రాధిక ఏం చేసినా దానికో కారణం ఉంటుంది: నేహా శెట్టి

ABN , First Publish Date - 2022-02-05T03:51:43+05:30 IST

రాధిక ఈతరం అమ్మాయి.. నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది, తను కరెక్ట్ అనుకున్న పనిని చేస్తుంది. ఎ‌వరేం అనుకుంటారు అనేదాని గురించి ఆలోచించదు. తను తీసుకునే నిర్ణయాల గురించి పూర్తి స్పష్టతతో ఉంటుంది. రాధిక క్యారెక్టర్‌ను

రాధిక ఏం చేసినా దానికో కారణం ఉంటుంది: నేహా శెట్టి

రాధిక పాత్రలో యువ హీరోయిన్ నేహా శెట్టి నటించిన చిత్రం ‘డిజె టిల్లు’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. 


ఆమె మాట్లాడుతూ..

‘‘చిన్నప్పటి నుండి నాకు నటి కావాలనే కోరిక ఉండేది. హృతిక్ రోషన్ సినిమాలలో డాన్సులు చూసి చిత్రరంగంపై ఇష్టాన్ని పెంచుకున్నాను. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేశాను. మలయాళంలో ముంగారమళై 2 చిత్రంలో, తెలుగులో పూరీ జగన్నాథ్‌గారి ‘మెహబూబా’ చిత్రంలో నటించాను. ఆ తర్వాత యూఎస్ వెళ్లి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో కోర్సు నేర్చుకున్నాను. అక్కడి నుంచి వచ్చాక గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లో చిన్న రోల్ చేశాను. ఇప్పుడు ‘డిజె టిల్లు’ సినిమా విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి ప్రముఖ సంస్థలో అవకాశం వస్తే ఎలా కాదనుకుంటాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి బ్యానర్ ఒక్కటే కారణం కాదు, మంచి స్క్రిప్ట్ ఉంది. సిద్ధూ, విమల్ క్రియేటివ్‌గా సినిమాని ఫన్‌గా డిజైన్ చేశారు. ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు కానీ ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన ఒక ప్యాకేజ్ లాంటిది. ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి.


ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతా రాధిక ఆప్తే అని పిలుస్తున్నారు. రాధిక ఈతరం అమ్మాయి.. నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది, తను కరెక్ట్ అనుకున్న పనిని చేస్తుంది. ఎ‌వరేం అనుకుంటారు అనేదాని గురించి ఆలోచించదు. తను తీసుకునే నిర్ణయాల గురించి పూర్తి స్పష్టతతో ఉంటుంది. రాధిక క్యారెక్టర్‌ను నేను త్వరగా అర్థం చేసుకోగలిగాను. ఆ పాత్రలా మారిపోయాను. తప్పును తప్పులా ఒప్పును ఒప్పుగా చెబుతుంది. నేను రాధిక క్యారెక్టర్‌తో చాలా రిలేట్ చేసుకోగలను. ఇలాంటి పాత్రను నేను సినిమాల్లో ఇప్పటిదాకా చూడలేదు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న పాత్ర అది. రాధిక పాత్రలో నటించేప్పుడు దర్శకుడు విమల్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నానుంచి సహజంగా ఆ పాత్ర స్వభావం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నారు. రాధిక పాత్ర చేసేందుకు ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు. సహజంగా నాకు అనిపించినట్లు నటించాను.


ఈ సినిమా కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నాను. నాకు తెలంగాణ యాస కొత్త. ఈ యాసలో కామెడీ చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ యాసలో ఇంకా సినిమాలు రావాలి. చాలా ఫ్రెష్ కామెడీ కథలో ఉంటుంది. హీరోను రాధిక కన్ఫ్యూజ్ చేసినట్లు ట్రైలర్‌లో చూపించాం. రాధిక ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. అదేంటి అనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. సిద్ధు టాలెంటెట్ యాక్టర్. అతను యాక్ట్ చేస్తుంటే నేనే నవ్వు ఆపుకోలేకపోయాను. అతను రచయిత, గాయకుడు కూడా. సిద్ధు నుంచి నటనలో చాలా విషయాలు నేర్చుకున్నాను. పాండమిక్ వల్ల మనమంతా ఒత్తిడికి గురై, బాధపడ్డాం. ఆ ఒత్తిడినంతా డిజె టిల్లు చూస్తే నవ్వుతూ మర్చిపోతారని చెప్పగలను. త్వరలోనే నా ఇతర ప్రాజెక్ట్స్ గురించి తెలియజేస్తాను..’’ అని తెలిపారు.

Updated Date - 2022-02-05T03:51:43+05:30 IST