి కాలినడకన పారిపోయిన హాలీవుడ్ స్టార్ హీరో

రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య వారం రోజులుగా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని డాక్యుమెంటరీగా తీయాలని వెళ్లిన ఓ హాలీవుడ్ నటుడికి పరిస్థితులు అనుకూలించలేదు. ఫలితంగా ఉక్రెయిన్‌ను కాలినడకన వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆ దేశాన్ని వదిలి వెళుతున్న ఫొటోను సోషల్ మీడియాలో అతడు షేర్ చేశాడు. దీంతో హాలీవుడ్ నటుడికే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితేంటి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 


అమెరికాకు చెందిన సీన్ పెన్ టెలివిజన్‌లో కెరీర్ ఆరంభించి అనంతరం నటుడిగా మారాడు. పలు చిత్రాలకు దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్‌‌గాను పని చేశాడు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని డాక్యుమెంటరీగా షూట్ చేసేందుకు గతేడాది నవంబర్‌లో కీవ్‌కు వెళ్లాడు. ఉక్రెయిన్ మిలిటరి సిబ్బందితో మాట్లాడి డాక్యుమెంటరీని షూట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ షూట్ జరుగుతుండగానే రష్యా, ఉక్రెయిన్‌పై దండెత్తింది. దీంతో ఉక్రెయిన్‌ను వదిలి పారిపోవాల్సి వచ్చింది. కాలినడకన ఆ దేశాన్ని వదిలి వెళుతున్న ఫొటోను అతడు ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ‘‘నేను, నా ఇద్దరు కొలీగ్స్ రోడ్డు పక్కన కారును వదిలివేసి వేలాది మైళ్లు ప్రయాణించి పోలాండ్ సరిహద్దుకు చేరుకున్నాం. ఈ ఫొటోలో మీకు కన్పిస్తున్న అన్ని కార్లల్లో పిల్లలు, మహిళలే ఉన్నారు. వారి వద్ద ఎటువంటి లగేజీ లేదు. కారు మాత్రమే వారి వెంట ఉన్న ఏకైక ఆస్తి’’ అని సీన్ పెన్ రాశాడు.  


సీన్ పెన్ మాత్రం ఉక్రెయిన్‌ను ఎందుకు వదిలి వేయాల్సి వచ్చిందనే విషయాన్ని ట్వీట్‌లో పేర్కొనలేదు. అనంతరం అతడి అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడాడు. ఉక్రెయిన్ నుంచి సీన్ పెన్ సురక్షితంగా బయటపడ్డాడని వివరించాడు. ‘మిస్టిక్ రివర్’, ‘మిల్క్’ చిత్రాల్లోని పాత్రలకు గాను సీన్ పెన్ అస్కార్ అవార్డును గెలుచుకున్నాడు. పలు మార్లు ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు ప్రజలను ఆదుకున్నాడు. 2010 హైతీ భూకంపం, 2012 పాకిస్థాన్ వరదల సమయంలో బాధితులకు సహాయం అందించాడు. డిస్కవరీ ప్లస్ కోసం అతడు డాక్యుమెంటరీని చిత్రీకరించేందుకు కీవ్ వెళ్లినట్టు తెలుస్తోంది.



Updated Date - 2022-03-02T22:13:37+05:30 IST