Samyuktha Menon: ఇప్పటి వ‌ర‌కు నాకెవ‌రూ అలాంటి కాంప్లిమెంట్ ఇవ్వలేదు

ABN , First Publish Date - 2022-07-27T03:10:38+05:30 IST

నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న చిత్రం ‘బింబిసార’ (Bimbisara). నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది

Samyuktha Menon: ఇప్పటి వ‌ర‌కు నాకెవ‌రూ అలాంటి కాంప్లిమెంట్ ఇవ్వలేదు

నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న  చిత్రం ‘బింబిసార’ (Bimbisara). నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ట్యాగ్‌లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆగస్ట్ 5న గ్రాండ్‌గా ఈ  సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఆమె తెలిపిన ‘బింబిసార’ విశేషాలివే..


‘‘ఈ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. నేను ఇప్పటి వ‌ర‌కు చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవ‌చ్చు. నేను చేసిన పాత్రకు మ‌రొక‌రు డ‌బ్బింగ్ చెప్పట‌మ‌నేది నాకు ఇష్టం లేదు. రేపు నా పాత్రను నేను స్క్రీన్‌పై చూసుకున్నప్పుడు దాన్ని ఓన్ చేసుకోగ‌ల‌గాలి. భాష తెలియ‌కుండా న‌టిస్తే ఆ పాత్రతో ఉన్న క‌నెక్షన్‌లో యాభై శాతాన్ని కోల్పోతాన‌ని భావించాను. నా పాత్రల విష‌యంలో నేను స్వార్థప‌రురాలిన‌నే చెప్పుకోవాలి. నా పాత్రల‌ను నేను అంతగా ప్రేమిస్తాను. అందుక‌నే నేను తెలుగు నేర్చుకోవాల‌ని నిర్ణయించుకున్నాను. మ‌నం తెలుగులో మాట్లాడిన‌ప్పుడు మ‌న‌తో ఇత‌ర యూనిట్ సభ్యుల‌కు తెలియ‌ని ఓ అనుబంధం ఏర్పడుతుంది.  ఆ విషయాన్ని నేను బ‌లంగా న‌మ్ముతాను. అందుక‌ని ప్రత్యేకంగా ట్యూట‌ర్‌ని పెట్టుకుని లాక్ డౌన్ స‌మయంలో తెలుగు నేర్చుకున్నాను.


నేను యాక్టర్ కావాల‌ని ఎప్పుడూ అనుకోలేదు. చ‌దువు పూర్తయిన త‌ర్వాత జాబ్ చేయాల‌ని అనుకున్నాను. అయితే న‌టిగా అవ‌కాశం వ‌చ్చింది. తెలుగులో న‌టించ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. చాలా మంది ఎందుక‌ని తెలుగులో చేయ‌టం లేద‌ని కూడా అడిగారు. అయితే నిజానికి రెండు, మూడు సినిమాల‌కు ఆడిష‌న్ జ‌రిగినా అవి వ‌ర్కవుట్ కాలేదు. లాక్ డౌన్ త‌ర్వాత తెలుగు సినిమా నుంచి వ‌చ్చిన అవ‌కాశం ‘బింబిసార‌’. సినిమాను రెండు భాగాలుగా చేయ‌బోతున్నామ‌ని డైరెక్టర్ వ‌శిష్ట చెప్పారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ 15వ చిత్రంలో అవకాశం వచ్చింది. తర్వాత ‘భీమ్లా నాయక్’ సినిమా ఛాన్స్ వచ్చింది. ఒకే రోజు రెండు సినిమాలు (భీమ్లా నాయ‌క్‌, ధ‌నుష్ మూవీ ‘సార్‌’ ) సైన్ చేశాను. ఎవ‌రూ ఊహించ‌లేదు. మా అమ్మగారైతే ఆశ్చర్యపోయారు.


‘బింబిసార’ టైమ్ ట్రావెల్ మూవీ. ఇందులో ఫ్లాష్ బ్యాక్‌, ప్రస్తుతం సాగే క‌థ అని రెండు భాగాలుంటాయి. అందులో ప్రెజంట్ అంటూ సాగే స్టోరీలో నా పాత్ర క‌నిపిస్తుంది. కాస్త మోడ్రన్‌గా కనిపించే పాత్ర. నాకు పీరియాడిక్ సినిమాలంటే చాలా ఇష్టం. డైరెక్టర్ వ‌శిష్ట ఈ క‌థ చెప్పగానే నాకు అందులో ఫ్లాష్ బ్యాక్‌ పాత్ర చేయాల‌నిపించింది. అది డ్రీమ్ కూడా. ఆ విష‌యంలో కాస్త బాధ‌గా కూడా అనిపించింది.


క‌ళ్యాణ్‌రామ్‌గారి క‌ళ్లలో చాలా ప‌వ‌ర్ ఉంది. ఆయ‌న మాట‌ల కంటే ముందు క‌ళ్లతోనే మాట్లాడుతారు. ఆయన్ని బింబిసారుడి పాత్రలో చూడ‌గానే న‌చ్చేశారు. గంభీరంగా క‌నిపించారు. చాలా మంచి వ్యక్తి. షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత న‌న్ను ప్రత్యేకంగా క‌లిసి మీరు మా సినిమాలో భాగ‌మైనందుకు చాలా ఆనందంగా ఉంద‌ని అన్నారు. ఇప్పటి వ‌ర‌కు నాకెవ‌రూ అలాంటి కాంప్లిమెంట్ ఇవ్వలేదు. డైరెక్టర్ వ‌శిష్ట్ ఎన‌ర్జీ న‌చ్చుతుంది. ఖాళీగా కూర్చోరు. సెట్ అంతా తిరుగుతుంటారు. క‌రెక్షన్స్ చెబుతుంటారు.


మ‌ల‌యాళంలో సినిమాల‌ను చ‌క‌చ‌కా పూర్తి చేసేస్తుంటారు. ఈ ఏడాది నేను చేసిన భీమ్లా నాయ‌క్‌, బింబిసార, క‌డువా, సార్‌.. నాలుగు చిత్రాల్లో 20 రోజుల చొప్పున వ‌ర్క్ చేశాను. నాకు ఖాళీగా ఉండ‌టం ఇష్టం ఉండ‌దు. సినిమాలు చూస్తాను. లేదా పెద్ద స్టార్స్ ఇంట‌ర్వ్యూలు చూస్తుంటాను. స‌క్సెస్‌ ఎలా అయ్యార‌ని ఆలోచిస్తుంటాను. సినిమాలంటే అంత ప్యాష‌న్ నాకు. తెలుగు ప్రేక్షకులు చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటారు. సినిమాలను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎమోష‌న్స్‌ను చ‌క్కగా చూపెడ‌తారు. మాస్ సినిమాల్లో అరిచి గోల పెడుతారు. యాక్టర్స్‌ను ఓన్ చేసుకుంటారు. నాకు ఇలాంటి పాత్రలే చేయాల‌నే ఆలోచనేం లేదు. న‌టిగా మంచి పాత్రల‌తో గుర్తుండిపోవాల‌ని అనుకుంటున్నాను.


మ‌ల‌యాళంలో ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్నాను. ఆ వివ‌రాల‌ను ఇప్పుడే చెప్పలేను. తెలుగులో ‘సార్’ సినిమా చేస్తున్నాను. ఓ సాంగ్ మిన‌హా నా పాత్రకు సంబంధించిన చిత్రీక‌ర‌ణంతా పూర్తయ్యింది..’’ అని సంయుక్తా మీనన్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-07-27T03:10:38+05:30 IST