Radhika Apte: గొప్ప నటే.. కానీ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్

ABN , First Publish Date - 2022-09-08T03:31:13+05:30 IST

రాధిక ఆప్టే.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆమె నటించిన చిత్రాలు చాలా తక్కువే అయినా.. నటిగా తనదైన ముద్రను వేసుకుంది. రంగస్థల నటిగా వెండితెరకు పరిచయమైన రాధిక ఆప్టే

Radhika Apte: గొప్ప నటే.. కానీ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్

రాధిక ఆప్టే.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆమె నటించిన చిత్రాలు చాలా తక్కువే అయినా.. నటిగా తనదైన ముద్రను వేసుకుంది. రంగస్థల నటిగా వెండితెరకు పరిచయమైన రాధిక ఆప్టే (Radhika Apte).. స్వతహాగా మరాఠీ నటి. ఆమె తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. అయినా ఆ రంగాన్ని ఎన్నుకోకుండా నటిగా వెండితెరవైపు అడుగులు వేసింది. ఈ రోజు సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గానే కాకుండా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అనేలా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె సౌత్ చిత్రాలేవీ చేయడం లేదు కానీ.. బాలీవుడ్‌లో మాత్రం అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉంది. కాకపోతే.. సినిమాల కంటే కూడా.. ఆమె సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు, ఇంటర్వ్యూలలో ఆమె చెప్పే విషయాలు కాంట్రవర్సీ అవుతూ.. ఆమెను వార్తలలో ఉండేలా చేస్తుంటాయి. ఇక రీసెంట్‌గా ఆమె పేల్చిన బాంబ్ అయితే.. టాలీవుడ్‌ని కుదిపేసింది. పెళ్లి అయినా కూడా.. పెళ్లి కానట్టు ఉండే రాధిక ఆప్టే.. తన పెళ్లికి సంబంధించి చెప్పే విషయాలైతే ఆశ్చర్యపరుస్తాయి. సెప్టెంబర్ 7 ఆమె పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు..


ముక్కుసూటిగా మాట్లాడే హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. అందులో కచ్చితంగా రాధిక ఆప్టే పేరు ఉంటుంది. ఆమె ఏ విషయంలోనూ.. భయపడదు.. ధైర్యంగా సమాధానమిచ్చేస్తుంది. తద్వారా ఆమెకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని కూడా ఆలోచించదు. అలాంటి ధీర వనిత రాధిక ఆప్టే. 2005లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాధికకు సరైన హిట్ పడకపోయినా.. నటిగా మాత్రం మంచి పేరే వచ్చింది. ఇక 2016లో ఆమె నటించిన ‘పార్చ్‌డ్’ సినిమాతో ప్రేక్షకులలో ఆమెపై ఆగ్రహం పెరిగింది. ఆ ఆగ్రహం ఆమె సినిమాలను బ్యాన్ చేయాలనే స్థాయికి చేరింది. అప్పటి నుంచి అభిమానుల కోపానికి గురైన రాధికకు సరైన అవకాశాలు కూడా రాలేదు. అయినా కూడా ఆమె ఇండస్ట్రీని వదిలి పెట్టకుండా.. పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పుడు చేసే సినిమాలలో తన పాత్రకి ప్రాముఖ్యత ఉంటేనే ఆమె సినిమా చేస్తుంది.. లేదంటే వెంటనే నో చెప్పేస్తుంది. అందుకే ఆమె ఖాతాలో సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.


ఇక ‘రక్తచరిత్ర’ చిత్రంతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన రాధిక ఆప్టే.. ఆ సినిమా తర్వాత ‘ధోని, లెజెండ్, కబాలి, లయన్’ వంటి సినిమాలలో నటించింది. ఆ తర్వాత సౌత్ సినిమాలలో ఆమె చేయలేదు. ఛాన్సులు కూడా రాలేదు. రీసెంట్‌గా టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరో అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమోగింది. టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని.. అతనికి అప్పుడే అందరి ముందూ వార్నింగ్ ఇచ్చానని రాధిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక నటీనటుల సర్జరీలపై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘ఇండస్ట్రీలో చాలా మంది వారి వయసు కనిపించకుండా ఉండేందుకు పోరాటం చేస్తున్నారు. ముఖాన్ని, శరీరాన్ని వారికి కావాల్సిన విధంగా మార్చుకోవడానికి సర్జరీలు చేయించుకుంటున్నారు. అది నా వల్ల కాదు. అలాంటి మాటలతో నాకు విసుగొస్తుంది..’ అనేలా ఆమె చేసిన కామెంట్స్ అప్పట్లో వివాదానికి కారణమయ్యాయి.


వీసా కోసమే పెళ్లి..

ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలే కాకుండా.. తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని షేర్ చేసుకోవడానికి కూడా ఆమె వెనుకాడలేదు. ‘నాకు పెళ్లివ్యవస్థపై అస్సలు నమ్మకం లేదు. అందరూ అడగవచ్చు.. మరి మీరెందుకు పెళ్లి చేసుకున్నారని. అందుకు నేను చెప్పే సమాధానం ఒక్కటే.. వీసా కోసమే పెళ్లి చేసుకున్నాను. విదేశీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వీసా ఈజీగా వస్తుందనే పెళ్లి చేసుకున్నాను’ అంటూ బ్రిటన్‌‌కి చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ని ఆమె పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని తెలిపింది. అయితే వివాహ వ్యవస్థపై నమ్మకం లేదంటూ ఆమె చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. అందుకే ఆమెను కాంట్రీవర్సీకి కేరాఫ్ అడ్రస్ అని అంటుంటారు. ఇలా ఒక్కటనే కాదు.. ఈ మధ్య ప్రతి విషయంలోనూ ఆమె పేరు వైరల్ అవుతూనే ఉంది.. ఆ తర్వాత కాంట్రీవర్సీ చోటు చేసుకుంటూనే ఉంది. అయినా ఆమెలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం ఆమె ‘విక్రమ్ వేద’, ‘మోనికా.. ఓ మై డార్లింగ్’ అనే చిత్రాలలో నటిస్తోంది. 

Updated Date - 2022-09-08T03:31:13+05:30 IST