లైంగిక వేధింపులకు గురైన అందరు మహిళల తరఫునే నా పోరాటం : భావన

ABN , First Publish Date - 2022-03-07T01:05:52+05:30 IST

ప్రముఖ మలయాళ నటి భావన తనపై జరిగిన లైంగిక దాడి

లైంగిక వేధింపులకు గురైన అందరు మహిళల తరఫునే నా పోరాటం : భావన

ప్రముఖ మలయాళ నటి భావన తనపై జరిగిన లైంగిక దాడి ఘటన గురించి స్పందించింది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అప్పటి ఘటనపై మాట్లాడింది. భావనను మలయాళ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. 2017 ఫిబ్రవరి 17న ఆమె షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో దీలీప్ ఆదేశాల మేరకు కొందరు నిందితులు భావనని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేశారు. ఈ మేరకు హీరోయిన్ భావన ఇచ్చిన కంప్లైంట్‌తో దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు బెయిల్‌పై బయట ఉన్నాడు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. 


లైంగిక దాడి ఘటనతో తన జీవితం తలకిందులైందని భావన చెప్పింది. అది ఓ భయంకరమైన పీడకల అని తెలిపింది. ఈ ఘటనతో తనను తాను నిందించుకున్నానని వివరించింది. ఈ ఘటన జరిగినప్పుడు తనకు ఎంతో మంది అండగా నిలిచారని వివరించింది. ‘‘కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో 15రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో నేను ఒంటరిననే భావన కలిగింది. ఎంతగానో కుంగిపోయాను. నేను ఏ తప్పు చేయలేదు. కాబట్టి పోరాడాలని నిర్ణయించుకున్నాను. కోర్టుకు 15వ రోజు వచ్చాక నేను బాధితురాలిని కాదు పోరాట యోధురాలినని నా మనస్సుకు నేను చెప్పుకొన్నాను. ఐదు ఏళ్ల ప్రయాణం చాలా ఇబ్బందిగా గడిచింది. ఇది ఫేక్ కేస్ అని కొంత మంది నిందను నాపై మోపారు. సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. నా తల్లిదండ్రులను అవమానించారు. నన్ను బెదిరిస్తూ మెసేజ్‌లు పంపించారు’’ అని భావన చెప్పింది. 


తనకు అండగా నిలిచిన వారికి భావన కృతజ్ఞతలు తెలిపింది. ‘‘నేను ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించాలనుకుంటున్నాను. నాకు అండగా నిలిచిన కుటుంబం, స్నేహితులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నేను చివరి వరకు పోరాటం చేస్తునే ఉంటాను. ఇటువంటి ఘటనలను బయట పెట్టాలంటే మహిళలు భయపడతారు. కానీ, ఆ ఘటనలను తలచుకున్నప్పుడు ఘోరంగా ఉంటుంది. కొంత మంది మహిళలు తమపై జరిగిన అఘాయిత్యాలను నాతో పంచుకున్నారు. వారందరి తరఫున నేను పోరాటం చేస్తున్నానన్నారు. కొందరు చెప్పిన విషయాలైతే చాలా ఘోరంగా ఉన్నాయి. వాటిని విని నాకు చాలా బాధేసింది. కొంతమంది భయపడి బాధను తమలోనే ఉంచుకుంటారు. తమ జీవితం తలకిందులైపోతుందని భయపడతారు’’ అని భావన వివరించింది. ఫలితం గురించి ఆలోచించకుండా చివరి వరకు తన పోరాటన్ని కొనసాగిస్తానని భావన తెలిపింది. అటువంటి వారికి శిక్ష పడేలా చేస్తానని పేర్కొంది.

Updated Date - 2022-03-07T01:05:52+05:30 IST